Cinema: టాలీవుడ్ స్టార్స్ తో.. పోటీ మేలని భావిస్తున్న రజనీకాంత్
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:05 PM
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మొత్తానికి ఓ టెక్నిక్ పట్టేశారు... ఆ కిటుకుతోనే రాబోయే ఏడాది కూడా తన 'జైలర్ 2'ను బరిలోకి దింపబోతున్నారట రజనీ... ఇంతకూ ఆయన కనిపెట్టిన టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం...
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్ లో తెరకెక్కిన 'కూలీ' (Coolie) సినిమా ఈ యేడాది ఆగస్టు 14వ తేదీన రిలీజై భారీ వసూళ్ళు చూసింది. అయినప్పటికీ లెక్కలు చూస్తే ఆశించిన స్థాయిలో 'కూలీ' సక్సెస్ సాధించలేదని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఈ సినిమా రిలీజయిన రోజునే 'వార్ 2' జనం ముందు నిలచింది. 'కూలీ'లో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటివారు కూడా నటించారు.. 'వార్ 2'లో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ స్టార్ యన్టీఆర్ కనిపించారు. ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద 'కూలీ' పై చేయిగా సాగింది. పలు భాషలకు చెందిన స్టార్స్ ను తన సినిమాలో కేమియో రోల్స్ లో నటింప చేయడం కలసి వచ్చిందని రజనీకాంత్ భావిస్తున్నారు. అందువల్ల తన రాబోయే సినిమా 'జైలర్ 2'లోనూ మరికొందరు పరభాషా తారలను నటింప చేయనున్నారని తెలుస్తోంది. ఇది మంచి ఆలోచనే! అయితే ఇది కాదు ఆయన కనిపెట్టిన టెక్నిక్. తన సినిమాను టాప్ తెలుగు స్టార్ మూవీతో పోటీగా రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వసూళ్ళు బాగుంటాయని రజనీ కనిపెట్టేశారు. అందుకు తాజా ఉదాహరణ 'కూలీ'. తెలుగు స్టార్ యన్టీఆర్ నటించిన 'వార్ 2' తో పాటే 'కూలీ' రావడం వల్లే దానికి పేరొచ్చిందని సోలోగా వచ్చి ఉంటే సీన్ వేరుగా ఉండేదని పరిశీలకులు అంటున్నారు.
నిజం చెప్పాలంటే రజనీకాంత్ కు 'యంతిరన్' సినిమా జెన్యూన్ హిట్. ఈ సినిమా తెలుగులో 'రోబో'గా వచ్చి ఇక్కడా అదరహో అనిపించింది. ఆ పై రజనీకాంత్ నటించిన చిత్రాలలో 'రోబో' కొనసాగింపుగా వచ్చిన '2.0' భారీ వసూళ్ళు చూసింది. కానీ, తెలుగునాట అంతగా మెప్పించలేక పోయింది. అటుపై రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రాలేవీ ఆ స్థాయిలో మురిపించలేదు. 2023 ఆగస్టు 10న వచ్చిన 'జైలర్'తో సాలిడ్ హిట్ పట్టేశారు రజనీకాంత్. ఆ సినిమా రిలీజైన మరుసటి రోజునే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' వచ్చింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలా తెలుగునాట కూడా రజనీకాంత్ 'జైలర్' జేజేలు అందుకుంది. ఆ సీన్ ఇప్పుడు 'కూలీ' - 'వార్ 2' పోటీ వల్ల రిపీట్ అయింది. అందువల్ల రజనీ ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాపైనే గురి పెట్టినట్టు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 2026 ఆగస్టు 13వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అదే తేదీన రజనీకాంత్ తన 'జైలర్-2'ను విడుదల చేసేందుకు పథకం వేసినట్టు సమాచారం. 2023లో 'జైలర్' ఆగస్టు 10న వచ్చి విజయం సాధించింది - కనుక 'జైలర్-2'ను కూడా అదే నెలలో రిలీజ్ చేద్దామని రజనీకాంత్ భావించినట్టు తెలుస్తోంది. నిజానికి 'జైలర్-2'ను వచ్చే యేడాది మార్చిలోనే విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించారు. కానీ, ఇప్పుడు రజనీ సూచనపై 'ఫౌజీ'తో ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నట్టు వినిపిస్తోంది. అంటే తన సినిమాలు సోలోగా వస్తే ఇక్కడే కాదు ఓవర్సీస్ లోనూ వర్కౌట్ కావడం లేదని, అదే తెలుగు స్టార్స్ తో పోటీగా వస్తే లాభపడుతున్నాయని రజనీ భావిస్తున్నారట. అందువల్లే 'ఫౌజీ'తో పోటీగా 'జైలర్-2'ను బరిలోకి దించే ప్రయత్నంలో ఉన్నారట. ఏమవుతుందో చూద్దాం.
Also Read: Bakasura Restaurant OTT: సైలైంట్‌గా.. ఓటీటీకి బకాసుర రెస్టారెంట్
Also Read: Pawan Kalyan: 'ఓజీ' థియేటర్లు దద్దరిల్లబోతున్నాయ్