Tollywood: 'మా' మద్దతు మాకే అంటున్న ఛాంబర్...
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:50 PM
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకునే నిర్ణయాలను బలపరుస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యకుడు మంచు విష్ణు తెలిపారు. ఈ విషయాన్ని ఛాంబర్ కోశాధికారి ప్రసన్న కుమార్ మీడియాకు చెప్పారు.
తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎంతోకాలంగా వేతనాలు పెంచమని అడుగుతున్నా ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు పట్టించుకోలేదని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ చెబుతున్నారు. సినిమా కార్మికుల వేతనాలు ఎక్కువ అని కొందరు చెబుతున్నారు కానీ కార్మికులు రోజుకు 15 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. యూనియన్లను కాదని ప్రైవేటు వ్యక్తులతో పని చేయించుకుని శ్రమదోపిడికి నిర్మాతలు పాల్పడబోతున్నారని అన్నారు.
ఇదిలా ఉంటే ఫిల్మ్ ఛాంబర్ వాదన, నిర్మాతల వాదన మరో రకంగా ఉంది. తాము పేద సినీ కార్మికులకు అండగా ఉంటామని వారు చెబుతున్నారు. సినిమా రంగానికి చెందిన యూనియన్లు సభ్యత్వం పేరుతో ఏడెనిమిది లక్షల రూపాయలను వసూలు చేస్తున్నాయని అంటున్నారు. ఈ విషయం గురించి నిర్మాతల మండలి సెక్రటరీ, ఫిల్మ్ ఛాంబర్ కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, 'ఐటీ ఎంప్లాయిస్ కంటే సినిమా కార్మికుల వేతనాలు ఎక్కువ'ని అన్నారు. అలానే లేబర్ యాక్ట్ ప్రకారం నిర్మాతలు కార్మికులకు ఎక్కువగానే చెల్లిస్తున్నారని తెలిపారు. ఫెడరేషన్ లోని యూనియన్ల కార్మికులతోనే పనిచేయాలనే నిబంధన చట్ట వ్యతిరేకమని, కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ను ఇది ధిక్కరించినట్టు అవుతుందని అన్నారు. ఫెడరేషన్ వాళ్ళవి ఏకపక్ష నిర్ణయాలని ప్రసన్న కుమార్ చెప్పారు. కార్మికులు సైతం తమతోనే ఉంటారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ, ఇప్పుడన్న వేతనాలను 30 శాతం పెంచితే చిన్న నిర్మాతలు చితికిపోతారని వాపోయారు.
కాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గంతో చర్చించారని కోశాధికారి ప్రసన్న కుమార్ తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ తీసుకునే నిర్ణయాలకు 'మా' మద్దుతు పలుకుతుందని విష్ణు తనతో చెప్పారని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే... కొంతమంది నిర్మాతలు నైపుణ్యం ఉన్న వారెవరైనా తమను సంప్రదించి, వివిధ శాఖలలో పనిచేయవచ్చునంటూ సోషల్ మీడియా ద్వారా దరఖాస్తులను కోరడం మొదలు పెట్టారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కు చెందిన వైజయంతి మూవీస్ సంస్థ కూడా టాలెంట్ పర్సన్స్ ను ఎంపిక చేసుకునే పనిలో పడింది. అలానే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ... ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ లాయర్ నోటీసును పంపింది. ఛాంబర్, ఫెడరేషన్, లేబర్ కమీషన్ మధ్య ప్రస్తుతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొంతమంది నిర్మాతలు సైతం ఈ సాయంత్రం చిరంజీవిని కలిసి పరిస్థితిని వివరించబోతున్నారు.
Also Read: Zootopia 2: కొత్త పాత్రలతో డిస్నీ అదిరే సీక్వెల్.. నవంబర్‌లో థియేటర్లలోకి జూటోపియా 2
Also Read: Director SJ shiva: నిర్మాతల డబ్బు విరాళంగా మారుతోంది