సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kishkindapuri Review: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' మెప్పించిందా.. 

ABN, Publish Date - Sep 11 , 2025 | 11:38 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పదేళ్ల కెరీర్‌లో పది సినిమాలు పూర్తయ్యాయి. కానీ చెప్పుకోదగ్గ చిత్రాలు మాత్రం రెండు, మూడే. ప్రస్తుతం హిట్‌ సినిమా కోసం ఎంతో ఆకలితో ఎదురుచూస్తున్నాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కిష్కింధపురి' ఎలా ఉందంటే 

సినిమా రివ్యూ: 'కిష్కింధపురి' (Kishkindapuri Review)
విడుదల తేది:
12–9–2025

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Srinivas) పదేళ్ల కెరీర్‌లో పది సినిమాలు పూర్తయ్యాయి. కానీ చెప్పుకోదగ్గ చిత్రాలు మాత్రం రెండు, మూడే. ప్రస్తుతం హిట్‌ సినిమా కోసం ఎంతో ఆకలితో ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'కిష్కింధపురి'. తొలిసారి హారర్‌ థ్రిల్లర్‌ ట్రై చేశాడు సాయి శ్రీనివాస్‌. 'చావు కబురు చల్లగా’ చిత్రం ఫెయిల్యూర్‌ తర్వాత కౌషిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన చిత్రమిది. అనుపమా పరమేశ్వన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో హైపర్‌ ఆది, తనికెళ్ల భరణి, సుదర్శన్‌, భద్రం, మకరంద్‌ దేశ్‌పాండే, శ్రీకాంత్‌ అయ్యంగర్‌ కీలక పాత్రలు పోషించారు. సాహు గారపాటి నిర్మాతగా హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై టీమ్‌ అంతా ఎంతో నమ్మకం పెట్టుకుంది. పక్కాగా విజయం సాధిస్తుందని హీరో కాలర్‌ ఎగరేసి మరీ చెప్పాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సాయి శ్రీనివాస్‌కు హిట్‌ ఇచ్చిందో..  లేదో చూద్దాం. (Kishkindapuri Movie Review


Kishkindapuri Story:
రాఘవ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌), మైథిలి(అనుపమా పరమేశ్వరన్‌), సుదర్శన్‌ ముగ్గురూ ఘోస్ట్‌ రైడ్‌ టూర్స్‌ నిర్వహిస్తుంటారు. స్కేరీ హౌస్‌లు చుట్టూ తిప్పుతూ భయం పొగొట్టి కస్టమర్లకు థ్రిల్‌ కలిగించాలన్నది వారి ఆలోచన. అలా రెండు ట్రిప్‌లు అయ్యాక కిష్కింధపురిలోని సువర్ణమాయ అనే పాడుపడిన రేడియో స్టేషన్‌కి టీమ్‌గా వెళ్తారు. మూత పడ్డ ఆ స్టేషన్‌ తలుపులు  బద్దలుకొట్టుకుని  వెళ్లిన ఆ బృందానికి  లోపల విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. ఆ స్టేషన్‌లో అడుగుపెట్టిన 11 మంది చావడం ఖాయం అనే వాయిస్‌ వినిపిస్తుంది. తర్వాత స్టేషన్‌లో అడుగుపెట్టిన మొదటి ఇద్దరైన లోకో ఫైలట్‌లు (భద్రమ్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌) అనుహ్యాంగా చనిపోతారు. మూడో మరణాన్ని హీరో రాఘవ ఆపగలుగుతాడు. అసలు వారంతా చనిపోతారని చెప్పిన వాయిస్‌ ఎవరిది?  ఆ మరణాల వెనకున్నది ఎవరు? వైకల్యంతో పుట్టిన విసృత పుత్ర,  అతని తల్లి (ప్రేమ) కథేంటి? ఆ రేడియో స్టేషన్‌కు   విసృత పుత్రకు   ఉన్న సంబంధం ఏంటి?  అన్నది మిగతా కథ.



