Janaki Vs State of Kerala: వివాదాల సుడిగుండం నుండి బయటకు..
ABN , Publish Date - Jul 10 , 2025 | 01:29 PM
ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ నటించిన 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రం విడుదలకు మార్గం సుగమం అయ్యింది. సెన్సార్ బృందం చేసిన చిన్న చిన్న సవరణలకు దర్శక నిర్మాతలు అంగీకారం తెలిపారని తెలుస్తోంది.
ప్రముఖ మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ లాయర్ గా నటించిన 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రం గత కొంతకాలంగా సెన్సార్ ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. కేరళలోని సి.బి.ఎఫ్.సి. సభ్యులు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ముంబై లోని ప్రధాన కార్యాలయంలోని అధికారులు దీనికి మోకాలడ్డారు. దాంతో ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది.
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రంలో కథానాయికగా నటించిన అనుపమా పరమేశ్వరన్ పేరు జానకి. మానభంగానికి గురైన ఆమె కోర్టులో న్యాయం కోసం పోరాడే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అయితే జానకి అనే పేరు హిందువులు ఆరాధించే సీతాదేవి పేరుల్లో ఒకటి కాబట్టి దానిని మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ సర్టిఫికేషన్ సూచన చేసింది. అందుకు అంగీకరించని ఆ చిత్ర దర్శక నిర్మాతలు కేరళ హైకోర్ట్ తలుపు తట్టారు. గత వారం జస్టిస్ నగరేశ్ ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు.
తాజాగా బుధవారం సెన్సార్ బోర్డ్ తరఫున అభినవ్ చంద్రచూడ్ ఈ సినిమా విడుదలకు సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. ఇందులో కథానాయిక పేరు జానకి విద్యాధరన్ కాబట్టి టైటిల్ లో కేవలం జానకి అని కాకుండా జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని కానీ లేకపోతే వి. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అని గానీ పెట్టాలని సూచించారు. అలానే సినిమాలో కోర్ట్ లో డిఫెన్స్ లాయర్ 'జానకి' అనే పేరును రెండు చోట్ల ఒత్తి పలకడాన్ని తొలగించాల్సింది అభినవ్ కోరారు. మానభంగానికి గురైన జానకిని ఇంటరాగేట్ చేసే క్రమంలో లాయర్ చాలా దారుణమైన పదాలను ఉపయోగించారని, ఆ సందర్భంలో జానకి అనే పేరును పదే పదే పలకడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతినే ఆస్కారం ఉందని ఆయన చెప్పారు. ఎందుకంటే ఎదుటి లాయర్ ను మరో మతానికి చెందిన వారిగా ఇందులో చూపించారని అన్నారు. దీనికి నిర్మాతలు ఆమోదం తెలిపి, సినిమా కాపీని మార్పులతో అందిస్తే... మూడు రోజుల్లో సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని సి.బి.ఎఫ్.సి. తరఫు లాయర్ తెలిపారు. ఇప్పటికే విడుదల ఆలస్యమైన ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా మలయాళ, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మేకర్స్ విడుదల చేయాలనుకుంటున్నారు. దాంతో సెన్సార్ బోర్డ్ తెలిపిన సవరణలకు వారు అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో కేసును జులై 16కు వాయిదా వేశారు. బహుశా ఆ రోజుకు సినిమా రిలీజ్ డేట్ ను సైతం మేకర్స్ ప్రకటించే ఆస్కారం ఉంది.
Also Read: Hari Hara Veera Mallu: దర్శకుడు జ్యోతికృష్ణ ఎమోషనల్ పోస్ట్
Also Read: Atlee: మరోసారి పుష్పరాజ్ సరసన...