‘వారణాసి’ ఈవెంట్ టెన్షన్.. ఏడుపొచ్చేసింది: కార్తికేయ
ABN, Publish Date - Sep 27 , 2026 | 05:25 PM
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన గ్లింప్స్ ఈవెంట్ టైమ్‌లో తన పరిస్థితి ఏంటో కార్తికేయ తెలిపారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ చిత్ర గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ఎదురైన ఊహించని ఉత్కంఠభరిత అనుభవాన్ని దర్శక నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ (SS Karthikeya) తాజాగా సరదాగా గుర్తుచేసుకున్నారు.
ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన తాజా చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ (Don't Trouble the Trouble). శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ.. ‘వారణాసి’ గ్లింప్స్ విడుదల సమయంలో వేదికపై పడ్డ టెన్షన్‌ను పంచుకున్నారు.
‘‘అందరూ ఎంతో ఆసక్తిగా, పిన్ డ్రాప్ సైలెన్స్‌తో ఎదురుచూస్తున్న ఆ కీలక సమయంలో సడన్‌గా టెక్నికల్ సమస్య తలెత్తి గ్లింప్స్ ప్లే కాకపోవడంతో నాకు గుండె ఆగిపోయినంత పనైంది. క్షణాల్లో ఏడుపు కూడా వచ్చేసింది. ‘జెర్సీ’ సినిమాలో నాని రైల్వే స్టేషన్‌లో రైలు సౌండ్‌కి మ్యాచ్ చేస్తూ గట్టిగా అరుస్తాడు కదా.. ఆ క్షణంలో వేదిక వెనుక నేను కూడా లోలోపల అలాగే అరిచేశాను. అంత భయం వేసింది’’ అంటూ ఆనాటి టెన్షన్‌ను నవ్వుతూ చెప్పుకొచ్చారు.
ఇక ప్రపంచ స్థాయి అంచనాలతో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. వెండితెరపై సరికొత్త విజువల్ వండర్‌గా రానున్న ఈ చిత్రాన్ని 2027 ఉగాది కానుకగా ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్నారు. మరోవైపు కార్తికేయ నిర్మాతగా వ్యవహరించిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ లిస్ట్‌లోకి మరో దర్శకుడు.. ఊహించని కాంబినేషన్!
ఆ బ్రేకప్ సీన్ చేస్తున్నప్పుడు నిజంగానే ఏడ్చేశా: మమితా బైజు
రాజమౌళి కొన్ని సలహాలిచ్చారు: ఫాహద్ ఫాజిల్