టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..
ABN, Publish Date - Nov 01 , 2026 | 06:03 PM
పండగ వచ్చిందంటే చాలు.. టాలీవుడ్లో బాక్సాఫీస్ యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే ‘నువ్వా-నేనా’ అంటూ స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు థియేటర్ల కోసం తలపడుతుంటారు.
పండగ వచ్చిందంటే చాలు.. టాలీవుడ్లో బాక్సాఫీస్ యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే ‘నువ్వా-నేనా’ అంటూ స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు థియేటర్ల కోసం తలపడుతుంటారు. మేం ముందంటే మేం ముందే డేట్ లాక్ చేసుకున్నామంటూ ఒకరిపై ఒకరు పంతాలకు పోవడం, చివరికి థియేటర్ల పంపకాల్లో రచ్చకెక్కడం తెలుగు చిత్రసీమలో ప్రతీ ఏటా చూసే రొటీన్ తంతే. అయితే, కలెక్షన్ల కోసమో.. ఈగోల కోసమో కొట్టుకు చావకుండా, పరిశ్రమ బాగు కోసం తోటి హీరోల సినిమాలకు ఎలా దారివ్వాలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, ధనుష్ నిరూపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ధనుష్ హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన పాన్-ఇండియా చిత్రం ‘ఓం: చాప్టర్ 1’ (OM Chapter 1). ఈ సినిమాను తొలుత అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే సరిగ్గా ముందు రోజే సూపర్ స్టార్ రజనీకాంత్ భారీ చిత్రం ‘జైలర్ 2’ ఉండటంతో.. రజనీ సినిమా వసూళ్లకు, థియేటర్లకు ఇబ్బంది కలగకూడదని ధనుష్ తన సినిమాను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే దీపావళి పండగ సీజన్‌ను ఎంచుకునే గొప్ప అవకాశం ఉన్నప్పటికీ.. అప్పటికే నవంబర్ 6న సూర్య నటిస్తున్న ‘సీన్’ (Scene) విడుదల తేదీని ప్రకటించి ఉండటంతో ధనుష్ ఆ తేదీని కూడా వదులుకున్నారు. ముందుగా విడుదల తేదీ ప్రకటించిన వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, తోటి హీరో సినిమాతో అనవసర క్లాష్ వద్దని భావించిన ధనుష్ (Dhanush).. తన సినిమాను నవంబర్ 20కి రీషెడ్యూల్ చేసుకున్నారు.
ఓ సినిమా రిలీజ్ డేట్ మారితే ప్రమోషన్ల ఖర్చు, థియేటర్ల అగ్రిమెంట్లు మారిపోయి నిర్మాతకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ధనుష్ స్వయంగా ఆ చిత్రానికి నిర్మాత అయినప్పటికీ.. ఎలాంటి భేషజాలు లేకుండా తోటి స్టార్ల కోసం వెనక్కి తగ్గడం విశేషం. ఇదే విషయాన్ని సూర్య (Suriya) తన ‘సీన్’ ఆడియో, ట్రైలర్ లాంచ్ వేదికపై వేలాది మంది అభిమానుల సమక్షంలో గుర్తుచేసుకుంటూ ధనుష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాకు బాక్సాఫీస్ వద్ద సోలో స్పేస్ ఇచ్చినందుకు ధనుష్ పెద్ద మనసును బహిరంగంగానే కొనియాడారు.
కానీ మన టాలీవుడ్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ప్రతీ సంక్రాంతికి ఎంతమంది నిర్మాతలు దండంపెట్టి వేడుకున్నా.. స్టార్ హీరోలు మాత్రం పంతాలకు పోయి ఒకే సీజన్లో నాలుగైదు భారీ చిత్రాలను ఒకరిపై ఒకరు వదులుతుంటారు. దీనివల్ల భారీగా నష్టపోయేది అంతిమంగా నిర్మాతలే. ఒకరి సినిమాను మరొకరు గౌరవించుకుంటూ, పరిశ్రమలో ఎలా మెలగాలనే విషయంలో సూర్య, ధనుష్ చూపించిన ఈ పరిపక్వత నిజంగా ప్రశంసనీయం. ఈగోలు పక్కన పెట్టి, బాక్సాఫీస్‌ను షేర్ చేసుకునే ఈ సంస్కృతిని చూసైనా మన టాలీవుడ్ అగ్ర హీరోలు నేర్చుకుంటారో లేదో చూడాలి..
ఇవి కూడా చదవండి:
RC17: యు కెన్ ఇమాజిన్.. అనౌన్స్మెంట్ పోస్టర్‌కు అర్థమేంటి?
NBK112: కొరటాల సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
‘మెగావర్స్’ ప్రోమో షూట్.. దర్శకుడెవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే