సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mirai Review: తేజ స‌జ్జా.. మిరాయ్ సినిమా రివ్యూ

ABN, Publish Date - Sep 12 , 2025 | 12:40 PM

'హను-మ్యాన్' తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత తేజ సజ్జాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దాంతో అతని తదుపరి చిత్రం ‘మిరాయి’ (Mirai) పై సహజంగానే ఆసక్తి నెలకొంది.

Mirai

'హను-మ్యాన్' తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత తేజ సజ్జాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దాంతో అతని తదుపరి చిత్రం ‘మిరాయి’ (Mirai) పై సహజంగానే ఆసక్తి నెలకొంది. ఊహించని విధంగా పలుమార్లు వాయిదా పడిన తేజ సజ్జా (Teja Sajja) పాన్ ఇండియా మూవీ 'మిరాయ్' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ ఎలా ఉందో చూద్దాం…

ఈ కథ అశోకుడి కళింగ యుద్థానంతరం మొదలవుతుంది. ఆ యుద్థంలో తాను పొందింది విజయమో పరాజయమో తేల్చుకోలేక అశోకుడు వేదనా భరితుడవుతాడు. ఆ సమయంలో తన జ్ఞానాన్ని, దివ్యశక్తులను తొమ్మిది గ్రంధాలలో నిక్షిప్తం చేసి వాటిని కాపాడాల్సిందిగా ఎనిమిదిమంది యోధులకు అందిస్తాడు. తొమ్మిదో గ్రంధాన్ని మాత్రం ఓ ఆశ్రమానికి అందచేస్తాడు. ఆ గ్రంధాలను హస్తగతం చేసుకుని ప్రపంచాన్ని దాసోహం చేసుకోవాలని ఆ తర్వాత ఎందరో రాజులు ప్రయత్నించి విఫలమౌతారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఆ విశేష గ్రంధాలలో ఎనిమిది పుస్తకాలను బ్లాక్ స్వార్డ్ అనే మహావీర్ లామా (మంచు మనోజ్) తన తాంత్రిక శక్తులతో స్వాధీనం చేసుకుంటాడు. తొమ్మిదవ పుస్తకాన్ని కైవసం చేసుకునే ప్రయత్నంలో విఫలమౌతాడు. ఆ పుస్తకాన్ని అంబిక (శ్రియా) పరిరక్షిస్తూ ఉంటుంది. తన బిడ్డ వేద ప్రజాపతి (తేజ సజ్జా) ద్వారా మహావీర్ లామాను అడ్డుకోవచ్చని గ్రహించిన ఆమె, పుట్టిన పసిగుడ్డును కాశీలో భగవంతుని చెంతకు చేర్చుతుంది. దాంతో ఒంటరిగా పెరిగి పెద్దవాడైన వేద ప్రజాపతి తల్లి సూచనలతో ఎలా మహావీర్ లామాను ఎదుర్కొన్నాడు? అతనికి మార్గనిర్దేశనం చేసిన విభ (రితికా నాయక్) తో అతని పరిచయం ఎటువైపు దారితీసింది? ఈ మొత్తం వ్యవహారంలో 'మిరాయ్' పాత్ర ఏమిటీ? వేద కు భగవాన్ శ్రీరాముని ఆశీస్సులు ఎలా లభించాయి? దాని ఫలితం ఏమిటనేది మిగతా కథ.

