Rambha Oorvasi Menaka: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:25 PM

అల్లరి నరేశ్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'రంభ ఊర్వశి మేనక' శుక్రవారం జనం ముందుకొచ్చింది. చంద్రమోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.

Rambha Oorvasi Menaka Movie

కొన్ని సినిమాలు కథానుగుణంగా ప్రేక్షకులను టైమ్ మిషన్‌లో ముందుకో వెనక్కో తీసుకెళతాయి. కానీ అలా దర్శకుడే టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్ళిపోతే 'రంభ ఊర్వశి మేనక' లాంటి సినిమాలు రూపుదిద్దుకుంటాయి. ఈ సినిమా దర్శకుడు చంద్రమోహన్‌ చింతాడ విషయంలో అదే జరిగింది. ఓ యాభై యేళ్ళు వెనక్కి వెళ్ళి అప్పటి ప్రేక్షకుల కోసం అన్నట్టుగా ఆయన ఈ సినిమాను తెరకెక్కించారు. శుక్రవారం జనం ముందుకొచ్చిన 'అల్లరి' నరేశ్‌ 'రంభ ఊర్వశి మేనక' ఎలా ఉందో చూద్దాం.

రాజమండ్రిలో ఉండే సూరిబాబు (అల్లరి నరేశ్‌) ఇంట్లో తాతల కాలం నాటి మ్యాజిక్‌ బుక్ ఒకటి ఉంటుంది. దాని మీద ఓ పద్ధతి ప్రకారం ముగ్గు వేస్తే ఇంద్రలోకం నుంచి రంభ ఊర్వశి మేనక దిగొచ్చి, కోరిన కోరికలను తీరుస్తారని అతని బాబాయ్ సీఈఓ (నరేశ్‌ విజయకృష్ణ) చెబుతాడు. అయితే ఆ మ్యాజిక్ బుక్ చేతిలోకి తీసుకుని ఎప్పుడు ముగ్గు వేయడానికి సూరి ప్రయత్నించినా... అతని తల్లి వారిస్తుంది. దానివల్ల ఒరిగేది ఏమీ లేదని నచ్చ చెబుతుంది. తండ్రి డ్రామా ఆర్టిస్ట్ కావడంతో సూరికి సినిమాల్లో హీరో కావాలనే కోరిక ఉంటుంది. అయితే రంభ, ఊర్వశి, మేనక మీదనే నమ్మకం పెట్టుకున్న సూరి, ఊరంత అప్పులు చేసి తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అదే ఊరికి అనాథాశ్రమం వార్డెన్‌గా అతని చిన్ననాటి క్లాస్‌మేట్‌ చిన్ని (సురభి) వస్తుంది. హైస్కూల్ లో సూరి, చిన్నితోనే చదువుకున్న అప్పల నాయుడు (తారక్ పొన్నప్ప) కు చిన్ని అంటే ప్రేమ. కానీ ఆమె ఇప్పుడు సూరి మీద అభిమానాన్ని చూపించడాన్ని తట్టుకోలేకపోతాడు. సొంతూరిలోనే పోలీస్‌ ఇన్ స్పెక్టర్ గా పనిచేసే అప్పల నాయుడు ఎలాగైనా సూరిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటాడు. ఇదే సమయంలో సూరి తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతుంది. మరి సూరి అనుకున్నట్టు రంభ ఊర్వశి మేనక ప్రత్యక్షమయ్యారా? అతన్ని కష్టాల నుంచీ గట్టెక్కించారా లేక మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టారా? అనేది మిగతా కథ.


