Romanchakam Review: సందీప్ రెడ్డి వంగా.. ‘రోమాంచకం’ మూవీ రివ్యూ

ABN , Publish Date - Sep 03 , 2026 | 07:02 AM

సందీప్ రెడ్డి వంగా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై త‌న స్టైల్‌కు భిన్నంగా తెర‌కెక్కించిన చిత్రం రొమాంచ‌కం.

Romanchakam Review

‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. Romanchakam Movie Review

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తాను స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై అన్నయ్య ప్ర‌ణ‌వ్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కించిన చిత్రం 'రోమాంచ‌కం' (Romanchakam). ఈ మూవీతో వేణుగోపాల్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా పరిచయం అయ్యారు. 'మేమ్ ఫేమస్'తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), '8 వసంతాలు' ఫేమ్ అనంతిక (Ananthika) ఇందులో జంట‌గా న‌టించారు. సినిమా ప్ర‌క‌ట‌న నుంచే మంచి హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆపై విడుద‌లైన పాట‌ల‌తో యూత్‌కు కూడా చేరువ‌యింది. అలాంటి ఈ సినిమా స్పెషల్‌ ప్రీమియర్స్‌ బుధ‌వారం రాత్రి వేయ‌గా గురువారం థియేట‌ర్ల‌కు వ‌చ్చింది. మ‌రి సినిమా ఎలా ఉంది, ఆడియ‌న్స్‌ను మెప్పించిందా లేదా అన్నది రివ్యూలో చూద్దాం

కథ విషయానికొస్తే..

అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఇంజినీరింగ్ పూర్తి చేసి త‌న న‌లుగురి ఫ్రెండ్స్‌తో క‌లిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే ఎప్ప‌టికైనా రోమాంచకం పేరుతో నేటి జెన్ జీ యూత్‌కు ఫ్లెక్సిబుల్‌గా ఉండే విధంగా డేటింగ్ యాప్ ని పెట్టాలని ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. అందు కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఓ డేటింగ్ యాప్‌లో చెన్నైకి చెందిన‌ అమ్మాయి మైథిలి (అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఆపై క్లోజ్ అవుతాడు. మైథిలీ పుట్టినరోజున ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెన్నై వెళ్లిన అన్వేష్‌కు ఊహించని షాక్ తగులుతుంది. మైథిలి అతడిని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ ఫోన్ చేసి హైదరాబాద్ వస్తానని చెబుతుంది. హైద‌రాబాద్ వ‌చ్చిన మైథిలీని అన్వేష్ త‌న ఫ్రెండ్ ఫ్లాట్ త‌నది అని చెప్పి అందులో ఉంచి ఫ్రెండ్‌ను క‌ల‌వ‌డానికి వెళ‌తాడు. అయితే.. కాసేప‌టి త‌ర్వాత అన్వేష్ తిరిగి వ‌చ్చేట‌ప్ప‌టికీ సూసైడ్ నోట్ పెట్టి మాయ‌మ‌వుతుంది. దాంతో అన్వేష్, అత‌ని మిత్రులు టెన్ష‌న్ ప‌డి సిటీ అంతా త‌న‌ను వెతికే ప‌నిలో త‌ల‌మున‌క‌లై పోతారు. ఈ క్ర‌మంలో పోలీస్ స్టేష‌న్‌కు సైతం వెళ్లి ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇంత‌కు మైథిలీ హైద‌రాబాద్‌కు ఎందుకు వ‌చ్చింది? త‌న‌కు ఏమైంది? ఫ్లాట్ నుంచి మైథిలీ ఎందుకు, ఎలా మిస్ అయింది? చివ‌ర‌కు మైథిలీ దొరికిందా, వారి ల‌వ్ స్టోరి ఏమైంద‌నేదే ఈ స్టోరి.


సినిమా విశ్లేషణ..

సినిమా ట్రైల‌ర్‌, పాట‌లు విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్ష‌కుల నుంచి మంచి అటెన్షన్‌ రాబ‌ట్టుకుంది. పైగా సందీప్ వంగా బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్ర‌భాస్ స్వ‌యంగా రంగంలోకి దిగి ప్ర‌మోష‌న్స్‌ చేయ‌డం మ‌హేశ్‌ బాబు సైతం సినిమా గురించి ట్వీట్ చేయడంతో వారి వారి అభిమానుల్లో, సినీ ల‌వ‌ర్స్‌లో మంచి క్యూరియాసిటీ ఏర్ప‌డి జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు బాగానే ర‌ప్పించగ‌లిగింది. సినిమా ప్రారంభం నుంచే హీరో స్టార్టప్ గురించి చెప్ప‌డం, అందు కోసం స్వ‌యంగా మ‌రో యాప్‌తో ఓ అమ్మాయితో ప‌రిచ‌యం పెంచుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. కానీ అమ్మాయి హీరో లైఫ్‌లోకి వ‌చ్చాక అతని ఫ్రెండ్స్ వ్య‌వ‌హ‌రించే తీరు, చేసే ప‌నులు చూసే వారికి కాస్త విసుగు తెప్పిస్తాయి. చెన్నై ఎపిసోడ్ తర్వాత కథలో ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రం నవ్విస్తాయి. ఆపై మైథిలి మిస్సింగ్ అవ్వడం ద్వారా రెండో భాగంపై ఉత్కంఠను పెంచారు. సెకండ్ హాఫ్ మొత్తం మైథిలి కోసం అన్వేష్, అతని స్నేహితులు చేసే అన్వేషణ చుట్టూ సినిమా తిరుగుతుంది. సస్పెన్స్‌కు కామెడీని జ‌త చేసి న‌వ్వించే ప్ర‌య‌త్నాలు చేశారు గానీ ఇప్ప‌టికే వంద‌ల కొద్ది సినిమాల్లో చూసిందే మ‌ళ్లీ ఇక్క‌డ కూడా రిపీట్ అవుతూ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌ పెట్టినట్టు అయ్యింది.

