Shootings Bandh: చిరంజీవితో సినీ కార్మికుల మిలాఖత్
ABN, Publish Date - Aug 18 , 2025 | 08:01 PM
సోమవారం సాయంత్రం ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు చిరంజీవిని కలిసి, తమ కష్టాలను వెళ్లబోసుకున్నారు. 24 క్రాఫ్ట్స్ కు చెందిన 72 మంది ఆయనతో సమావేశమయ్యారు.
ఆగస్ట్ 4వ తేదీ నుండి తెలుగు సినిమా రంగంలో కార్మికులు చేస్తున్న బంద్ ఇంకా కొనసాగుతోంది. మధ్యలో కొన్ని చిత్రాల షూటింగ్ కార్మికుల డిమాండ్ కు అనుగుణంగా సాగాయి. అలానే కొన్ని సినిమాల ప్రారంభోత్సవాలు జరిగాయి. అయితే రోజు రోజుకూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber), ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మధ్య దూరం పెరిగిపోతూ వచ్చింది. వాగ్వివాదాలూ చెలరేగాయి. ఈ నేపథ్యంలో చర్చలు జరగడమే కష్టమైపోయింది. ఇలాంటి సమయంలో తిరిగి నిర్మాతలు మరోసారి చిరంజీవిని కలిశారు. అలానే సోమవారం సాయంత్రం ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు చిరంజీవి (Chiranjeevi) తో తమ కష్టాలను వెళ్లబోసుకున్నారు. 24 క్రాఫ్ట్స్ కు చెందిన 72 మంది ఆయనతో సమావేశమయ్యారు.
ఈ సమావేశానంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని (Anil Kumar Vallabhaneni) మాట్లాడుతూ, 'గత పదిహేను రోజులుగా వేతనాల పెంపు కోసం మేం సమ్మె చేస్తున్నాం. ఇవాళ చిరంజీవి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడారు. నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే తిరిగి నిందలు వేస్తున్నారని, మాకు సమంజసం కాని నిబంధనలు పెడుతున్నారని ఆయనకు తెలియచేశాం. మేం కోరుకునేది ఒక్కటే... వర్కర్స్ బాగుండాలి, వారితో పాటు నిర్మాతలూ బాగుండాలి. వాళ్ళు కోరుతున్నట్టుగా రెండు కండీషన్స్ కు మేం ఒప్పుకుంటే ఏం నష్టపోతామో చిరంజీవి గారికి వివరించాం. అలానే ఆదివారం డబుల్ కాల్షీట్ గురించి కూడా చెప్పాం. మా మీద వచ్చిన నిందల గురించి చిరంజీవి గారికి తెలియచేశాం. మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండీ అని ఆయన భరోసా ఇచ్చారు. రేపు మేం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. అలానే ఛాంబర్ కార్యవర్గం కూడా రేపు మాతో సమావేశం అవుతానని తెలిపింది. వారు చర్చలకు పిలిచారు కాబట్టి మేం నిరసన కార్యక్రమం ఆపేశాం. మేం కోరినట్టుగానే మాకు వేతనాలు పెంచుతారని ఆశిస్తున్నాం. చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా మా సమస్య పరిష్కారం కోసమే మాట్లాడతారు. వారిద్దరూ ఎవరివైపు మెగ్గు చూపించరు' అని అన్నారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు, ఫెడరేషన్ కో-ఆర్డినేటర్ వీరశంకర్ (Veera Sankar) మాట్లాడుతూ, 'సినిమా రంగంలో ఇలాంటి సమ్మెలు గతంలోనూ జరిగాయి. ఇవేవీ కొత్తవి కాదు. గతంలో చెన్నయ్ లో 30, 40 రోజులు షూటింగ్స్ ఆగిపోయాయి. చిరంజీవి గారు ఇవాళ మేం చెప్పింది శ్రద్థగా విన్నారు. నిర్మాతలు కూడా కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి' అని అన్నారు.
Also Read: Rukmini Vasanth: రుక్మిణిని వరిస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్
Also Read: Nandamuri Mokshagna: నందమూరి వారసుడు లుక్ బావుంది.. ఎంట్రీ ఎప్పుడో