Coolie: రజనీకాంత్ ఇంకా స్ట్రాంగ్ గానే...
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:15 PM
ఏడు పదులు దాటి ఐదేళ్ళవుతున్నా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా స్ట్రాంగ్ అని చాటుకుంటున్నారు. రజనీ తాజా చిత్రం 'కూలీ' వసూళ్ళతో ఆయన మరో రికార్డ్ సొంతం చేసుకున్నారు. కాగా, 'కూలీ' చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వడం పట్ల మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. అలా రజనీ 'కూలీ' మళ్ళీ వార్తల్లో నిలచే ఉంది.
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' (Coolie) చిత్రం టాక్ ఎలా ఉన్నా, వసూళ్ళు మాత్రం భలేగా కురుస్తున్నాయి. మొదటివారం ఈ సినిమా 430 కోట్లు పోగేసింది.. అంతకు ముందు కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ రూపొందించిన హిట్ మూవీ 'విక్రమ్' (Vikram) టోటల్ కలెక్షన్స్ 420 కోట్లను 'కూలీ' వారం రోజుల్లోనే అధిగమించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ టాప్ టెన్ మూవీస్ లో ఆరో స్థానంలో ఉన్న 'విక్రమ్'ను వెనక్కి నెట్టి 'కూలీ' ఆ ప్లేస్ లో చేరింది. దీంతో కోలీవుడ్ టాప్ టెన్ గ్రాసర్స్ లో రజనీకాంత్ చిత్రాలు మూడు చోటు చేసుకోవడం గమనార్హం!. టాప్ టెన్ లో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్ లో రజనీకాంత్ '2.0' ఉండడం విశేషం. కాగా, తరువాతి నాలుగు స్థానాల్లో 'లియో (Leo), జైలర్ (Jailer), పొన్నియిన్ సెల్వన్, గోట్ (Goat)' నిలిచాయి. అంటే 1, 3, 6 స్థానాల్లో రజనీకాంత్ చిత్రాలే ఉండడం విశేషం! అలా రజనీకాంత్ ఓ రికార్డ్ ను సొంతం చేసుకున్నారని అభిమానులు ఆనందిస్తున్నారు.
సర్టిఫికెట్ దెబ్బ కొట్టింది...
'కూలీ' సినిమాకు ఇంత కంటే ఎక్కువ వసూళ్ళు వచ్చేవని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఆ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల 18 ఏళ్ళ వయసులోపు వారు 'కూలీ' చూసే అవకాశం లేదు. దాంతో 'కూలీ'కి భారీనష్టం వాటిల్లిందని అంటున్నారు. ఈ విషయంలో 'కూలీ' మేకర్స్ తమిళనాడు హై కోర్టును ఆశ్రయించారు. తీర్పు ఏమని వస్తుందో తెలియదు కానీ, ప్రస్తుతం 'కూలీ' వసూళ్ళు బాగా డ్రాప్ అయిన మాట వాస్తవం. రజనీకాంత్ '2.0' సినిమా ఎన్ని కోట్లు పోగేసి, నంబర్ వన్ ప్లేస్ లో నిలచినా, ఆ మూవీని ఇప్పటికీ హిట్ అని ట్రేడ్ పండిట్స్ అంగీకరించక పోవడం గమనార్హం!. అంటే ఇప్పుడు 'కూలీ' పరిస్థితి కూడా అంతేనా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రం 'కూలీ' ఇంకా కొన్ని కేంద్రాలలో షేర్ వసూలు చేస్తోందని అంటున్నారు. మరో వారం రోజుల్లో ప్రస్తుతం టాప్ ఫైవ్ లో ఉన్న కొన్ని మూవీస్ ను వెనక్కి నెట్టి 'కూలీ' ముందుకు పోవచ్చుననీ లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'కూలీ'కి మరింత బజ్ క్రియేట్ చేయడానికే మేకర్స్ తమ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ పై హై కోర్జును ఆశ్రయిస్తున్నారనీ కొందరు అంటున్నారు. మరి 'కూలీ' ఇంకా ఎంత వసూలు చేస్తుందో? కోర్టులో 'కూలీ'కి ఎలాంటి తీర్పు వస్తుందో అన్న అంశాల కోసం మరి కొద్ది రోజులు ఆగవలసిందే!
Also Read: Rahul Mamkootathil: మలయాళీ నటి ఆరోపణ - కాంగీ ఎమ్మెల్యే రాజీనామా
Also Read: Dulquer Salmaan: పూజా హెగ్డే స్థానంలో శ్రుతీహాసన్