Gangs Of Godavari Movie Review: విశ్వక్ సేన్ గోదావరి నేపథ్యంలో చేసిన సినిమా ఎలా ఉందంటే... 

ABN , Publish Date - May 31 , 2024 | 12:20 PM

విశ్వక్ సేన్, దర్శకుడు కృష్ణ చైతన్యతో కలిసి గోదావరి నేపథ్యంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేహా శెట్టి, అంజలి కథనాయికలుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఎలా వుందో చదవండి.

Gangs Of Godavari Movie Review: విశ్వక్ సేన్ గోదావరి నేపథ్యంలో చేసిన సినిమా ఎలా ఉందంటే... 
Gangs Of Godavari Movie Review

సినిమా: గ్యాంగ్స్ అఫ్ గోదావరి (Gangs Of Godavari)

నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ, అజయ్ ఘోష్, హైపర్ ఆది, నాస్సర్, సాయి కుమార్, పృథ్విరాజ్ తదితరులు 

సంగీతం: యువన్ శంకర్ రాజా

ఛాయాగ్రహణం: అమిత్ మాదాడి 

నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య 

దర్శకత్వం: కృష్ణ చైతన్య 

విడుదల తేదీ: 31 మే, 2024

రేటింగ్: 2 (రెండు)


-- సురేష్ కవిరాయని 


విశ్వక్ సేన్ (Vishwak Sen) గోదావరి నేపథ్యంలో చేసిన సినిమా 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' (Gangs Of Godavari). కృష్ణ చైతన్య (krishna Chaitanya) దర్శకుడు. తెలంగాణ యాస మాట్లాడే విశ్వక్ సేన్ గోదావరి యాస మాట్లాడుతూ చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా వున్నాయి. అంజలి (Anjali), నేహా శెట్టి (Neha Shetty) కథానాయికలుగా చేస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. 

GoG.jpg

Gangs Of Godavari Story కథ:

గోదావరి దగ్గర లంకలో లంకల రత్నం లేదా రత్న (విశ్వక్ సేన్) ఒక గ్యాంగ్‌ని వేసుకొని రౌడీలా తిరుగుతూ కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. అతను ఇంకా ఎదగాలి అనుకుంటాడు, అందుకని లోకల్ ఎంఎల్ఏ రుద్రరాజు (గోపరాజు రమణ) దగ్గర చేరి అతనికి దగ్గరవుతాడు. రుద్రరాజుకి వ్యతిరేకంగా వుండే ఇంకో రాజకీయ నాయకుడు నానాజీ (నాసర్) తో చేతులు కలిపి రుద్రరాజుపై ఎంఎల్ఏ గా పోటీ చేసి గెలుస్తాడు రత్న. నానాజీ కూతురు బుజ్జి (నేహా శెట్టి) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు రత్న. ఒక తగాదాలో నానాజీని కొడతాడు రత్న, ఆ దెబ్బకి నానాజీ చనిపోతాడు. ఈలోగా ఎంఎల్ఏగా ఓడిపోయిన రుద్రరాజు, రత్నపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. రత్నని ఎంఎల్ఏ గా ఓడగొడతాడు, రత్న ఇంటిపైకి రాళ్లు వేసి భార్యని భయపెడతాడు. భార్య జోలికి వస్తే రత్న ఇక రాజీ పడదాం అని అపొజిషన్ వాళ్ళకి కబురు పెడతాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రత్న తనపై గెలిచిన ఎంఎల్ఏ ని చంపేస్తాడు. రాజీకి రమ్మని చెప్పి ఎంఎల్‌ఏ ని చంపేయడం రత్న మనుషులకు నచ్చదు. వాళ్ళు రత్నకి ఎదురు తిరుగుతారు. తరువాత ఏమైంది? రత్నపై ప్రతీకారం తీర్చుకున్నారా? అదే ఊర్లో ఉన్న రత్నమ్మ (అంజలి).. రత్నకి ఎందుకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటుంది? కత్తి కట్టడం అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూడండి. (Gangs Of Godavari Review)

*Anjali: బాలయ్య నెట్టడంపై రియాక్టైన అంజలి.. ఇక ఫుల్‌స్టాప్‌ పడినట్టేనా?


GOG-Still.jpg

విశ్లేషణ:

దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాలు తీసిన కొద్దీ తన ప్రతిభని మర్చిపోతున్నట్టున్నాడు. ఎందుకంటే ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని పేరు పెట్టి గోదావరి నేపథ్యం అని చెప్పి అందులో గోదావరి వాళ్ళ పరువు తీసేటట్టుగా తెరమీద చూపించాడు. ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా ఉండదు. సినిమా మొత్తం చూసుకుంటే నరుక్కోవడం, పొడుచుకోవడం తప్పితే, కథ ఏమీ లేదు.