విశ్లేషణ: (Kishkindapuri Review)
1989లో కిష్కింధరపురి అనే ఊళ్లో సువర్ణ మాయ అనే మూతబడిన రేడియో స్టేషన్‌, అందులో ఐదుగురు మరణాలతో కథ మొదలుపెట్టాడు దర్శకుడు. అక్కడి నుంచి ప్రస్తుత సమయంలో ఘోస్ట్‌ రైడ్‌ టూర్‌ అంటూ తిరిగే ఓ టీమ్‌ దగ్గరికొచ్చింది. వాళ్లకు ఎదురైన సవాళ్ల నేపథ్యంలో హారర్‌ థ్రిల్లర్‌గా మలిచారు. ఫస్టాఫ్‌లో ఘోస్ట్‌ రైడ్‌ జస్ట్‌ ఫన్‌ రైడ్‌లా సాగింది. దీంతో బెల్లంకొండకు ఈసారి హిట్‌ ఖాయమనే అనే భావన కలిగింది. ద్వితీయార్థంలో ఆ వాయిస్‌ వికలాంగుడైన విసృత పుత్రదని. ఆ మరణా వెనక ఉన్నది తానే అని తెలుస్తుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన వారిపై రివేంజ్‌ తీర్చుకోవడానికి తల్లి సెంటిమెంట్‌ను జోడించి అల్లిన కథ టోటల్‌గా ట్రాక్‌ తప్పేలా చేసింది. క్లైమాక్స్ లో శ్రీరామ రక్షా సన్నివేశం మాత్రం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. విసృత పుత్ర టాక్ర్‌ని దర్శకుడు సరిగా డీల్‌ చేయలేకపోవడంతో థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకులకు ముళ్ల మీద కూర్చునట్లే అనిపిస్తుంది. దీనికి తోడు చివర్లో ఈ సినిమాకు తల్లి పాత్రను చూపిస్తూ సీక్వెల్‌కి లీడ్‌ ఇచ్చారు. అంటే తల్లి పాత్రకు కొనసాగింపు ఉంటుందన్నట్లు చూపించడం మరింత హాస్యాస్పదం అనిపిస్తుంది.    

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికొస్తే..

రాఘవ పాత్ర కోసం బెల్లంకొండ శ్రీనివాస్‌ బాగానే కష్టపడ్డాడు. మలయాళ బ్యూటీ అనుపమ మాత్రం పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ప్రత్యేకించి క్లౌమాక్స్‌లో ఘోస్ట్‌ అవహించిన సీన్స్‌లో అద్భుతంగా నటించిందని చెప్పాలి. హైపర్‌ ఆది సినిమా కథలు, రైటర్స్‌ మీద వేసిన పంచ్‌లు నవ్వించాయి. తను కనిపించిన కాసేపు సందడి చేశాడు. తనికెళ్ల భరణి, మకరంద్‌ దేశ్‌పాండే పాత్రల పరిధి మేర నటించారు. సుదర్శన్‌, భద్రమ్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌ కూడా  ఫర్వాలేదనిపించారు. సినిమాటోగ్రాఫర్‌ చిన్మయ్‌ సాలస్కర్‌ పనితనం బావుంది, మ్యూజిక్‌ విషయానికొస్తే ఉన్న ఒక్క పాట ఆకట్టుకునేలా లేదు. అయితే హారర్‌ కథకు కావలసిన నేపథ్యం సంగీతం చక్కగా అందించాడు చేతన్‌ భరద్వాజ్‌. నిర్మాత సాహు గారపాటి నిర్మాణం విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు, మొత్తం మీద ఈ సినిమా ఫస్టాప్‌ కాస్త ఎంగేజింగ్‌గా ఉన్నా.. సెకెండాఫ్‌ పూర్తిగా నిరుత్సాహ పరచింది. హీరోతోపాటు నిర్మాత ఈ కథకు ఎలా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారా అన్న సందేహం కలగక మానదు. తొలి చిత్రం  'చావు కబురు చల్లగా’ పరాజయం తర్వాత కౌశిక్‌ పెగళ్లపాటికి దక్కిన సెకెండ్‌ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోలేకోయారు. హారర్‌ థ్రిల్లర్‌ను ఎంజాయ్‌ చేయాలనుకుని వచ్చిన ఆడియన్స్‌ థియేటర్‌ నుంచి 'ఇదెక్కడి బోరింగ్‌ థ్రిల్లర్‌ రా బాబు’ అంటూ బయట పడటం ఖాయం.

ట్యాగ్‌లైన్‌: బోరింగ్‌ థ్రిల్లర్‌

రేటింగ్‌:
2/5

 

Updated Date - Sep 11 , 2025 | 11:40 PM