యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ గర్జన.. ఛాంబర్ రూల్స్‌కి నో!
ABN, Publish Date - Apr 08 , 2026 | 09:36 PM
తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల తీసుకున్న పర్సెంటేజ్ బేస్డ్ స్క్రీనింగ్ నిర్ణయంపై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఇటీవల తీసుకున్న పర్సెంటేజ్ బేస్డ్ స్క్రీనింగ్ నిర్ణయంపై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు (Tollywood Top Producers) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Active Telugu Film Producers Guild) సభ్యులు ఫిల్మ్ ఛాంబర్‌కు ఘాటైన లేఖ రాశారు. ఛాంబర్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఈ లేఖలో స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్‌లో థియేటర్ల స్క్రీనింగ్‌కు సంబంధించి వివాదం మొదలైంది. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి ప్రస్తుత దిగ్గజ నిర్మాతలంతా ఎదురు తిరగడంతో పరిస్థితులు కూడా ఒక్కసారిగా మారిపోయాయి.
TFCC జారీ చేసిన సర్క్యులర్ల ప్రకారం కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తుండగా, నిర్మాతలు మాత్రం పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జిబిటర్లతో చర్చించి, తమకు నచ్చిన నిబంధనల మీదనే సినిమాలను ఇస్తామని, ఛాంబర్ నిర్ణయించిన పర్సెంటేజ్ విధానంలో సినిమాలను ప్రదర్శించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు ఉండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ (రవిశంకర్ యలమంచిలి), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (టి.జి. విశ్వప్రసాద్), సితార ఎంటర్టైన్మెంట్స్ (నాగవంశీ), స్వప్న సినిమా (స్వప్న దత్), అన్నపూర్ణ స్టూడియోస్ (సుప్రియ యార్లగడ్డ), వృద్ది సినిమాస్, షైన్ స్క్రీన్స్, ఎస్వీసీసీ, ఎస్ఎల్‌వీ వంటి టాప్ బ్యానర్స్‌తో పాటు బన్నీ వాస్, ఎస్.కె.ఎన్, ధీరజ్ మొగిలినేని వంటి యువ నిర్మాతలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు.
తమిళనాడు, కేరళ, నార్త్‌లో అమలులో ఉన్న పర్సెంటేజ్ షేరింగ్ విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టాలని సురేష్ బాబు, సునీల్, శిరీష్ వంటి వారు కోరుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది. కానీ, యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో ఉన్న దిల్‌రాజు మినహా, మిగతా ప్రముఖ నిర్మాతలందరూ మొదటి వారం షేర్‌ను దెబ్బతీసే ఈ చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. నైజాం థియేటర్లపై తమ నియంత్రణను నిలుపుకోవడానికి కొందరు సీనియర్ నిర్మాతల వ్యూహాత్మక ఎత్తుగడగా కూడా దీనిని గిల్డ్ భావిస్తోందని సమాచారం. నిర్మాతల గిల్డ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో టాలీవుడ్‌లో థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య చిన్నపాటి యుద్ధం మొదలైనట్లే కనిపిస్తోంది. ఒకవేళ ఛాంబర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, రాబోయే పెద్ద సినిమాల విడుదలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. చూద్దాం.. ఈ వివాదం ఎటువైపుకు దారితీస్తుందో?
ఇవి కూడా చదవండి:
ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్
స్క్రీన్స్ తక్కువ.. క్రేజ్ ఎక్కువ! డ్యూన్ మేనియా షురూ.. ఒక్కో టికెట్ 90 వేలు
అఖిల్ బర్త్‌డే స్పెషల్‌గా.. ‘లెనిన్’ న్యూ పోస్టర్ విడుదల
ఆమనికి తెలంగాణ బీజేపీలో పదవి...