Film Chamber: బంద్ పై తేలని వైనం...
ABN , Publish Date - May 21 , 2025 | 08:14 PM
రెండు తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ ను కోరుతున్న నేపథ్యంలో బుధవారం డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ వేరు వేరుగా సమావేశమయ్యారు. వాడీవేడీగా చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయాన్ని వీరు తీసుకోలేకపోయారని తెలుస్తోంది.
గత ఆదివారం సమావేశం అయిన ఆంధ్ర, తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ (Exhibitors) పర్సంటేజ్ విధానానికి అంగీకరించకుంటే... జూన్ 1 నుండి థియేటర్లను మూసివేస్తామని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఉదయం డిస్ట్రిబ్యూటర్స్ (Distrubutors) సమావేశం అయ్యారు. అందులో వాడీవేడిగా చర్చ జరిగింది. షేరింగ్ విధానంపై వీరిలో ఏకాభిప్రాయం కుదరలేదు.
అలానే బుధవారం సాయంత్రం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) లో నిర్మాతలు (Producers) సైతం సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్స్ డిమాండ్లపై చర్చించారు. ఈ సమావేశంలో సురేశ్ బాబు, దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ యలమంచిలి రవిప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, చెరుకూరి సుధాకర్, సునీల్ నారంగ్, డీవీవీ దానయ్య, ఠాగూర్ మధు, ఎ.ఎం. రత్నం, వై.వి.యస్. చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ పై కూలంకషంగా చర్చించిన అనంతరం మరోసారి సమావేశం కావాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. అలానే ఛాంబర్ లోని అన్ని సెక్టార్లతో కలిపి ఓ కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాలను తీసుకోవాలని నిర్మాతలు ప్రతిపాదించినట్టు సమాచారం. మొత్తం మీద ఎగ్జిబిటర్స్ కోరిన పర్సెంటేజ్ విధానంగా ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కానీ అటు నిర్మాతలు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.