ఒక చిన్నపాటి రౌడీ ఒక్కసారిగా ఎమ్మెల్యే పక్కకి చేరిపోతాడు, వెంటనే అదే ఎమ్మెల్యే పై పోటీ చేసి గెలిచేసి ఎమ్మెల్యే అయిపోతాడు. వెంటనే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి, ఈసారి ఎమ్మెల్యేగా ఓడిపోతాడు. ఆ ఎన్నికలన్నీ ఒక జోక్ లాగా చేశాడు దర్శకుడు కృష్ణ చైతన్య. పోనీలే అది జోకు అనుకుంటే మాట్లాడితే ఫ్లాష్ బాక్ అంటూ వెళుతూ ఉంటాడు, అదేదో కొత్తగా స్క్రీన్‌ప్లే చూపిద్దాం ప్రేక్షకులకి అనుకున్నాడేమో కానీ అది బెడిసికొట్టింది. (Gangs Of Godavari Movie Review)

అసలు కథ ఏమి రాసుకున్నాడు, తెరపై ఏమి చూపించాడో దర్శకుడికి అయినా అర్థం అయిందో లేదో మరి. అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? 

Also Read: Balayya Viral Video- ఈవెంట్ లో జరిగింది వేరు, సామాజిక మాధ్యమాల్లో చూపించేది వేరు


మాట్లాడితే లంకలో కత్తి కడితే పది తరాల వరకు ఆ పగ పోదు అని చెపుతూ ఉంటాడు. అసలు దర్శకుడు గోదావరిలో పెరిగాను అని చెప్పి గోదావరి నేపథ్యంలో ఇంత దారుణమైన కథ అతని దగ్గర నుండి వచ్చిందని ఎవరూ ఊహించరు. కృష్ణ చైతన్య మంచి రచయిత, దర్శకుడు ఇది అతనికి వచ్చిన గొప్ప అవకాశం. కానీ అతను ఈ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. (GoG Review)

లంకల రత్నం అనే ఒక ఆవారా అబ్బాయి తన తెలివితేటలతో ఎలా పైకి ఎదిగాడు, ఆ ఊర్లో అందరినీ శాసించే స్థాయికి ఎలా చేరాడు అనేది చాలా ఆసక్తికరంగా చూపించవచ్చు. కానీ కృష్ణ చైతన్య అవేవీ లేకుండా మరీ సినిమాటిక్‌గా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కథలా కాకుండా ఒక్కో సన్నివేశాన్ని తీసుకున్నాడు అనిపిస్తోంది. గోదావరి రాజకీయాల్ని సరిగా చూపించలేకపోయాడు, సినిమా కథపై కాకుండా కేవలం పోరాట సన్నివేశాలు మీదే దృష్టి పెట్టాడనిపిస్తోంది. ఇక అందరూ గోదావరి యాస మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక విశ్వక్ సేన్ తప్ప. అతను సరిగ్గా హోమ్ వర్క్ చెయ్యలేదు అనిపిస్తోంది. మొదటి సగం కన్నా రెండో సగం అసలు భరించలేని విధంగా ఉంటుంది. సంగీతం అంతంత మాత్రమే, ఛాయాగ్రహణం పరవాలేదు. సినిమాలో భావోద్వేగాలు అస్సలు కనపడవు. ఏ పాత్రలోనూ, ముఖ్యంగా రత్న పాత్రలో సంఘర్షణ లేదు. ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం. 

GoG.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే విశ్వక్ సేన్ పరవాలేదు అనిపించాడు. అటు గోదావరి యాస సరిగ్గా మాట్లాడక, ఇటు మామూలుగా అయినా మాట్లాడలేక ఇబ్బంది పడ్డాడు. అతని కెరీర్ కి ఈ సినిమా ఉపయోగపడదు. అంజలి మంచి నటి, ఆమె బాగా చేసింది. ఆమె పాత్ర ఇంకా బలంగా రాసుంటే బాగుండేది. నేహా శెట్టి తన పాత్ర పరిధి మేరకు చేసింది. ఆమె పాత్ర పెద్దగా లేదు. ఉన్నంతలో ఆమె చేసింది. గోపరాజు రమణ తన పాత్రను బాగా పండించారు. ఆది, పెమ్మసాయిలకి మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. నాసర్, ఇంకా చాలామంది నటీనటులు ఓకే. కథ బలంగా లేనప్పుడు ఎటువంటి పాత్ర అయినా తేలిపోతుంది. (Vishwak Sen Movie Gangs Of Godavari Review)

చివరగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో అక్కడక్కడా ఒకటి రెండు సన్నివేశాలు తప్పితే సినిమాలో కథ లేదు, భావోద్వేగాలు లేవు, బలమైన సంఘర్షణ లేదు. గోదావరి నేపధ్యం అని చెప్పి కథ ఏమీ లేకుండా చంపుకోవడాలు, నరుక్కోవడాలూ ఎక్కువ చూపించాడు దర్శకుడు కృష్ణ చైతన్య. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా వస్తుందట, ముందుగానే స్ట్రీమింగ్ పార్థనర్‌ని చూపించారు.

Read Latest Cinema News

Updated Date - May 31 , 2024 | 12:48 PM