సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సిల్క్ స్మిత ఫోటోలు వైరల్... ట్రోలింగ్ లో సుధా కొంగర...

ABN, Publish Date - Jul 27 , 2026 | 02:10 PM

సిల్క్ స్మిత కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిత్రం ఏమంటే... సంబంధం లేని వ్యక్తులను ఆమె మరణం తాలుకూ ముచ్చట్లోకి కొందరు నెటిజన్స్ లాగుతున్నారు.

Silk Smitha

ఒకప్పుడు దక్షిణాది సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు సమీపంలోని ఓ చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన విజయలక్ష్మి చెన్నయ్ చేరి సిల్క్ స్మితగా మారడం వెనుక పెద్ద కథే ఉంది. ఒకటిన్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో సిల్క్ స్మిత ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. వివిధ భాషల్లో రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించింది. ఒకానొక సమయంలో ఆమె ఐటమ్ సాంగ్‌ లేకపోతే సినిమా చప్పగా ఉంటుందని భావించిన పలువురు దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వేచి ఉండి... పాటలను చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. సిల్క్ స్మిత డేట్స్ ను తగ్గట్టుగా స్టార్స్ తమ కాల్షీట్స్ ను మార్చుకున్న ఉదాహరణలూ ఉన్నాయి.


సిల్క్ స్మిత అర్థాంతరంగా తనువు చాలించడానికి ముందు ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, మద్యానికి బానిస అయ్యిందని చెప్పుకునేవారు. సిల్క్ స్మిత డాక్టర్ రాధాకృష్ణ అనే వ్యక్తి తో సహజీవనం చేసిందని, ఆయన ప్రేమ పేరుతో ఆమెనుమోసం చేశాడని, ఆస్తులను కాజేయడంతో సిల్క్ స్మిత సూసైడ్ చేసుకుందని కూడా అప్పట్లో చెప్పుకునేవారు. సిల్క్ స్మిత చనిపోయి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆమె మరణానికి కారకులైన డాక్టర్ తో ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి నిజమైనవేనా? అని ప్రశ్నిస్తూనే కొందరు ఆ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

సిల్క్ స్మిత, డాక్టర్ తో ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవ్వడంలో వింతేమీ లేదు. కానీ స్మితతో ఉన్న డాక్టర్ ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తండ్రి అంటూ ఓ ప్రచారాన్ని సోషల్ మీడియాలో జరుగుతోంది. సుధా కొంగర తండ్రి కూడా డాక్టరే. అయితే ఆయన విజయవాడలో పనిచేసేవారు. ఇవాళ తమిళ రంగంలో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న సుధా కొంగర తెలుగులోనే తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. సూర్యతో ఆమె తీసిన 'సూరారై పోట్రు' మూవీకి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో సుధా కొంగర తన తండ్రిని తలుచుకుని ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా ప్రారంభమైన కొద్ది రోజులకే ఆయన కన్నుమూశారని బాధపడ్డారు. అయితే ఆమె తండ్రికీ... సిల్క్ స్మితతో అనుబంధం ఉన్న డాక్టర్ కు అస్సలు సంబంధమే లేదని తెలుస్తోంది.


సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సుధా కొంగర దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఓ దుష్ప్రచారం జరుగుతున్నట్టే తనకు తెలియదని స్పష్టం చేశారు. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఉద్దేశ్య పూర్వకంగా సుధా కొంగరపై ఇలాంటివి జరుగుతున్నాయేమోననే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల సుధా కొంగర 'పరాశక్తి' చిత్ర నిర్మాతలపై కేసు పెట్టారు. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కు వాళ్ళు ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టు తలుపు తట్టారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి తానేమీ చెప్పలేనని స్పష్టం చేసిన సుధా కొంగర... స్మిత మరణానికి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై విస్మయం వ్యక్తం చేశారు. తాను సోషల్ మీడియాకు ఎంతోకాలంగా దూరంగా ఉంటున్నానని, దీనిని గురించి తనకు తెలియదని చెప్పారు. నిప్పు లేనిదే పొగరాదని గతంలో అనుకునే వారు... కానీ ఇప్పుడు ఎలాంటి కనీస ఆధారాలు లేకుండానే నెటిజన్స్ తమకు నచ్చిన రీతిలో ఇష్టం లేని వ్యక్తులపై బురద చల్లేస్తున్నారు. ఇలాంటి విపరీత పరిణామాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో!

ఇవి కూడా చదవండి:

‘టాక్సిక్’ వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్.. అరాచకం

200 మిలియన్ వ్యూస్‌.. ‘ఆయా షేర్’ ఆల్ టైమ్ రికార్డ్

మహేష్ బాబు తర్వాత మళ్లీ జై కృష్ణలోనే చూశా: వీకే నరేష్

Updated Date - Jul 27 , 2026 | 02:17 PM