Idly Kadai: తెలుగులో 'ఇడ్లీ కొట్టు'గా ధనుష్ సినిమా
ABN, Publish Date - Sep 04 , 2025 | 12:58 PM
ధనుష్ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా 'ఇడ్లీ కడై'. ఈ సినిమాను తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో డబ్ చేస్తున్నారు. అక్టోబర్ 1న ఈ సినిమా విడుదల కాబోతోంది.
ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ (Dhanush) రూపొందిస్తున్న సినిమా 'ఇడ్లీ కడై' (Idli Kadai). ఇది నటుడిగా ధనుష్ కు 52వ సినిమా కాగా, దర్శకుడిగా నాలుగో చిత్రం. ఇదే యేడాది సంక్రాంతి సీజన్ లో ధనుష్ దర్శకత్వం వహించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' చిత్రం విడుదలైంది. దీనికి ముందు గత యేడాది 'రాయన్' సినిమాను ధనుష్ డైరెక్ట్ చేశాడు. 'ఇడ్లీ కడై' సినిమాలో నిత్యామీనన్ (Nithya Menen) హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి 'తిరు' చిత్రంలో జంటగా నటించారు. చిత్రం ఏమంటే... నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన 'సార్ మేడమ్' సినిమా కూడా హోటల్ నేపథ్యంలోనే సాగింది. అందులో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు.
'ఇడ్లీ కడై' విషయానికి వస్తే... ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ సినిమాకు 'ఇడ్లీ కొట్టు' అనే పేరు పెట్టారు. 'శ్రీశ్రీశ్రీ రాజావారు' సినిమాను నిర్మించిన శ్రీ వేదాక్షరి మూవీస్ సంస్థ దీన్ని తెలుగువారి ముందుకు తీసుకు రాబోతోంది. 'ఇడ్లీ కడై' మూవీని ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.
Also Read: Anushka: ప్రభాస్‌తో కెమిస్ట్రీ.. అనుష్క ఏం చెప్పిందంటే...
Also Read: Allu Kanakaratnamma: అరవింద్ కు ప్రధాని లేఖ...