అధ్యక్షురాలు లలితపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సభ్యులు
ABN, Publish Date - Sep 04 , 2026 | 03:42 PM
తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఏకంగా యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలితో విసిగిపోయిన సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతృత్వంలో నడవాల్సిన యూనియన్లలో వివాదాలు చినికి చినికి గాలి వానగా మారుతున్నాయి. డాన్సర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఏకంగా యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలితో విసిగిపోయిన సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యూనియన్ ఆర్థిక వ్యవహారాలపై లెక్కలు అడిగిన సభ్యులను అధ్యక్షురాలు లలిత అవమానిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం హైదరాబాద్‌లో అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి తమ వాదనను వెల్లడించారు.
ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు రేణుక, శైలజ, భారతమ్మ, ఆదిలక్ష్మి, అరుణ తదితరులు మాట్లాడుతూ, 'తమ ఓట్లతో అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత లలిత తమ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నార'ని వారు ఆరోపించారు. సమావేశాల్లో, ఇతర సందర్భాల్లో ప్రశ్నించినప్పుడు మీడియా ముందే చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొన్నారు. యూనియన్‌లోని సభ్యులందరికీ సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధ్యక్షురాలిపై ఉందని, అయితే తమను కించపరిచేలా మాట్లాడటం బాధాకరంగా ఉందని అన్నారు. కారణం లేకుండా తనకు నచ్చని సభ్యులను అనవసరంగా సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం ? యూనియన్‌లో కమిటీతో కూర్చొని మాట్లాడిన తర్వాత తప్పు అయితే వారికి శిక్ష విధించవచ్చు. ప్రెసిడెంట్ ఇష్టానుసారంగా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు.
'యూనియన్ కి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా అడిగినప్పుడు దానికి సరైన సమాధానంగా మా ప్రెసిడెంట్ లెక్కలు చూపించాలి. కానీ అది చూపించకుండా ఆమె ఎగతాళిగా మాట్లాడుతున్నారు. గత పదేళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన లెక్కలు, ఆదాయ-వ్యయ వివరాలు సభ్యులకు వెల్లడించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. యూనియన్ సభ్యులు చెల్లించే చందాలు, ఇతర రూపాల్లో వచ్చే నిధులు ఎలా ఖర్చవుతున్నాయో స్పష్టత ఇవ్వాలి' అని వారు కోరారు. యూనియన్ నిబంధనల ప్రకారం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారితో పాటు కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సభ్యులు తెలిపారు. అయితే అధ్యక్షురాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కమిటీ ఆమోదం లేకుండానే ప్రశ్నించిన సభ్యులపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. దీంతో తమ ఉపాధికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ జీవన పరిస్థితులను కూడా మహిళా కార్మికులు వివరించారు. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రొడక్షన్ పనుల్లో పనిచేస్తూ, కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. చిన్న పిల్లలను ఇళ్ల వద్ద వదిలి పనులకు వస్తున్నామని, ఏడాదికి రూ. 5,000 చొప్పున యూనియన్‌కు చందా చెల్లిస్తున్నామని చెప్పారు. “మేము కష్టపడి సంపాదించిన డబ్బుకు లెక్క అడుగుతున్నాం. అందుకు మమ్మల్ని సస్పెండ్ చేయడం, పనులు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం?” అని వారు ప్రశ్నించారు.
పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
యూనియన్‌లో నెలకొన్న వివాదాన్ని వెంటనే పరిష్కరించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్, చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు జోక్యం చేసుకోవాలని సభ్యులు కోరారు. యూనియన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగం, స్థలం కొనుగోలు తదితర అంశాలపై పారదర్శకంగా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలకు చర్చల ద్వారా పరిష్కారం చూపించి, తమకు ఉపాధి పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
Rambha Oorvasi Menaka: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ
సినిమా రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం
సినిమా రివ్యూ: బెత్లెహామ్ కుటుంబ యూనిట్
Romanchakam Review: సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’ రివ్యూ