త్రేతాయుగం నాటి రాముడి ఆయుధం ‘మిరాయ్’. దాన్ని పొందగలిగితే విజయం తధ్యం! మిరాయ్ ను అందుకోవడానికి వేద ఎలాంటి సాహసాలు చేశాడు? తన మీద తనకే నమ్మకం లేని అతను... ప్రజల కోసం, బ్లాక్ స్వార్డ్ తాంత్రిక శక్తుల నుండి వారిని కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి ఎలా పోరాటం చేశాడనేది ఆసక్తికరంగా తెరకెక్కించాడు కార్తీక్ ఘట్టమనేని. హిమాలయాలలో జన్మించి, కాశీ, కోల్ కతా లో పెరిగి... హైదరాబాద్ లో జీవితాన్ని సాగించే వేద ను వెతుక్కుంటూ విభ (రితికా నాయక్) రావడం, అతని మనసును లక్ష్యం దిశగా మరల్చడం కూడా ఇంట్రస్టింగ్ గానే ఉంది. మిరాయ్ కోసం సాగించే అన్వేషణతో ప్రథమార్థం సాగితే, బ్లాక్ స్వార్డ్ కు చరమగీతం పాడటంతో ద్వితీయార్థం ముగిసింది. 'హను-మ్యాన్' మూవీలో హనుమంతుడి సాయంతో ఓ సాధారణ యువకుడు విలన్ పని పట్టినట్టుగానే ఇందులోనూ క్లయిమాక్స్ లో శ్రీరాముని సాయం అతనికి లభించిందన్నట్టుగా చూపించారు. నేపథ్య గీతం, సంగీతంతో క్లయిమాక్స్ ను మరో స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం సంగీత దర్శకుడు గౌరహరి చేశాడు. సినిమా ఆసాంతం చందమామ కథను వెండితెరపై చూస్తున్నట్టు అనిపిస్తుంది. జటాయువు సోదరుడు సంపాతితో చేసే పోరాటం, రాముడు ధ్యానం చేసిన స్థలంలో జరిగే ఫైటింగ్‌, క్లైమాక్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక ప్రతినాయకుడు మంచు మనోజ్ పాత్ర నేపథ్యం, అతను అలా తయారు కావడానికి చూపించే కారణాలు ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది. కథను.. వి.ఎఫ్.ఎక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్‌ చేసే ప్రయత్నం సక్సెస్‌ అయిందనే చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే..

తేజ సజ్జా తన పాత్ర వరకూ బాగా చేశాడు, ఈజ్ తో నటించాడు. అతని ముందు సినిమా 'హను-మ్యాన్'లోని పాత్రతో పోల్చినా ఏమాత్రం తగ్గదనిపిస్తుంది. అయితే ఎంతో పాపులర్ అయిన 'వైబ్ ఉంది బేబీ... వైబ్ ఉందిలే' పాట లేకపోవడం నిరాశ కలుగుతుంది. నటి శ్రియా శరణ్ పుట్టినరోజు మర్నాడే రావడం ఓ రకంగా ఆమెకు ఇది బర్త్ డే గిఫ్ట్ అనుకోవచ్చు. జయరామ్ పాత్రను సీరియస్ గా మొదలు పెట్టి కామెడీగా ఎండ్ చేశారు. అలానే జగపతి బాబు పాత్ర ఇంకా బాగా చూపించాల్సింది. ఇతర ప్రధాన పాత్రలను కిశోర్ తిరుమల, వెంకటేశ్ మహా, గెటప్ శ్రీను తదితరులు పోషించారు. ఈ సినిమాపై మంచు మనోజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే కొన్ని సన్నివేశాలలో హీరో కంటే మంచు మనోజ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ లభించింది. మనోజ్ కూడా బాగా కష్టపడ్డాడు. ఇక సీక్వెల్ తీయవచ్చనే ఆలోచనతో రానా తో తదుపరి భాగానికి లీడ్ ఇవ్వడం విశేషం

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే... బేసికల్ గా సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని తానే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. దానికి నూటికి నూరుశాతం న్యాయం చేశాడు. ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌ గౌర హరి సంగీతం, వీఎఫ్‌ఎక్స్‌ అని చెప్పాలి. మణిబాబు కరణం సంభాషణలు, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్షన్ అన్నీ కూడా సినిమాను ఎలివేట్ చేసే విధంగానే ఉన్నాయి. నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ కూడా ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మించారు. దాని ఫలితం తెర మీద కనిపిస్తోంది.

రేటింగ్ : 3.25/5

ట్యాగ్ లైన్: అందమైన చందమామ కథ ‘మిరాయ్’


ఇవి కూడా చ‌ద‌వండి...

Telusu Kada: డీజే టిల్లును.. మించి ఉందిగా! తెలుసుక‌దా టీజ‌ర్

Paradha OTT: స‌డ‌న్‌గా.. ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన ప‌ర‌దా! రెండు వారాల‌కే

Ritu Varma: రీతూ వ‌ర్మ‌.. నువ్వు కూడానా! ఇంత షాకిచ్చావేంటి

Mirai Twitter X RevIew: తేజ స‌జ్జా.. మిరాయ్ ట్విట్ట‌ర్ రివ్యూ! ఎలా ఉందంటే

Raghava Lawrence: సొంతింటిని.. స్కూల్‌గా మార్చిన రాఘ‌వ లారెన్స్

Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల‌.. ఊపేస్తోందిగా! కుర్రాళ్ల.. నిగ్ర‌హం నిలిచేనా

Updated Date - Sep 12 , 2025 | 01:17 PM