సందీప్ కిషన్ ‘కరికాల’లో గాయత్రి భరద్వాజ్.. రెండు భాగాలుగా పాన్ ఇండియా మూవీ
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:37 PM
సందీప్ కిషన్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘కరికాల’లో గాయత్రి భరద్వాజ్ కీలక పాత్ర పోషించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది.
సందీప్ కిషన్ హీరోగా మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న 'కరికాల' చిత్రం గురువారం ప్రారంభం కానుంది. ఈ సినిమాను 'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రూపుదిద్దుకునే ఈ సినిమా వచ్చే యేడాది జనం ముందుకు రానుంది. మొదటి భాగాన్ని 2027 జులై 2, రెండో భాగాన్ని 2027 అక్టోబర్ 28న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కేథరిన్ థ్రెసా, సాక్షి మడోల్కర్ నటించబోతున్నారు. ఇటీవల విడుదలైన సందీప్ కిషన్ 'సిగ్మా'లో ప్రత్యేక గీతంలో కేథరిన్ థ్రెసా నటించింది. సో... సందీప్ సరసన ఆమె నటించడం ఇది రెండో సారి.
ఇదిలా ఉంటే... తాజాగా ఈ సినిమా గాయత్రి భరద్వాజ్ ముఖ్య పాత్ర పోషించబోతున్నట్టు బుధవారం మేకర్స్ తెలిపారు. గతంలో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు', అల్లు శిరీష్ 'బడ్డీ' చిత్రాలలో గాయత్రి భరద్వాజ్ నటించింది. ప్రస్తుతం గాయత్రి భరద్వాజ్... విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న 'కల్ట్' మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. సో... 'కరికాల' ఆమెకు తెలుగులో నాలుగో సినిమా. ఈ మేరకు వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ ‘కరికాల’ టీం స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సోషియో ఫాంటసీ మూవీ 'కరికాల'కు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. గురువారం జరుగబోయే ప్రారంభోత్సవానికి సినిమా రంగంలోని ప్రముఖులు హాజరవుతారని దర్శక నిర్మాతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
సెట్లో ప్రమాదం.. ఇమ్రాన్ హష్మీకి తప్పిన ప్రాణాపాయం
సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాల విడుదల వాయిదా
RC17: కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి