War 2 - Coolie: వార్-2, కూలీ టిక్కెట్ రేట్ల‌ పెంపు.. జనం మండిపాటు

ABN , Publish Date - Aug 12 , 2025 | 03:25 PM

సినిమా పిచ్చోళ్ళకు నెలవు తెలుగునేల అనే నానుడి ఉంది. దానికి రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు కూడా ముద్ర వేస్తున్నాయి. అందులో భాగంగానే పరభాషా చిత్రాల డబ్బింగ్ వెర్షన్స్ కు కూడా టిక్కెట్ రేట్స్ పెంపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సగటు ప్రేక్షకుడు మండిపడుతున్నాడు.

War 2 - Coolie

బాలీవుడ్ బడా సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించిన 'వార్ 2' (War -2), లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'కూలీ' (Coolie) - రెండూ తెలుగువారికి డబ్బింగ్ సినిమాలే!. కాకపోతే 'వార్ 2'లో యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), 'కూలీ'లో కింగ్ నాగార్జున (Nagarjuna) నటించారు. అంతకు మించి ఆ రెండు చిత్రాలకు తెలుగువారితో సంబంధం అంటూ ఏమీ లేదు. ఈ రెండు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మల్టీ ప్లెక్స్ లో 200 రూపాయల దాకా పెంచుకొనే వెసలుబాటు కల్పించాయి. ఈ కారణంగా మల్టీప్లెక్స్ లో 'కూలీ, వార్ 2' సినిమాల టిక్కెట్ రేటు 400 నుండి 500 రూపాయల దాకా ఉంటుంది. ఇవే చిత్రాలకు తమిళనాట మాత్రం మల్టీప్లెక్స్ ల్లో 183 రూపాయల మించి టిక్కెట్ రేటు లేకపోవడం గమనార్హం! చెన్నైలోని పీవీఆర్ (PVR) మల్టీప్లెక్స్ లో 'కూలీ' టిక్కెట్ ధర 183 రూపాయలు మాత్రమే ఉండగా, అదే సినిమా హైదరాబాద్ లో అదే చెయిన్ కు సంబంధించిన పీవీఆర్ మల్టీప్లెక్స్ లో 453 రూపాయల ధర ఉండడం సినీ ఫ్యాన్స్ కు చిర్రెత్తేలా చేస్తోంది.దాంతో టిక్కెట్ రేట్ల పెంపుకు పచ్చజెండా ఊపిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను తప్పు పడుతున్నారు.


తెలుగునాట సినీ ఫ్యాన్స్ పిచ్చోళ్ళు కాబట్టి ఎంత రేటు పెట్టినా టిక్కెట్స్ కొంటారు అనే నమ్మకం చాలామందిలో ఉంది. అందువల్లే చుట్టూ ఉన్న పరభాషా రాష్ట్రాల సినీజనం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలవైపే చూస్తూ ఉంటారు. ఇదేమీ కొత్త కాదు - గతంలోనూ తమిళ స్టార్ హీరోస్ అందరూ తెలుగునాటనే ఎక్కువ వసూళ్ళు పోగేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ హిందీ 'వార్ 2' వారిని అంతగా అనవలసిన పనిలేదు. ఎందుకంటే ముంబైలోని మల్టీప్లెక్స్ ల్లో 'వార్ 2' టిక్కెట్ ధర 500 నుండి 600 రూపాయల పై మాటే ఉంది. ఆ లెక్కన పోల్చితే తెలుగునాట 'వార్ 2'కు సరైన టిక్కెట్ రేటు నిర్ణయించారనే కొందరు సినీపండిట్స్ చెబుతున్నారు. అయినా ఓ డబ్బింగ్ సినిమాకు అంత రేటు నిర్ణయించడం సబబు కాదని అంటున్నారు.

ఈవెంట్ కూడా డబ్బింగ్!

ప్రభుత్వాలు నిర్ణయించిన టిక్కెట్ రేట్ల పెంపు కాకుండా స్టార్ హీరోస్ మూవీస్ కు బెనిఫిట్ షోస్ కూడా వేస్తుంటారు. సదరు షోస్ టిక్కెట్ రేట్లు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆ టిక్కెట్ రేటు 1000 రూపాయల నుండి 2000 పైచిలుకు ఉంటుంది. జూలైలో వచ్చిన పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' స్పెషల్ షోస్ టిక్కెట్స్ అదే తీరున వేలకు వేలుగా రేటు పెట్టి అమ్మారు. ఈ నేపథ్యంలో 'వార్ 2'కు కూడా తెలుగునేలపై కొన్ని కేంద్రాలలో రెండువేలకు పైగానే టిక్కెట్ రేటు పెట్టినట్టు సమాచారం. అలాగే బెంగళూరులో రజనీకాంత్, జూనియర్ యన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ను అనుసరించి 'కూలీ, వార్ 2' రెండు చిత్రాలకు కూడా స్పెషల్ షోస్ వేస్తున్నారట. ఆ రేటు వెయ్యిరూపాయలకు పై మాటే అని వినిపిస్తోంది. ఈ మధ్యే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సగటు ప్రేక్షకునిపై భారం పడకుండా ఏ సినిమా టిక్కెట్ రేటు అయినా 200 రూపాయలకు మించరాదని నిర్దేశించారు. కానీ, ఆ ఆదేశాలను సైతం తుంగలో తొక్కి 'వార్ 2, కూలీ' చిత్రాల స్పెషల్ షోస్ కు వెయ్యి రూపాయలకు పైగా టిక్కెట్ రేటు నిర్ణయించారని తెలుస్తోంది. టిక్కెట్స్ రేట్ల పెంపు ఇలాఉంటే, తమిళ సినీజనానికి తెలుగువారంటే మరీ చిన్నచూపై పోయిందనీ అంటున్నారు. తెలుగునాట జరిగిన 'కూలీ' ప్రీరిలీజ్ ఈవెంట్ కు హీరో రజనీకాంత్ గైర్హాజరు అయ్యారు. ఇక తమిళనాట 'కూలీ' ఆడియో సక్సెస్ మీట్ జరగగా, దానిని తెలుగులోకి అనువదించి జెమినీ టీవీలో ఆగస్టు 15న ప్రసారం చేస్తారనీ తెలుస్తోంది. తెలుగువారిని చులకన చేయడమంటే ఇదే కదా అనీ కొందరు సినీ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


హీరోలకు స్టార్ ఉన్నా లేకున్నా కోట్లకు కోట్లు పారితోషికాలు పెంచేయడం వల్లే ఆ భారాన్ని సినిమా పిచ్చోళ్ళపై రుద్దాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. వారికి రాష్ట్రప్రభుత్వాలు సైతం సహకరించడం అన్యాయమని సినీ ఫ్యాన్స్ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న హీరోలకు కూడా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచడం వల్ల వారు సోమరిపోతులై ఏడాదికి ఒకటి రెండు సినిమాల్లోనే నటిస్తున్నారని మూవీ లవర్స్ గుర్తు చేస్తున్నారు. అదే ఏ హీరో స్థాయిని బట్టి ఆ తీరున పారితోషికాలు ఇస్తూ పోతే, చిన్న హీరోలు ఎక్కువ సినిమాలు చేసేవారని, తద్వారా థియేటర్లకు ఫీడ్ లభించేదని సినీ బఫ్స్ అంటున్నారు. ఎక్కువ సినిమాలు వస్తే ఎంతోమంది టెక్నీషియన్స్ బ్రతుకు తారనీ వారు సూచిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ చూస్తూండబట్టే టిక్కెట్ రేట్స్ పెంచేస్తున్నారనీ కొందరు గుర్తు చేస్తున్నారు. ఒక్కసారి మూవీ బఫ్స్ కూడా టిక్కెట్ రేట్స్ తగ్గేవరకూ సినిమాలు చూడకుండా ఉంటే అప్పుడు అందరూ దిగివస్తారనీ పరిశీలకులు అంటున్నారు. మరి వీరి మాటలను సినీ ఫ్యాన్స్ చెవికి ఎక్కించుకుంటారా? లేక మూవీ బఫ్స్ ఆవేదనను ఇటు సినీపెద్దలు కానీ, అటు ప్రభుత్వాలు కానీ అర్థం చేసుకుంటాయా అన్నది చూడాలి.

Also Read: Sameera Reddy: హారర్ ఫిల్మ్ తో తిరిగి తెరపైకి...

Also Read: Bhagyashri Borse: తమిళంలోకి.. భాగ్యశ్రీ! తంబీలు.. వ‌దులుతారా...

Updated Date - Aug 12 , 2025 | 05:33 PM

WAR 2 Song Promo: హృతిక్‌ వర్సెస్‌ తారక్‌.. 'దునియా సలాం అనాలి'

WAR 2: వార్‌-2.. తెలుగు కోసం కొత్త టైటిల్‌.. నిజమేనా?

Coolie Emotional Role: అందరికీ కనెక్ట్‌ అయ్యే పాత్ర

Coolie Movie: కూలీపై కాపీ మరక.. ఒకటి కాదు రెండు సినిమాలు

Coolie Powerhouse Song: కూలీ నుంచి ‘పవర్‌హౌస్’ లిరిక్ వీడియో.. రజనీ ఫ్యాన్స్‌లో ఫుల్ హైప్