KGF: కళాదర్శకుడు, నటుడు దినేశ్ మంగళూరు మరణం
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:22 PM
పాన్ ఇండియా మూవీ 'కేజీఎఫ్' లో ముంబై డాన్ శెట్టి పాత్రను పోషించిన దినేశ్ మంగళూరు అనారోగ్యంతో ఉడిపిలో కన్నుమూశారు. గత యేడాది కాలంగా ఆయన ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారు.
ప్రముఖ నటుడు, ఆర్ట్ డైరెక్టర్ దినేశ్ మంగళూరు (Dinesh Mangaluru) (55) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఉడిపి (Udipi) జిల్లా కుందపురా లోని ఆయన గృహంలో తెల్లవారు ఝామున 3.30 గంటలకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దినేశ్ కు 'కేజీఎఫ్' (KGF) సినిమాలో పోషించిన ముంబై శెట్టి పాత్ర బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. దీనికి ముందు కూడా ఆయన పలు చిత్రాలో నటించారు. 'రాణా విక్రమ, అంబరీ, సవారీ, ఆ దినగళ్, స్లమ్ బాలా, ప్రేమ, నాగమండలా, అతిథి, శుభం' వంటి సినిమాలలోని పాత్రలతోనూ దినేశ్ మంచి పేరు సంపాదించుకున్నారు.
ఆ మధ్య 'కాంతర' (Kanthara) షూటింగ్ సమయంలో దినేశ్ అస్వస్థతకు లోనయ్యారు. ఆ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులో చికిత్స చేయించుకున్నారు. యేడాది కాలంగా ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వారం క్రితం బ్రెయిన్ హేమరేజ్ తో ఆయన హాస్పిటల్ లో చేరారు. అక్కడ నుండి ఇక కోలుకోలేదని తెలుస్తోంది.
రంగస్థలంలో అనుభవం ఉన్న దినేశ్ స్వస్థలం మంగళూరు. దాంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. చిత్రసీమలోకి ఆర్ట్ డైరెక్టర్ గా అడుగుపెట్టారు. 'నంబర్ 73, శాంతి నివాస్' వంటి సినిమాలకు ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. దినేశ్ మంగళూరు మృతిపట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Also Read: OTT MOVIES: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
Also Read: Rajinikanth Nag Ashwin: రజనీతో.. నాగ్ అశ్విన్ సినిమా! సోషల్ మీడియా షేక్