ఆమనికి తెలంగాణ బీజేపీలో పదవి...

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:06 PM

ప్రముఖ నటి ఆమని గత యేడాది డిసెంబర్‌లో బీజేపీలో చేరారు. తాజాగా ఆమెను పార్టీ అధిష్టానం సినిమా సెల్ కన్వినర్ నియమించింది.

Aamani

గత యేడాది డిసెంబర్‌లో ప్రముఖ నటి ఆమని (Aamani) కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి (G. Kishan Reddy), రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ (BJP) తీర్థం పుచ్చు కున్నారు. ఆమె ఇలా పార్టీలో చేరారో లేదో... అలా ఇప్పుడు ఆమెకు ఓ కీలకపదవి దక్కింది. తాజాగా ఆమెను బీజేపీ సినిమా సెల్‌ కన్వినర్ గా పార్టీ నియమించింది. నిజానికి బీజేపీలో సినిమా రంగానికి చెందిన ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు. అయితే వాళ్ళు ఎన్నికల సమయంలో యాక్టివ్‌గా ఉంటున్నారు తప్పితే... విడి సమయాల్లో అంతగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనరు. అయితే ఆమని కూడా ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు టీవీ సీరియల్స్ కూడా చేస్తున్నారు. అయితే ప్రజా సేవ చేయడం కోసం తాను బీజేపీలో చేరానని ఆమె తెలిపారు.


ఆ రకంగా ఎంతోకొంత సమయాన్ని ఆమని తమ పార్టీకి కేటాయిస్తుందనే నమ్మకంతో కావచ్చు అధిష్ఠానం ఆమెకు సినిమా సెల్ కన్వినర్ పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అలానే కో-కన్వినర్‌గా టీవీ సీరియల్‌ నటుడు వైభవ్ సూర్యను తీసుకున్నారు. ఇక టీవీ, సినిమా నటుడైన జె.ఎల్. శ్రీనివాస్‌ను బీజేపీ సాంస్కృతిక విభాగానికి కో-కన్వినర్‌గా నియమించారు. గతంలో పలు పార్టీలలో చురుకైన పాత్రను పోషించిన జె.ఎల్. శ్రీనివాస్‌ ఎఫ్.డి.సి. డైరెక్టర్‌గానూ సేవలు అందించారు. తాజాగా ఆయనకు సాంస్కృతిక విభాగం కో-కన్వినర్‌ బాధ్యతలు అప్పగించారు. మరి హైదరాబాద్‌లో జరిగే కార్పొరేషన్‌ ఎన్నికల్లో వీరంతా పార్టీ విజయం కోసం ఎలాంటి కృషి చేస్తారో చూడాలి.

Updated Date - Apr 08 , 2026 | 06:06 PM