సినిమా చూసే ప్రేక్ష‌కుడికి త‌ర్వాత జ‌ర‌గ‌బోయేదేంటో ఇట్టే తెలిసి పోతూ రొటీన్‌గా సాగిపోతుంది. 'యానిమ‌ల్' ఫేం ఉపేంద్ర లిమాయే పోలీస్ పాత్రతో చేయించిన కామెడీ చూసే వారికి వెగ‌టు పుట్టిస్తుంది. మొద‌టి నుంచి రొమాంటిక్ మూవీ అంటూ చెప్పుకొచ్చిన‌ప్ప‌టికీ ఓ పాట‌లో మిన‌హా మ‌రెక్క‌డా ఆ ల‌వ్ అనేది కనిపించదు. ఆ మేర‌కు హీరోహీరోయిన్ల మ‌ధ్య బ‌ల‌మైన‌ స‌న్నివేశాలు సైతం లేవు. అంతేగాక 'నేను చెన్నై వ‌చ్చాను. ఫ‌లానా హోట‌ల్‌కు ర‌మ్మ‌'ని హీరో చెబితే వెంట‌నే బ్లాక్ చేసిన హీరోయిన్, ఆపై కాల్ చేసి 'నేనే హైద‌రాబాద్‌ వ‌స్తున్నా ఫ్లాట్ చూడు' అన‌డం, తిరిగి చెప్పా పెట్ట‌కుండా ఫ్లాట్ నుంచి వెళ్లడానికి చెప్పే కార‌ణాలు అంతగా కన్వెన్సింగ్‌గా లేవు. ఇవ‌న్నీ చూస్తుంటే ఓ సంద‌ర్భంలో హీరోయిన్‌ను ఉద్దేశించి 'నిబ్బా మొహాన్నిచూడ‌లేదు' అని చెప్పే డైలాగ్ ఆమె పాత్ర తీరుకు యాప్ట్ అనిపిస్తుంది. ఇక చివ‌ర‌కు త‌న వైపు త‌ప్పులు పెట్టుకుని హీరోను ఓ రేంజ్‌లో తిట్టి వెళ్లి పోవ‌డం అప్ప‌టివ‌ర‌కు దారం లేని గాలి ప‌టంలా తోచింది చేసుకుంటూ వెళ్లే హీరో స‌డ‌న్‌గా జ్ఞానోద‌యం అయిన బుద్ధుడిలా అమ్మాయిలు, అమ్మ‌ల గురించి రెండు మూడు ఇన్ స్టా డైలాగులు కొట్టి హీరోయిన్‌ను బ‌తిమాల‌డం కోసం చెన్నై వెళ్ల‌డం రొటీన్‌గా ఉంటాయి. ఇక క్లైమాక్స్ అయితే ఇటీవ‌ల వ‌చ్చిన 'పాపం ప్ర‌తాప్' క్లైమాక్స్‌ను గుర్తు చేసి అస‌లు ఏం జ‌రుగుతుందిరా, ఎందుకురా ఇదంతా అనిపిస్తుంది.

ఇక న‌టీన‌టులు, సాంకేతిక విభాగాల విష‌యానికొస్తే..

హీరో, హీరోయిన్లు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేసిన‌ప్ప‌టికీ మైథిలీ క్యారెక్ట‌ర్ విష‌యంలో ఇంకా శ్ర‌ద్ద పెట్టి ఉంటే బాగుండ‌నిపిస్తుంది. ఇక సినిమాలో మేజ‌ర్ హైలెట్ మాత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఫేం న‌రేంద్ర ర‌వి దనే చెప్పాలి. అత‌నికి మంచి పాత్ర ప‌డింది. సినిమా ఆద్యంతం హీరో క‌న్నా అత‌నే బ్యాక్ బోన్ గా నిలిచాడు. అత‌ను క‌నిపించిన ప్ర‌తిసారీ త‌న డైలాగులు, టైమింగ్‌తో అద‌ర‌గొట్టాడు. స‌త్య త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో మంచి ఆర్టిస్ట్ టాలీవుడ్‌కు దొరికాడని చెప్పుకోవ‌చ్చు. ఇక క్లైమాక్స్‌లో డైరెక్ట‌ర్ అనుదీప్ క్యామీయో స‌ర్‌ఫ్రైజ్ చేస్తుంది. వాసూకీ వైభ‌వ్ అందించిన సంగీతంప్ర‌త్యేకించి రాధా ర‌మ‌ణ సాంగ్, చిత్రీక‌ర‌ణ బావున్నాయి. మిగిలిన నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉండి, సినిమాటోగ్రఫీ కూడా బాగా ప్లస్ అయింది. ఎడిటింగ్‌, డైలాగుల విష‌యంలో ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. అయితే సినిమా క్యాప్ష‌న్‌లో చెప్పిన‌ట్టుగా ప్రేమ లోపించినా అక్క‌డ‌క్క‌డ హాస్యంతో న‌వ్వించారు.

ట్యాగ్‌లైన్‌: జెన్ జీ, నిబ్బిల‌కు ‘రోమాంచకం’

రేటింగ్‌: 2.25/5

Updated Date - Sep 03 , 2026 | 07:48 AM