సినిమా రివ్యూ: బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:13 PM

నివీన్‌ పౌలీ, మమితా బైజు జంటగా  నటించిన  'బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌' చిత్రం ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గిరీష్‌ ఏడీ దర్శకత్వంలో ఫాహాద్‌ ఫాజిల్‌, దిలీష్‌ పోతన్‌, శ్యామ్‌ పుష్కరన్‌ నిర్మించిన  ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

సినిమా రివ్యూ: బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌

విడుదల తేది: 4–09–2026

పెద్ద హడావిడి లేకుండా సింపుల్‌ కథ, పచ్చని పరిసరాల్లో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి హిట్‌ కొట్టేస్తుంటారు మలయాళ మేకర్స్‌. అందుకే ఆ చిత్రాలకు టాలీవుడ్‌లో అంత క్రేజ్‌. ఓటీటీల్లోనే కాకుండా థియేట్రికల్‌గా కూడా మాలీవుడ్‌ చిత్రాలకు చక్కని ఆదరణ  లభిస్తుంది. తాజాగా వచ్చిన అలాంటి సింపుల్‌ సినిమానే ుబెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌. నివీన్‌ పౌలీ, మమితా బైజు జంటగా నటించగా, వినయ్‌ ఫోర్ట్‌, సంగీత్‌ ప్రతాప్‌, సురేష్‌ కృష్ణ, బిందు పనికర్‌, శ్రీంద కీలక పాత్రల్లో కనిపించారు. గిరీష్‌ ఏడీ దర్శకత్వంలో ఫాహాద్‌ ఫాజిల్‌, దిలీష్‌ పోతన్‌, శ్యామ్‌ పుష్కరన్‌ నిర్మించారు. ఓనమ్‌ పండగ సందర్భంగా అగస్ట్‌ 21న మలయాళంలో విడుదలైన బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం తెలుగులో అనువాదమై శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

ఆష్లే  (మమితా బైజు) కాలేజీ స్టూడెంట్‌. గిటార్‌ ప్లే చేయడం ఆమె హాబీ. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆష్లే కుటుంబం సొంతూరులో ఇల్లు అమ్మేసి అంగమలై కి మకాం మారుస్తారు.  అక్కడ ఓ కాలనీలో బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌ పేరుతో పరిసర చర్చ్‌, స్కూళ్లలో ఈవెంట్లు, క్యాటరింగ్‌ చేసే జస్టిన్‌ (నివీన్‌ పౌలీ) పక్క ఇంట్లోకి దిగుతుంది ఆష్లే కుటుంబం. కాలేజ్‌ డేస్‌లో లవ్‌ ఫెయిల్‌ కావడంతో వయసు మీరినా పెళ్లి చేసుకోకుండా ఉంటాడు జస్టిన్‌. అలాంటి జస్టిన్‌తో ఆష్లే పరిచయం స్నేహంగానూ, తర్వాత ప్రేమగానూ మారుతుంది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసి పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇంట్లో వాళ్ల బలవంతంతో ఆష్లే జస్టిన్‌ను కాదనుకుని విదేశాలకు వెళ్లిపోతుంది. కొన్నేళ్ల తర్వాత  ఓ పెళ్లి నిమిత్తం ఊరు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? జస్టిన్‌, ఆష్లే ఒకటయ్యారా లేదా అన్నది కథ.

విశ్లేషణ:

