Mass Jathara: కొత్తదనం లేని ‘మాస్ జాతర’ టీజర్.. రియాక్షన్
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:41 PM
రవితేజ.. మాస్ జాతర మూవీ టీజర్ సోమవారం రిలీజ్ అయింది.
మిస్టర్ బచ్చన్ వంటి డిజాస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా వస్తున్న చిత్రం మాస్ జాతర (Mass Jathara). ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. గతంలో గల్లీ రౌడీ, వివాహ భోజనంబు, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలకు స్కీన్ ప్లే అందించిన భాను భోగవరపు (Bhanu Bogavarapu) దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 27న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. అదెలా ఉందో చూద్దాం…
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఇటీవల మూవీ ప్రచారంలో జోరు పెంచింది చిత్ర యూనిట్. ఇటీవల విడుదల చేసిన ‘ఓలే ఓలే…’ పాటకు అన్ని వర్గాల నుంచి మిమర్శలను ఎదుర్కొన్న నేపథ్యంలో అందరి కన్ను టీజర్ పై పడింది. సోమవారం ఉదయం వచ్చిన టీజర్ లో రవితేజ రైల్వే పోలీస్ అని, కాలేజీకి వెళ్లే యువతి పాత్రలో శ్రీలీల, వయస్సు మళ్లిన పాత్రలో నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ సందడి చేశారు.
ఆయన డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిఫార్ట్ మెంట్లలో వేలు పెడుతుంటాడు.. నాకంటూ ఓ హిస్టరీ ఉంది.. డిస్టర్బ్ చేశారనుకోండి చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతాడు వంటి డైలాగులతో నిండిన టీజర్ ఆశించిన హైప్ మాత్రం క్రియేట్ చేయలేక పోయిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరో పోరాటం ఎవరి మీద అనే స్పష్టత లేకపోవడం మైనస్ అనిపిస్తోంది.
1 నిమిషం 35 సెకన్లు ఉన్న టీజర్లో రవితేజ మార్క్ ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ బాగానే ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది. కొన్ని సీన్స్ పరమ రొటీన్‌గా తన ముందు చిత్రాలలో ఉన్నట్లుగానే ఉన్నాయనిపించింది. అదీ కాకుండా శ్రీలీలతో ఓ సీన్లో ‘చేసేద్దామా ఏంటి..’ అనే డైలాగ్‌తో ధమాకా మూవీ టీజర్ స్టైల్ ను ఫాలో అయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడా విలన్‌ను చూపించకుండా కట్ చేసిన ఈ టీజర్ ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా కాస్త నిరుత్సాహ పరిచేలా ఉందనే చెప్పాలి. దీంతో మరో వారం తర్వాత రిలీజ్ చేసే ట్రైలర్‌తో మేకర్స్ ఆకట్టుకుంటారని ఆశిద్దాం.