Mass Jathara Postponed: అఫీషియల్ గా ప్రకటించిన నిర్మాణ సంస్థ
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:24 PM
మాస్ మహరాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర' మరోసారి వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా కన్షర్మ్ కాలేదు. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామంటున్నారు నిర్మాతలు.
ఆగస్ట్ 27న విడుదల కావాల్సిన రవితేజ (Ravitej) 75వ చిత్రం 'మాస్ జాతర' (Mass Jathara), సెప్టెంబర్ 5న రావాల్సిన 'మిరాయి' (Mirai) సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ వార్త సోషల్ మీడియాలో కొంత కాలంగా హల్చల్ చేస్తోంది. కానీ మేకర్స్ మాత్రం అధికారిక ప్రకటన ఏది ఇవ్వకుండా లిప్ టైట్ తో ఉండిపోయారు. ఎట్టకేలకు 'మాస్ జాతర' విడుదల వాయిదా వేశామంటూ నిర్మాత తెలిపారు. ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు, కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. దీంతో మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' చిత్రం ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల కాదన్నది స్పష్టమైపోయింది.
'మాస్ జాతర' చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
Also Read: Vishnu Priya: మరోసారి.. విష్ణు ప్రియ అందాల తాండవం
Also Read: The Girlfriend: రష్మిక.. ఏం జరుగుతుంది! లిరికల్ వీడియో వచ్చేసింది