High Court: ఆ సినిమా టీజర్‌ను.. తొలగించాల్సిందే!
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:14 PM
టీనేజర్లపై తప్పుగా చిత్రీకరించిన బ్యాడ్ గర్ల్ టీజర్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది.
టీనేజర్లపై తప్పుగా చిత్రీకరించిన బ్యాడ్ గర్ల్ (Bad Girl) చిత్ర టీజర్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) మదురై బెంచ్ ఆదేశించింది. మదురైకు చెందిన వెంకటేష్, రామకుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఒకేసారి విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వీరు దాఖలు చేసిన పిటిషన్లో జనవరి 26న యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో బ్యాడ్ గర్ల్ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో టీనేజర్ల గురించి తప్పుగా చిత్రీకరించిన దృశ్యాలున్నాయి. ఈ టీజర్ ఇప్పటికీ ఆన్లైన్లో ఉంది. ఇటువంటి దృశ్యాలు పిల్లల అశ్లీలత, చిన్నారుల లైంగిక దోపిడి వంటి నేరాల కిందకు వస్తాయి. అందువల్ల ఈ టీజర్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు.
వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ధనపాల్ తాజాగా తీర్పునిస్తూ.. 'అమ్మాయిలు, అబ్బాయిలను అశ్లీలంగా చూపించిన ఈ చిత్ర టీజర్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలి. భవిష్యత్లో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే, సంబంధిత వ్యక్తులపై, బ్యాడ్ గర్ల్ సినిమాలో నటించిన అంజలి శివరామన్ (Anjali Sivaraman)పై చర్యలు తీసుకునేందుకు దానికి సంబందించిన అధికారికి పిటిషనర్లు ఫిర్యాదు చేయాలంటూ న్యాయమూర్తి ఆదేశిస్తూ కేసు విచారణను ముగించారు. కాగా.. కోర్టు తీర్పు నేపథ్యంలో సినిమా టీజర్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు. కానీ ట్విట్టర్‌లో మాత్రం కనిపిస్తూనే ఉంది.ఇదిలాఉంటే.. జాతీయ అవారు గ్రహీత వెట్రిమారన్ నిర్మాణ సారథ్యంలో వర్షా భరత్ (Varsha B) దర్శకత్వంలో అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.