Shootings Bandh: చిరు మధ్యవర్తిత్వంతో కొలిక్కి వస్తుందా..
ABN , Publish Date - Aug 17 , 2025 | 08:53 AM
ఆగస్ట్ 4న మొదలైన సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజాగా చిరంజీవి రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆగస్ట్ 4న మొదలైన సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber), ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజాగా చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలోనే చిరంజీవిని కలిసిన సినిమా నిర్మాతలు (Film Producers) తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అయితే ఫెడరేషన్ నేతలతోనూ తాను చర్చలు జరిపిన తర్వాతే తన అభిప్రాయాన్ని వెళ్ళడిస్తానని చిరంజీవి చెప్పారు. ఆ తర్వాత ఈ సమ్మె పలు మలుపులు తిరిగిన నేపథ్యంలో చిరంజీవి దీనిని ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ చర్చల ద్వారానే పరిష్కారం ఆలోచించమని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులూ ఇదే మాట చెప్పారు. కానీ ఛాంబర్, ఫెడరేషన్ కార్యవర్గాల చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడిన నేపథ్యంలో చిరంజీవి మరోసారి రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదివారం చిరంజీవి నివాసంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు విడివిడిగా కలిసి తమ కష్టాలను వెళ్ళబోసుకో బోతున్నారు. ఆ తర్వాత 11 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో కార్యవర్గం సమావేశమౌతుంది. దీని తర్వాత ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ తిరిగి ఫైనల్ గా కూర్చుని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో నిర్మాతలు, కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాలను గురించిన సమాచారం చిరంజీవి సేకరించారని తెలుస్తోంది.
ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం కూడా కొద్ది రోజుల క్రితమే ఫెడరేషన్ తో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఏ నిర్మాత షూటింగ్స్ జరపుకూడదని హుకుం జారీ చేసింది. అలానే ఛాంబర్ పెట్టిన షరతులు తమకు ఆమోద యోగ్యం కాకపోయినా... ఓ మెట్టుదిగి తాము చర్యలు జరపడానికి సిద్థపడ్డామని, అయినా కొందరు నిర్మాతలు హిడెన్ ఎజెండాతో ఈ సమస్యకు పరిష్కారం లభించకుండా మోకాలడ్డుతున్నారని ఫెడరేషన్ నాయకులు అంటున్నారు. మరి చిరంజీవి మధ్యవర్తిత్వంతో అయినా... ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
Also Read: Pragathi: అది ఈ నొప్పులు, బాధల కన్నా గొప్పది
Also Read: Thanal: లావణ్య త్రిపాఠి తమిళ సినిమా ఎప్పుడంటే...