Raghava Lawrence: సొంతింటిని.. స్కూల్‌గా మార్చిన రాఘవ లారెన్స్
ABN , Publish Date - Sep 12 , 2025 | 08:03 AM
తనదైన మార్కు సినిమాలతో తమిళ, తెలుగు రాష్ట్రాలలో మంచిపేరు, గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాఘవ లారెన్స్.
తనదైన మార్కు సినిమాలతో తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence). సినిమాలో హీరోగా వీరోచితమైన పాత్రలకు తలదన్నేలా నిజ జీవితంలోనూ నిత్యం ప్రజాసేవలో ముందుండుతూ, అవసరమైన వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అనాథలకు ఆశ్రయం, నిరుపేదలకు ఉన్నత విద్యకు తోడ్పాటు, దివ్యాంగులకు సహాయం, రైతులకు ట్రాక్టర్లు ఇలా అనేక మందికి కావలసిన విధంగా సహాయం చేస్తూ “సేవే పరమావధి” అని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ నిజమైన హీరోగా గుర్తింపు పొందుతున్నారు.
ఇటీవలే రెండు కాళ్లు సరిగ్గా లేని యువతికి కృతిమ కాళ్లు అమర్చించి, స్కూటీ అందించి, ఓ ఇల్లు కూడా నిర్మించి వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా తాజాగా మరో సేవా కార్యక్రమంతో ఔరా అనిపించారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆయన స్వయంగా వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ – “ప్రస్తుతం నేను నటిస్తున్న కాంచన 4 సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే అన్నింటికంటే ముఖ్యంగా నేను చాలాకాలంగా చేయాలనుకుంటున్న ఒక సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను” అని తెలిపారు.
తన కెరీర్ ప్రారంభం నుంచి డ్యాన్సర్‌గా కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన తన తొలి ఇంటిని ఇప్పుడు కాంచన 4 కోసం వచ్చిన అడ్వాన్స్‌తో ఉచిత విద్యాలయంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. “ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మొదట దీనిని అనాథ పిల్లల కోసం మార్చాను. ఇప్పుడు నా కుటుంబం వేరే చోట నివసిస్తున్నప్పటికీ, నా పిల్లలు పెద్దవారై ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత ఈ ఇంటిని మళ్లీ సామాజిక సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను” అని భావోద్వేగంగా తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ – “ఈ విద్యాలయంలో మొదటి గురువుగా పని చేయబోయేది కూడా అదే ఇంటిలో పెరిగిన చిన్నారి. ఇది నాకు ఎంతో గర్వంగా ఉంది. నా జీవితాన్ని తీర్చిదిద్దిన చోటే, తదుపరి తరానికి విద్యను అందించే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను” అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లారెన్స్ చేపట్టిన సేవా కార్యక్రమానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.