Rahul Mamkootathil: మలయాళీ నటి ఆరోపణ - కాంగీ ఎమ్మెల్యే రాజీనామా
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:52 PM
మీ టూ వ్యవహారం సద్దుమణిగిందని చాలామంది అనుకుంటున్నారు కానీ అది చాపకింద నీరులా సాగుతోంది. హేమ కమిటీ రిపోర్డ్ వెలుగులోకి వచ్చిన కారణంగా మలయాళ చిత్రసీమ అల్లలాడుతోంది. ఇప్పుడు ఏకంగా ఓ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి దాపురించింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు మరోసారి కలకలం రేపాయి. ఓ యువ రాజకీయ నాయకుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నటి, జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ (Rini Ann George) ఆరోపించిన మరుసటి రోజే, ఆమె ఆ నాయకుడి పేరు చెప్పనప్పటికీ కేరళ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్యెల్యే, రాహుల్ మమ్కూటత్తిల్ (Rahul Mamkootathil) పార్టీ పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామాపై ఎలాంటి ఒత్తిడి లేదని, వ్యక్తిగత బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ వెల్లడించారు. అయితే ఎమ్యెల్యేగా కొనసాగనున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో రిని ఆన్ జార్జ్ మాట్లాడుతూ 'సోషల్ మీడియా ద్వారా తనకు స్నేహితుడైన ఓ యువ రాజకీయ నాయకుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడం'టూ ఆరోపించింది. ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేశాను రమ్మంటూ అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేగాక కాంగ్రెస్ లోని పలువురు మహిళా నాయకులు సహితం ఇటువంటి ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆమె తెలిపింది. అయితే, ఆ యువ నాయకుడు ఎవరన్నది మాత్రం రిని చెప్పలేదు. అయితే, నటి ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కేరళలోని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ యువ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ గా తెలిపింది. నటి ఆరోపణలతో పాలక్కాడ్ జిల్లాలోని ఎమ్మెల్యే కార్యాలయం వెలుపల నిరసనకు దిగింది.
చిత్రం ఏమంటే ఈ వ్యవహారం బయటకు రాగానే రచయిత్రి హనీ భాస్కరన్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే ఆమె మాత్రం రాహుల్ పేరున ప్రస్తావించింది. ఆయన తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, పదేపదే అభ్యంతరకర మెసేజ్‌లు పంపారంటూ ఆరోపించారు. గతంలోనూ రాహుల్ పై యూత్ కాంగ్రెస్ లో ఫిర్యాదులు వచ్చినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. గత యేడాది పాలక్కడ్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో రాహుల్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. అయితే తాజా ఆరోపణలతో ఆయన యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ, రిని తనకు అత్యంత సన్నిహితురాలని, ఆమె ఎక్కడా తన పేరును ప్రస్తావించలేదని పేర్కొనడం విశేషం.
Also Read: Dulquer Salmaan: పూజా హెగ్డే స్థానంలో శ్రుతీహాసన్
Also Read: Shalini Pandey: బికినీలో.. అర్జున్ రెడ్డి పాప అరాచకం