‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా.. దర్శకుడు శ్రీకర్ నయన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:20 PM
‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా అని దర్శకుడు శ్రీకర్ నయన్ తెలిపారు. జయసుధ, వాసుకి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది.
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన నిర్మించిన తాజా చిత్రం 'సమ్మర్ హాలిడేస్' ఈ నెల 6న విడుదల కాబోతోంది. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు శ్రీకర్ నయన్ తన గురించి, మూవీకి సంబంధించిన విశేషాలను గురించి మీడియాకు వివరించారు.
- మాది విశాఖ. కాలేజ్ డేస్ లోనే షార్ట్ ఫిలింస్ రూపొందించాను. అలా స్క్రిప్ట్, షార్ట్ ఫిలింస్ మేకింగ్ మీద ఆసక్తి పెరిగింది. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి 'తెల్లవారితే గురువారం'తో పాటు మరికొన్ని చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేశాను. కొన్ని కథలు సిద్ధం చేసుకుని అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. మధుర శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ధీరజ్ మొగిలినేనిని కలిశాను. ఆయనకు ఒక థ్రిల్లర్ మూవీ కథ చెప్పాను. కథ ఆయనకు నచ్చింది. అయితే 'ఫిలింమేకింగ్ లో అనుభవం ఉంటే బాగుంటుంది మనం ఖచ్చితంగా చేద్దా'మని చెప్పారు. ఆ తర్వాత కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు అవకాశం ఇచ్చాయి కానీ అక్కడ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా టైమ్ పట్టేలా కనిపించింది. ఆ తర్వాత ధీరజ్ కు 'సమ్మర్ హాలీడేస్' కథ నచ్చి అవకాశం ఇచ్చారు. ఆయన ఓకే అన్నాక చకచకా కాస్టింగ్, టెక్నీషియన్స్ ఫైనల్ అవడం.. ఇలా పనులన్నీ జరిగిపోయాయి.
- ఫస్ట్ మా సినిమాకు అనుకున్న టైటిల్ 'సమ్మర్ ఫ్రెండ్'. రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్న ఇద్దరు పిల్లలు సమ్మర్ లో స్నేహితులు అయితే ఎలా ఉంటుందనే పాయింట్ మీద ఈ కథను రెడీ చేశాను. మనం అమ్మమ్మ ఊరికి సమ్మర్ లో వెళ్లినప్పుడు ఎన్నో మెమొరీస్ ఉంటాయి. క్రికెట్ ఆడటం, తాటి ముంజలు తినడం, అమ్మమ్మ చెప్పే కబుర్లు వినడం, ఊరిలో కొత్త స్నేహాలు..ఇలాంటివి మనందరి జీవితాల్లో చూసి ఉంటాం. అవే ఈ కథకు స్ఫూర్తి. నా జీవితంలో జరిగిన ఘటనలు స్ఫూర్తి అని చెప్పలేను. మాది పిల్లల సినిమా కాదు పిల్లలు నటించిన పెద్దల సినిమా. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్. మా సినిమాను థియేటర్ లో చూసి ఎక్సిపీరియన్స్ చేయాలి.
- అరుణ్ అమ్మమ్మ పాత్రలో జయసుధ నటించారు. ఆమెకు మా కుటుంబమంతా అభిమానులం. ఆమె అమ్మమ్మ పాత్ర అనగానే మొదటి సీన్ లోనే ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. అరుణ్, జయసుధ గారి మధ్య వచ్చే సీన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆ సీన్స్ అన్నీ ప్రేక్షకులు హార్ట్ టచింగ్ గా ఫీలవుతారు. వాసుకి ది మంచి ఇంపార్టెంట్ రోల్. నేను ఈ కథ రాసినప్పుడు వాసుకి గారిని పాత్ర కోసం అనుకున్నాను. అలాంటి మంచి యాక్ట్రెస్ కు కీలకమైన పాత్రే ఇవ్వాలని అనిపించింది. మా మూవీలోని మెసేజ్, క్లైమాక్స్ లో స్ట్రాంగ్ డైలాగ్స్ కూడా ఆమెకే ఉంటాయి. హర్షిణి, రాజీవ్ కనకాల, హర్షవర్థన్ ఇలా ప్రతి ఒక్కరికీ మంచి రోల్స్ ఉన్నాయి. వాళ్ల పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది.
- ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ పెట్టాం. అరుణ్, రోహన్ లీడ్ రోల్స్, ఖుషిని 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ట్రైలర్ చూసి తీసుకున్నాం. వందమంది పిల్లలు కూడా నటించారు. అరుణ్, రోహన్ ఇద్దరూ వెరీ టాలెంటెడ్. గోదావరి యాస కూడా నేర్చేసుకుని నటించారు.
- 'సమ్మర్ హాలిడేస్' సినిమా సమ్మర్ కు రిలీజై ఉంటే చాలా బాగుండేది. కానీ మాకు సమ్మర్ స్లాట్ దొరకలేదు. జూలైలో రిలీజ్ కు వద్దామని అనుకున్నా అప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ ఉంది కాబట్టి ధీరజ్ వెయిట్ చేద్దామన్నారు. అలా డేట్ మారుతూ ఈ నెల 6న రిలీజ్ కుదిరింది. మనం ఈ మధ్య బ్లడ్ షెడ్, యాక్షన్ , వయలెంట్ మూవీస్ చూసి చూసి విసిగిపోయి ఉన్నాం. ఇలాంటి టైమ్ లో 'సమ్మర్ హాలీడేస్' మూవీ ప్లెజెంట్ ఎమోషన్స్ తో వెళ్తూ మన మొహం మీద చిన్న చిరునవ్వు తెప్పిస్తుంది.
- రోహన్ ఒక ప్రాబ్లమ్, అరుణ్ కు ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. సమ్మర్ హాలీడేస్ లో వారి వారి సమస్యలను ఎలా డీల్ చేసుకున్నారు అనేది మా మూవీలో చూస్తారు. ఈ కథలో మేసేజ్ చెప్పేకంటే 'సత్యం సుందరం' సినిమా లాంటి కథ చూపించాలని అనిపించింది. రోహన్, అరుణ్ పాత్రలు సత్యం, సుందరం పాత్రల్లా అనిపిస్తాయి. మా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అరుణ్ కు '35 ఇది చిన్న కథ కాదు' సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ విషయం తెలిసినప్పుడు అరుణ్ తో పాటు మా టీమ్ అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యాం.
ఇవి కూడా చదవండి:
రానా, కంగనా, రవిబాబు మూవీ.. టైటిల్ ఏంటంటే?
నాని ‘బ్లడీ రోమియో’ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..