Gangs of Godavari : మంచి కిక్కు ఇచ్చే సినిమా

ABN , Publish Date - May 29 , 2024 | 06:47 AM

విష్వక్‌సేన్‌ నటించిన తొలి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’ మే 31న విడుదలై ఘన విజయం అందుకొంది. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం కూడా అదే తేదీన విడుదలవుతోంది...

Gangs of Godavari : మంచి కిక్కు ఇచ్చే సినిమా

విష్వక్‌సేన్‌ నటించిన తొలి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’ మే 31న విడుదలై ఘన విజయం అందుకొంది. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం కూడా అదే తేదీన విడుదలవుతోంది. ట్రైలర్‌ చూస్తుంటే మంచి కిక్కు ఇచ్చే సినిమాలా అనిపిస్తోంది. ఈ చిత్రంతో విష్వక్‌ మరో పెద్ద హిట్‌ అందుకోవాలి’ అని హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేహాశెట్టి కథానాయిక. అంజలి కీలకపాత్ర పోషించారు. ఈ నెల 31న విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, నన్ను, విష్వక్‌ను చూస్తే కవలలే అనుకుంటారు. నాలానే అతనిదీ ఉడుకురక్తం.. మంచి దూకుడు ఉంది. విష్వక్‌కు సినిమా అంటే పాషన్‌. అదే మా ఇద్దరినీ కలిపింది. ప్రతిసారీ కొత్తదనం కోసం అతను పడే తపన నాకు నచ్చింది. ప్రతి సినిమాకూ కొత్తగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచారు. ఈ సినిమాలో సత్తా ఉందని ట్రైలర్‌తోనే తెలిసిపోతోంది. నిర్మాత వంశీ గారు మంచి అభిరుచితో సినిమాలు తీస్తున్నారు.


మా అబ్బాయి మోక్షు కూడా ఇండస్ట్రీకి వస్తున్నాడు. ‘నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవద్దు... విష్వక్‌, అడివిశేష్‌, సిద్దు జొన్నలగడ్డ లాంటివాళ్లని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకో’ అని తనకు చెప్పాను. నటులు నిత్యావసర వస్తువుల్లాంటివాళ్లు. ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. త్వరలో మంచి కాంబో ఉంది. అనౌన్స్‌ చేస్తాం’ అన్నారు.

విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా షూటింగ్‌లో నేను గాయపడ్డానని తెలుసుకొని బాలకృష్ణ గారు చాలా బాధపడ్డారు. ఆయన ఫోన్‌ చేసి పావుగంట మాట్లాడారు. బాలకృష్ణ గారు చూపించిన ప్రేమకు నాకు ఏడుపు ఆగలేదు. ఈ సినిమా గురించి చెబుతూ ఆయన ‘ఓల్డ్‌ వైన్‌ ఇన్‌ న్యూ బాటిల్‌’ అన్నారు. ‘ఇంత పొగరుతో ఉంటే ఇండస్ట్రీలో తొక్కేస్తారు’ అని చాలామంది అన్నారు. గానీ నేను నా క్యారెక్టర్‌ని వదిలిపెట్టలేదు. విమర్శలు చేసినవాళ్ల నోళ్లు మూతపడ్డాయి. దీనికి కారణం అభిమానులే. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కత్తి లాంటి సినిమా. నాకు దొరికిన బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ వంశీ అన్న. రత్న ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, మీతో పాటు మీ ఇంటికొస్తాడు’ అని చెప్పారు.


నాగవంశీ మాట్లాడుతూ ‘జూన్‌ 10న ఇంకోటి ప్లాన్‌ చేస్తున్నాం. పూనకాలే. విష్వక్‌ కెరీర్లో ఇదో మైలురాయిగా మిగిలిపోతుంది. ఈ చిత్రంలో విష్వక్‌ నట విశ్వరూపం చూస్తారు. యువన్‌ శంకర్‌ రాజా ఆర్‌ఆర్‌ ఇరగదీశాడు. చైతన్య చాలా బాగా తీశాడు’ అని చెప్పారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ ‘ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ దక్కింది. ఈ సినిమాకు మూలం మా గురువు త్రివిక్రమ్‌ గారు. నాగవంశీ, చినబాబు వల్లే ఇది సాధ్యమైంది. లంకల రత్న పాత్ర మిమ్మల్ని వెంటాడుతుంది’ అని తెలిపారు. నేహాశెట్టి మాట్లాడుతూ ‘రాధికాలానే బుజ్జి పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. విష్వక్‌ షూటింగ్‌లో సాయం చేశాడు’ అన్నారు. అంజలి మాట్లాడుతూ ‘నటిగా చాలా కొత్తగా ట్రై చేశాను. విష్వక్‌ కలుపుగోలు మనిషి. నేహాతో పనిచేయడం గొప్ప అనుభవం’ అని చెప్పారు.

Updated Date - May 29 , 2024 | 06:47 AM