Param Sundari - Lokah: ఆడవాళ్ళంటే అలుసా...
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:16 PM
తాజాగా విడుదలైన 'పరమ్ సుందరి', 'లోక' చిత్రాలలో మహిళలను కించపరిచే విధంగా సంభాషణలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ఆకాశంలో సగం అని ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడతారు. అలానే కొన్ని సినిమాల్లో ఆడవాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తూ సంభాషణలు రాస్తుంటారు. ఆడదంటే అబల కాదు సబల అంటూ పాత్రలను రూపొందిస్తారు. కానీ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆడమనిషిని అంగడిబొమ్మగానే చూస్తారు, అదే భావన ప్రేక్షకులకు కలిగేలా కొందరు దర్శక నిర్మాతలు ప్రవర్తిస్తుంటారు. ఇటీవల విడుదలైన జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి', కళ్యాణి ప్రియదర్శన్ 'లోక చాప్టర్ 1: చంద్ర' సినిమాలోని కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ఇదే విషయంలో చర్చకు తావిస్తున్నాయి.
'పరమ్ సుందరి' సినిమాలో జాన్వీ కపూర్ మలయాళీ ముద్దుగుమ్మగా నటించింది. అయితే ఇందులో కొన్ని సన్నివేశాలు మలయాళీ అమ్మాయిలను కించపరిచేలా ఉన్నాయనే విమర్శవచ్చింది. హీరోయిన్ పాత్ర ద్వారా కూడా మలయాళీలను తక్కువ చేశారనే కామెంట్ వినిపించింది. అయితే ఇది హిందీ సినిమా కావడం, దక్షిణాదిలో ముఖ్యంగా మలయాళంలో ఎవరూ దీనిపై పెద్దంత ఫోకస్ పెట్టకపోవడంతో ఈ వివాదం చల్లబడిపోయింది. ఇక తాజాగా ఓనమ్ కానుకగా విడుదలైన మలయాళ చిత్రం 'లోక చాప్టర్ 1: చంద్ర'లో కథ బెంగళూరు నేపథ్యంలో సాగుతుంది. రాజుల కాలానికి చెందిన హీరోయిన్ చావు అనేది లేకపోవడంతో ఓ కార్యం నిమిత్తం ఈ కాలంలోకి అడుగుపెట్టి, బెంగళూరుకు వస్తుంది. అక్కడ జరిగే ఆర్గాన్ ట్రాఫికింగ్ ను ఆమె అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా వచ్చే కొన్ని సన్నివేశాలలో బెంగళూరు అమ్మాయిలను తక్కువ చేసే విధంగా సంభాషణలను రాశారు. బెంగళూరులోని అమ్మాయిలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తా రన్నట్టుగానూ, అలాంటి వారిని పెళ్ళి చేసుకోనని ఓ పాత్రతో చెప్పించారు. దీనిని కొందరు తప్పు పడుతున్నారు. మలయాళీ చిత్రంలో ఇలా బెంగళూరు అమ్మాయిలను తక్కువ చేసి చూపించడం ఏమిటనే మాట వినిపిస్తోంది.
నిన్నకాక మొన్న తమిళుడైన కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు కన్నడీగులు నొచ్చుకున్నారు. ఇప్పుడు మలయాళీ చిత్రంలో తమ రాజధాని అమ్మాయిలను గురించి తప్పుగా చూపిండం, మాట్లాడించడాన్ని వారు తట్టుకోలేకుండా ఉన్నారు. వెంటనే సినిమా నుండి ఈ సంభాషణలను, సన్నివేశాన్ని తొలగించాలని, అలానే దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలలో బెంగళూరును డ్రగ్స్ అడ్డాగా చూపిస్తున్నారు. అక్కడ ఐటీ రంగం వేళ్ళూను కోవడంతో ఇలాంటి వాటికి అక్కడ యాక్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా సన్నివేశాలను రాస్తున్నారు. దీనిపై కన్నడిగులు మండిపడుతున్నారు. మరి వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకుని సినిమావాళ్ళు సర్ధుబాటు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
Also Read: AR Murugadoss: మదరాసి అయినా మురుగాను ఆదుకుంటుందా
Also Read: Kalyani Priyadarsan: 'లోక' సరికొత్త రికార్డ్...