 'ప్రేమలు’సినిమాతో దక్షిణాదిలో మంచి పాపులర్‌ అయిన దర్శకుడు గిరీష్‌ మరోసారి సింపుల్‌ కథ, ఫన్‌ ఎలిమెంట్స్‌కి, చిన్నపాటి భావోద్వేగాలను మిళితం చేసి రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మలిచారు. ఫస్టాఫ్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమీ ఉండదు. జస్టిన్‌ లైఫ్‌, అతని వ్యాపారం, అతని తమ్ముడు తీసే షార్ట్‌ ఫిల్మ్‌, ఆష్లే కాలేజ్‌ లైఫ్‌ ఇలా హెల్తీ కామెడీ, సింపుల్‌గా వన్‌ లైనర్‌ పంచులతో సినిమా సరదాగా సాగిపోతుంది. సంగీత్‌ ప్రతాప్‌ షార్ట్‌ ఫిలిం మేకింగ్‌ వ్యవహారంతో ఫుల్‌ ఫన్‌ క్రియేట్‌  చేశాడు. దానికి చిన్న లవ్‌స్టోరీని కూడా జోడించారు. ఇక సెకండాఫ్‌లో జస్టిన్‌, ఆష్లే ప్రేమ కథ చాలా ఫన్నీగా సాగుతుంది. వినోదం, భావోద్వేగాల నడుమ చక్కని డైలాగ్‌లతో సాగుతుంది. ఏజ్‌ బార్‌ అయిన అబ్బాయి, యంగ్‌ అమ్మాయి మధ్య లవ్‌ సీన్స్‌ను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. రెండున్నర గంటలపాటు ఓ ప్రెష్‌ లవ్‌స్టోరీ చూసిన అనుభూతి కలిగించాడు. సినిమాలోని వినోదాత్మక సన్నివేశాలు లాజిక్కుల, లూప్‌ హోల్స్‌ను వెతికే ఆలోచన కూడా రానివ్వవు. ట్విస్ట్‌లు, టర్న్‌లు ఏమీ ఉండవు. డైరెక్ట్‌ లవ్‌ అండ్‌ కామెడీ కథను నడిపించేసింది. సింపుల్‌ లైన్‌కు లవ్‌, కామెడీ, ఎమోషన్‌ను జోడించి దర్శకుడు ప్రేక్షకులకు ఈజీగా చేరువయ్యేలా చేశాడు.  కైమాక్స్‌లో ఎమోషన్స్‌ను కాస్త బలంగా చూపించి ఉంటే ఇంకా బావుండేది. ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశంలా ఏర్పాటు చేసి సినిమాకు ఇచ్చిన ఎండింగ్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడికి మంచి మార్కులు పడతాయి.

నటీనటులు సాంకేతిక నిపుణులు పనితీరు...

నివిన్‌ పౌలీ నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జస్టిన్‌ పాత్రలో చాలా మెచూర్డ్‌గా కనిపించారు. ఏజ్‌ బార్‌ అయిన వ్యక్తిగా జస్టిన్‌ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మమితా బైజు కూడా ఆయనకు ఏమాత్రం తగ్గకుండా పోటీ పడి నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరూ కూడా పెర్‌ఫార్మర్స్‌ అని మరోసారి నిరూపించుకున్నారు. సంగీత్‌ ప్రతాప్‌ ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో చక్కని హ్యూమర్‌ను అందించాడు. సురేశ్‌కృష్ణ, శ్యాం మోహన్‌., శ్రీంద తదితరులు పాత్రల మేరకు చక్కని నటించారు.  విష్ణు విజయ్‌ మ్యూజిక్‌ ఆహ్లాదకరంగా ఉంది. సినిమాటోగ్రాఫర్‌ అజ్మల్‌ సాబు కేరళలోని చిన్న గ్రామాల్లో అందాలను చక్కగా చూపించారు. ఆకాశ్‌ జోసెఫ్‌ వర్గీస్‌ ఎడిటింగ్‌ నీట్‌గా ఉంది. ఎక్కడా విసుగు పుట్టించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగులో డైలాగ్స్‌ అద్భుతంగా కుదిరాయి. వన్‌ లైనర్స్‌తో థియేటర్‌లో ఆడియర్స్‌ పడిపడి నవ్వేలా రాశారు. స్ర్కీన్‌ప్లే పర్ఫెక్ట్‌గా కుదిరింది. సినిమాలో ఎక్కడా వల్గారిటీ లేదు. సింపుల్‌ లైన్‌తో పడిపడి నవ్వేలా దర్శకుడు చక్కగా సీన్స్‌ రాసుకున్నాడు. మలయాళం నుంచి ఈ మఽధ్యకాలంలో వచ్చిన రొమాంటిక్‌ కామెడీ చిత్రాల్లో ఇది బెస్ట్‌గా నిలుస్తుంది. చిన్న లవ్‌స్టోరీ, వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.

ట్యాగ్‌లైన్‌: బెత్లెహామ్‌ కుటుంబం.. ఫుల్‌ ఫన్‌ రైడ్‌

రేటింగ్‌: 3/5

Updated Date - Sep 04 , 2026 | 07:04 AM