Rajini - Satyaraj: నాలుగు దశాబ్దాల ఎడబాటును చెరిపేసిన 'కూలీ'
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:53 PM
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, సత్యరాజ్ కలిసి 'కూలీ' సినిమాలో ప్రాణ స్నేహితుల పాత్రలను చేశారు. ఇన్నేళ్ళ తర్వాత వీరు సిల్వర్ స్క్రీన్ ను పంచుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన 'కూలీ' (Coolie) సినిమా ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఇందులో నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), సౌబిన్ (Soubin), శ్రుతీహాసన్ (Sruthi Haasan), ఆమిర్ ఖాన్ (Aamir Khan) తదితరులు నటించారు. వీరందరూ ఇందులో యాక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే... దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రజనీకాంత్ సినిమాలో సత్యరాజ్ నటించడం మరో ఎత్తు. గతంలో పలు చిత్రాలలో కలిసి నటించిన వీరిద్దరూ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారనే సందేహం చాలామందికి రావడం సహజం. కొంత కాలంగా ఈ విషయమై తమిళ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రజనీకాంత్ స్వతహాగా తమిళుడు కాకపోవడం... కొన్ని స్థానిక సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తమిళనాడుకు చెందిన నటులు రజనీకాంత్ పట్ల ఈర్ష్యతో ఆయన్ని కార్నర్ చేయడం జరిగింది. అందులో సత్యరాజ్ కూడా ఒకరు. ఏదో రకంగా రజనీకాంత్ ను ఇరకాటాన పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండేవాడని అంటారు. అలానే రాజకీయంగానూ రజనీకాంత్ సిద్ధాంతలంటే పడని సత్యరాజ్ ఆయన్ని ఎప్పుడూ సన్నిహితుడిగా భావించలేదు. సినిమాల్లో నటించడం, పబ్లిక్ ఫంక్షన్స్ లో రజనీకాంత్ ను అభినందించడం చేసినా... సిద్ధాంతాల విషయానికి వచ్చేసరికీ రజనీకాంత్ ను సత్యరాజ్ ఎండకట్టేవారు. రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ స్టేట్ మెంట్ ఇచ్చిన ప్రతిసారి సత్యరాజ్ ఎగతాళి చేసేవాడని అంటారు. తమను మించిన ఫాలోయింగ్ ను రజనీకాంత్ పొందడం కూడా వారి అక్కసు కారణం అనేవారు లేకపోలేదు.
రజనీకాంత్ తరహాలోనే సత్యరాజ్ సైతం విలన్ పాత్రలు చేసి... ఆ తర్వాత హీరోగా మారారు. రజనీకాంత్ ఇప్పటికీ హీరోగా రాణిస్తున్నారు. సత్యరాజ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిపోయారు. ఈ మధ్యలో కెరీర్ పరంగానూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే 'బాహుబలి'లోని కట్టప్ప పాత్ర చేసిన తర్వాత తిరిగి సత్యరాజ్ ను వెతుక్కుంటూ పాత్రలు రావడం మొదలైంది.
ఇక రజనీ, సత్యరాజ్ కలిసి చివరగా నటించింది 1986లో. రజనీకాంత్ హీరోగా తమిళంలో 'మిస్టర్ భరత్' మూవీని ఎస్.పి. ముత్తురామన్ తెరకెక్కించారు. ఇది హిందీలో వచ్చిన అమితాబ్ బచ్చన్ 'త్రిశూల్'కు రీమేక్. ఆ సినిమాలో సంజీవ్ కుమార్ చేసిన పాత్రను తమిళంలో సత్యరాజ్ తో చేయించమని రజనీకాంతే చెప్పారట. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే రజనీకాంత్ 'శివాజీ' చిత్రంలోనూ, 'ఎంతిరన్' మూవీలోనూ సత్యరాజ్ కు విలన్ పాత్రలను ఆఫర్ చేశారట. కానీ సత్యరాజ్ వాటి పట్ల ఆసక్తి చూపించలేదని తెలిసింది. 'శివాజీ' సినిమాలో సుమన్ ను తీసుకోవటానికి ముందు సత్యరాజ్ తో దర్శకుడు శంకర్ మంతనాలు జరిపాడట. ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా రజనీకాంత్ తో సరిసమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సైతం సిద్థమయ్యారట. అయితే సత్యరాజ్... అందుకు అంగీకరించలేదని తెలిసింది. అంతేకాకుండా 'శివాజీ' మూవీలో తాను విలన్ గా నటిస్తే... ఆ తర్వాత తాను హీరోగా చేసే సినిమాలో రజనీకాంత్ విలన్ గా నటిస్తారా?' అని మేకర్స్ ను అడిగారట. అలానే 'ఎంతిరన్' (తెలుగులో 'రోబో') మూవీలోనూ సత్యరాజ్ చేయడానికి ఇష్టపడలేదని అంటారు. ఈ విషయాలను ఆ తర్వాత సత్యరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఏదేమైనా... దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ 'కూలీ' సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంవీరి అభిమానులకు ఆనందాన్ని కలిగించే అంశమే. పైగా ట్రైలర్ ను గమనిస్తే... రజనీకాంత్ ప్రాణస్నేహితుడి పాత్రను సత్యరాజ్ పోషించారని, ఆయనను రక్షించడానికి రజనీకాంత్ ఎలాంటి పోరాటానికైన సిద్థపడ్డారని తెలుస్తోంది. మరి ఇక్కడ నుండి ఈ ఇద్దరు మరిన్ని సినిమాలలో కలిసి నటిస్తారేమో చూడాలి.
Also Read: Nagarjuna : విలన్‌గా చేస్తానంటే చెబుతా.. లేదా టీ తాగి వెళ్లిపోతానన్నాడు...
Also Read: Telusu Kadaa Movie: స్టైలిస్ట్, డెబ్యూ డైరెక్టర్ నీరజ కోన తో స్పెషల్ చిట్ చాట్