తెలుగులో సోషియో ఫాంటసీలకు కొదవలేదు. పైగా దేవలోకం, యమలోకం నేపథ్యంలో ఎన్నో సినిమాలు యేళ్ళ తరబడి వస్తూనే ఉన్నాయి. గతంలో వచ్చిన ఇలాంటి సినిమాల్లోని అంశాలు తీసుకుని దర్శకుడు చంద్రమోహన్‌ 'పులిహోర' కలిపారు. అంతే! ఈ సినిమా కథ, కథనాలలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇందులో చాలా సన్నివేశాలు స్పూఫ్ తో సాగి 'సుడిగాడు' మూవీని గుర్తు చేస్తాయి. జయాపజయాలను పక్కన పెడితే ఈ మధ్య కాలంలో 'అల్లరి' నరేశ్‌ కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తున్నాడు. దాంతో అతనిలోని నటుడు వెలుగులోకి వస్తున్నాడు. కానీ ఈ తరహా రొట్టకొట్టుడు కథలను ఎంచుకుని, సినిమాలు చేస్తే జనం ఆదరిస్తారని ఎలా అనుకున్నాడో అర్థం కాదు. దర్శకుడు చంద్రమోహన్‌ మీద ఇవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి ప్రభావం బాగా ఉందనిపిస్తోంది. మూవీ మేకింగ్‌లో వాళ్ళ పోకడలనే అనుసరించాడు. ఇవాళ్టి జనరేషన్ ఆ తరహా చిత్రాలను చూడటానికి ఇష్టపడటం లేదని చరిత్ర చెబుతోంది. దానిని బలపరిచే విధంగానే ఈ సినిమా కూడా ఉంది.


నటీనటుల విషయానికి వస్తే అల్లరి నరేశ్‌కు ఇలాంటి పాత్ర చేయడం నల్లేరు మీద బండి నడక. అలానే సాఫీగా లాగించేశాడు. చివరిలో వచ్చిన మదర్ సెంటిమెంట్‌ సీన్స్ కు మాత్రమే కాస్తంత కష్టపడ్డాడు. హీరోయిన్ సురభి ఫర్వాలేదు. ఆమెకు నటించేందుకు పెద్దంత స్కోప్‌ లేదు. ఇక టైటిల్‌ రోల్ చేసిన రాశీ సింగ్‌, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌ పేషెంట్స్ మాదిరి ఉన్నారు తప్పితే... ఇంద్రలోకం నుంచి దిగొచ్చిన రంభ ఊర్వశి మేనకల్లా లేరు. క్లయిమాక్స్ లో వచ్చే రికార్డింగ్‌ డాన్స్ కు సరిపోతారని వాళ్ళను తీసుకున్నట్టుగా ఉంది. పెళ్ళికాని ప్రసాద్ పాత్రలకు ఈ మధ్య కాలంలో నరేశ్‌ వి.కె. ను బాగా వాడేసుకుంటున్నారు. ఆ మధ్య వచ్చిన 'శ్రీనివాస మంగాపురం'లోనూ ఇదే తరహా పాత్రను ఆయన పోషించారు. ఇతర ప్రధాన పాత్రలను కళ్యాణి రాజ్‌, తారక్‌ పొప్నప్ప, వెన్నెల కిశోర్, అజయ్‌, హరి తేజ, శ్రీనివాసరెడ్డి, గోపరాజు రమణ, విజయ్‌, అశోక్‌ కుమార్, రవి శివతేజ్, రవిప్రకాశ్‌ తదితరులు పోషించారు. చెప్పుకోవడానికి చాలామంది నటీనటులు ఉన్నా, ఆ పాత్రలేవీ పెద్దగా పేరు తెచ్చిపెట్టేవి కావు. చైతన్‌ భరద్వాజ్‌ బాణీలు గొప్పగా లేకపోయినా నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. రామ్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. అల్లరి నరేశ్‌ తనదైన కామెడీని పండించాలని అనుకున్నప్పుడు ఈ తరం మెచ్చే కథలను ఎంచుకోవాలని తప్పితే... కోల్డ్ స్టోరేజ్ లోని స్టోరీలను ఇకపై ముట్టుకోకుండా ఉంటే బెటర్. ఈ కథను జనం మెచ్చుతారని నిర్మాతలు రాజేశ్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ ఎలా నమ్మి కోట్లు ఖర్చు పెట్టారో అర్థమే కాదు!

రేటింగ్ : 2.25/5

ట్యాగ్‌ లైన్‌: పేరే కాదు కథా పాత చింతకాయే!

Updated Date - Sep 04 , 2026 | 02:33 PM