Viraata Palem: ముదురుతున్న కాపీ రైట్ వివాదం
ABN, Publish Date - Jun 27 , 2025 | 09:11 PM
ఓ వెబ్ సీరిస్ ఒరిజినల్ కంటెంట్ మాదంటే మాదని రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కోర్టు కెక్కాయి. ఇంతలో ఆ వెబ్ సీరిస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో సదరు రెండో సంస్థ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కాపీరైట్ వివాదం చివరకు చినికి చినికి గాలివానగా మారుతోంది.
శుక్రవారం నుండి జీ 5 (Zee 5)లో ప్రసారం అవుతున్న 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' (Viraatapalem: PC Meena Reporting) వెబ్ సీరిస్ పై వివాదం రోజు రోజుకూ రాజుకుంటోంది. ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ కు రెండు రోజుల ముందు ఇది తమ కథే నంటూ ఈటీవీ విన్ (Etv Win) బృందం మీడియా సమావేశం నిర్వహించింది. దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల (Prasanth Kumar Dimmala) దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) టైటిల్ రోల్ లో తాము 'కానిస్టేబుల్ కనకం' (Constable Kanakam) వెబ్ సీరిస్ ను తీస్తున్నామని, రెండు సీజన్స్ కు దీనిని ప్లాన్ చేశామని వారు చెప్పారు. అయితే ఎప్పుడైతే 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' ట్రైలర్ బయటకు వచ్చిందో అప్పుడు తమ సందేశం రూఢీ అయ్యిందని, దీనిపై తమ హక్కులను పొందడానికి కోర్టుకు వెళ్ళామని వారు తెలిపారు.
తాజాగా 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' వెబ్ సీరిస్ ను ఎలాంటి ఆటంకాలు లేకుండానే జీ 5 స్ట్రీమింగ్ చేసేసింది. అయితే తమ ఒరిజినల్ కంటెంట్ గురించి ప్రశాంత్ కుమార్ దిమ్మల చేస్తున్న వ్యాఖ్యలను జీ 5 సంస్థ ప్రతినిధులు ఖండించారు. దీనికి ప్రశాంత్ అనుకుంటున్న వెబ్ సీరిస్ కు ఎలాంటి పొంతనా లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే కోర్టులో ఉన్న ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి, లైవ్ టెలికాస్ట్ చేయించి మరీ తమను బద్నామ్ చేశారని ఆరోపించారు. కోర్టు ధిక్కరణతో పాటు తమ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేసిన ప్రశాంత్ ను, అతనితో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న సంబంధిత ఓటీటీ ప్లాటి ఫామ్ ప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ వెబ్ సీరిస్ టెలికాస్ట్ కావడానికంటే ముందే... అందులోని ఏడు ఎపిసోడ్స్ ను చూసి జడ్జ్ చేయమని తాము ప్రశాంత్ ను కోరామని, అయినా దానిని ఆయన పట్టించుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం పెట్టారని అన్నారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సైతం తాము వెనకాడబోమని అన్నారు.
Also Read: Salman Khan: ఈ వయస్సులో విడాకులు తీసుకొని భార్యకు భరణం ఇవ్వలేను...
Also Read: Tollywood: ఇద్దరు మెగాస్టార్ల మధ్య చేతులు కట్టుకొని నిలబడిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా...