The Girlfriend: సింగర్ ను డిన్నర్ కు పిలుస్తానంటున్న రశ్మిక...

ABN , Publish Date - Aug 05 , 2025 | 10:51 AM

నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తాజా చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్' పాటల రికార్డింగ్ జరుగుతోంది. తాజాగా సెకండ్ సింగిల్ ను రికార్డ్ చేశారు.

The Girlfriend

యువ నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) 'అందాల రాక్షసి'తో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా... ఏడేళ్ళ క్రితం 'చి.ల.సౌ'తో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున్ హీరోగా 'మన్మథుడు 2' మూవీని తెరెక్కించాడు. మొదటి సినిమా చక్కని విజయాన్ని అందుకున్నా... రెండో సినిమా నిరాశకు గురిచేసింది. అయితే ఇప్పుడు మరోసారి అతను 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend) మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాను ఫస్ట్ సింగిల్ విడుదలై చక్కని ఆదరణ పొందింది. తాజాగా రెండో పాటను రికార్డ్ చేశారు.


ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ పెట్టిన ఓచిలిపి పోస్ట్ కు చిత్ర కథానాయిక రశ్మిక మందణ్ణ తన దైన స్టైల్ లో రిప్లయ్ ఇచ్చింది. ఈ పాట రికార్డ్ కు సంబంధించిన చిన్నపాటి వీడియోను రాహుల్ సోమవారం ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఈ సెకండ్ సింగిల్ ను రాహుల్ రవీంద్రన్ భార్య, ప్రముఖ గాయనీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గానం చేసింది. ఆవిడ కనీకనిపించకుండా ఉన్న ఈ వీడియోను పోస్ట్ చేస్తూ... రాహుల్ రవీంద్రన్... 'ఈ సింగర్ ఈ సెకండ్ సింగిల్ ను అద్భుతంగా పాడింది. ఆవిడంటే నాకెంతో క్రష్. రాత్రికి డిన్నర్ కు వస్తుందేమో అడగాలి' అని పెట్టాడు. దానికి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెట్టారు. రాహుల్ లోని చిలిపి భర్త ఈ పోస్ట్ తో బయట పడ్డాడని కొందరు వ్యాఖ్యానించారు. అయితే రశ్మిక మందణ్ణ మాత్రం... 'రాహులా... నువ్వు ఆమెను డిన్నర్ కు అడక్కపోతే నేను రెడీ' అంటూ కామెంట్ చేసింది. ఓ పక్క పక్కా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే రశ్మిక మందణ్ణ 'ది గర్ల్ ఫ్రెండ్' లాంటి ఉమన్ సెంట్రిక్ మూవీ చేయడం విశేషం. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హెషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) దీనికి సంగీతం అందిస్తున్నాడు. దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Updated Date - Aug 05 , 2025 | 10:55 AM