ప్రభాస్ లిస్ట్‌లోకి మరో దర్శకుడు.. ఊహించని కాంబినేషన్!

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:53 PM

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. ఇప్పటికే వరుస భారీ పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ ఖాతాలో మరో క్రేజీ, ఊహించని ప్రాజెక్ట్ చేరినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Prabhas and Karthik Gattamneni

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. ఇప్పటికే వరుస భారీ పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ ఖాతాలో మరో క్రేజీ, ఊహించని ప్రాజెక్ట్ చేరినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. టెక్నికల్ బ్రిలియన్స్, స్టైలిష్ విజువల్స్ అందించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మిరాయ్’ (Mirai), ‘ఈగల్’ (Eagle) చిత్రాల దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni)తో ప్రభాస్ తదుపరి సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ‘ది రాజా సాబ్’ రిజల్ట్ అనంతరం మరో సినిమా ఈ బ్యానర్‌కు చేసిపెడతానని ప్రభాస్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.


మరో వైపు కార్తీక్ ఘట్టమనేనికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హోమ్ బ్యానర్ వంటిది. ఈ బ్యానర్‌లో ఆయనని లాక్ చేశారు. ఇక ఇప్పటికే కార్తీక్ ఘట్టమనేని చెప్పిన ఒక యూనిక్ కాన్సెప్ట్ లైన్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి స్థాయి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. సినిమాటోగ్రాఫర్‌గా, దర్శకుడిగా కార్తీక్ ఘట్టమనేని విజువల్ టేకింగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను లార్జర్ దేన్ లైఫ్ తరహాలో చూపించే విధానంపై మంచి పేరుంది. అలాంటి టెక్నికల్ దర్శకుడి చేతిలో ప్రభాస్ లాంటి భారీ కటౌట్ పడితే బాక్సాఫీస్ వద్ద విజువల్ వండర్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న లైనప్ పరిశీలిస్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ వైలెంట్ పోలీస్ స్టోరీ ‘స్పిరిట్’ శరవేగంగా పట్టాలెక్కుతున్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2’, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న మోస్ట్ అవేటెడ్ ‘సలార్ 2’ కూడా లైన్‌లో ఉన్నాయి. ఇన్ని భారీ ప్రాజెక్టుల నడుమ.. ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ప్రభాస్ మాసివ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు కార్తీక్ స్టైలిష్ టేకింగ్ తోడైతే వెండితెరపై సరికొత్త అనుభూతి ఖాయం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

ఆ బ్రేకప్ సీన్ చేస్తున్నప్పుడు నిజంగానే ఏడ్చేశా: మమితా బైజు

రాజమౌళి కొన్ని సలహాలిచ్చారు: ఫాహద్‌ ఫాజిల్‌

‘ద ప్యారడైజ్’.. 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే..

Updated Date - Sep 27 , 2026 | 03:53 PM