సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాల విడుదల వాయిదా
ABN , Publish Date - Oct 14 , 2026 | 03:19 PM
సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అక్టోబర్లో విడుదల కావాల్సిన ఆదర్శ కుటుంబం, విసా, ఏమో ఏమో ఇది సినిమాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రజనీకాంత్ జైలర్ 2 పంపిణీతోనే సంస్థ ఈ నెల సరిపెట్టుకోవాల్సి వస్తుందా?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పరిస్థితి ఈ నెలలో మరీ అగమ్యగోచరం అయిపోయింది. ముందు ఇచ్చిన ప్రకటన బట్టి అక్టోబర్ నెలలో ఈ సంస్థ నుంచి బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలు రావాల్సి ఉంది. అందులో మొదటిది వెంకటేశ్ హీరోగా నటించిన 'ఆదర్శకుటుంబం'. దానిని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని తెలిపారు. కానీ ఆ తర్వాత 9కి వాయిదా వేశారు. ఆపైన ఆ తేదీ కూడా సినిమా రావడం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే... ఇదే సంస్థ అశోక్ గల్లా హీరోగా నిర్మించిన 'విసా' (వింటారా... సరదాగా) మూవీని అక్టోబర్ 17న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఉద్భవ్ రఘు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శ్రీగౌరీ ప్రియ హీరోయిన్. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ మరో జంటగా నటించారు. అయితే ఈ సినిమా విడుదల కూడా ఇప్పుడు వాయిదా పడింది.
ఇదే నెల చివరిలో అంటే 30వ తేదీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన 'ఏమో ఏమో ఇది' సినిమా విడుదల కావాల్సి ఉంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. కానీ సినిమా ప్రచారానికి కూడా ఇంకా మేకర్స్ శ్రీకారం చుట్టలేదు. దాంతో ఇది కూడా నెలాఖరుకు జనం ముందుకు వచ్చేది అనుమానమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అన్ని అనుకున్నట్టు జరిగితే 'ఆదర్శ కుటుంబం' సినిమాను నెలాఖరుకు విడుదల చేయొచ్చని కొందరి చెబుతున్నారు. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం కొత్త రిలీజ్ డేట్ విషయంలో కమిట్ కావడం లేదు. మూడు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో ఈ నెలంతా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సందడి చేస్తుందని అనుకుంటే... ఇప్పుడు ఒక్కటి కూడా విడుదల అవుతుందా లేదా అనే డౌట్ వస్తోంది.
అక్టోబర్ నెలలో సితార ఎంటర్ టైన్ మెంట్ కు కాస్తంత ఊరట కలిగించే అంశం ఏమిటంటే... సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' సినిమాను ఈ సంస్థ విడుదల చేయడమే! సో... మూడు స్ట్రయిట్ తెలుగు సినిమాల బదులు... ఓ డబ్బింగ్ సినిమా పంపిణీతో సితార సరిపెట్టుకోవాల్సి వచ్చింది! మరి నెలాఖరులో అయినా 'ఆదర్శ కుటుంబం' విడుదలై... మేకర్స్ లో జోష్ నింపుతుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
రామజోగయ్య శాస్త్రి తనయుడి సినీ అరంగేట్రం
Drishyam 3: 10 రోజుల్లోనే రూ.480 కోట్లు.. బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న దృశ్యం 3!
Akhil Raj: అనుపమతో కలిసి నటించాలన్న.. అమ్మ కోరిక నెరవేరింది