Tollywood: ఆగస్ట్‌లో 'ఇరుముడి'కి ప్రేక్షకులు పట్టం

ABN , Publish Date - Aug 29 , 2026 | 09:55 AM

ఆగస్ట్ నెలలో ఎనిమిది డబ్బింగ్‌ సినిమాలతో కలిపి మొత్తం ఇరవై మూడు చిత్రాలు విడుదల కాగా అందులో రవితేజ 'ఇరుముడి' అగ్రస్థానంలో నిలిచింది.

Irumudi Movie

ఆగస్ట్ మాసం మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. ఈ నెలలో విడుదలైన తెలుగు సినిమాలు కొన్ని మంచి విజయాన్ని, మరి కొన్ని భారీ విజయాన్ని నమోదు చేసుకుని నిర్మాతలకు ఆనందాన్ని పంచాయి. ముఖ్యంగా ఆగస్ట్‌ ఫస్ట్ వీకెండ్ లో స్ట్రయిట్‌ సినిమాలు నాలుగు విడుదలైతే, రెండు అనువాద చిత్రాలు వచ్చాయి. అందులో లోకేష్‌ కనగరాజు తొలిసారి హీరోగా నటించిన 'డీసీ' ఒకటి కాగా, బయోపిక్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆర్. మాధవన్ నటించిన 'జి.డి. నాయుడు' మరొకటి. 'డీసీ' మూవీ తెలుగులో పెద్దంత ఆడకపోయినా... తమిళనాట మంచి విజయాన్ని అందుకుని వంద కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకుంది. అయితే ఈ సారి మాధవన్ 'జి.డి. నాయుడు' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా... కమర్షియల్‌గా మాత్రం విజయాన్ని అందుకోలేదు. ఇక చాలా యేళ్ళ తర్వాత వరుణ్‌ తేజ్‌కు 'కొరియన్ కనకరాజు' రూపంలో విజయం లభించింది. విమర్శకుల నుంచి ఈ చిత్రానికి ప్రతికూల స్పందన లభించినా, సినిమా లాభాల బాటపట్టిందని నిర్మాతలు వెల్లడించడం విశేషం. అదే వారం వచ్చిన 'కె.జె.క్యూ', 'యముడు', 'అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి' సినిమాలు మెప్పించలేదు.

ఆగస్ట్ సెకండ్‌ వీకెండ్ లో నాలుగు స్ట్రయిట్‌ సినిమాలతో పాటు మూడు అనువాద చిత్రాలు వచ్చాయి. అందులో ప్రేక్షకులను మెప్పించింది సూర్య నటించిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఆడినట్టుగా తమిళంలో ఆడలేదు. దాంతో దాదాపు రూ. 150 కోట్ల కలెక్షన్స్ వరకే ఈ సినిమా అందుకోగలిగింది. నిజానికి ఈ యేడాది వచ్చిన సూర్య మరో మూవీ 'కరుప్పు'ను మించి ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ కోలీవుడ్ లో తగిన ఆదరణ లభించకపోవడంతో సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదే వారం వచ్చిన మరో అనువాద చిత్రం 'ది ఎండ్ ఆఫ్‌ ఓక్‌ స్ట్రీట్' జనాలను మెప్పించలేదు. అలానే విశాల్‌ తొలిసారి దర్శకత్వం వహించిన 'మకుటం' కూడా చేదు ఫలితాన్నే పొందింది. ఇక తెలుగు సినిమాల్లో 'పళ్ళబురుసు, అగధ, పాంచాలి పంచ భత్రుక,' చిత్రాలేవీ పెద్దంతగా ఆడలేదు. పరిమితమైన బడ్జెట్‌లో తెరకెక్కిన 'హుషార్‌ పిట్టలు' తమకు లాభాలు తెచ్చిపెట్టిందని మేకర్స్ ప్రకటించారు.


ఈ నెల మూడో వారాంతం టాలీవుడ్‌లో 'ఇరుముడి' రూపంలో కొత్త మెరుపులు సృష్టించింది. ఈ వారం ఆరు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు విడుదల కాగా 'ఇన్సీడియస్‌' అనే ఆంగ్ల అనువాద చిత్రం జనం ముందుకు వచ్చింది. స్ట్రయిట్‌ సినిమాలలో 'అమీర్ లోగ్, సర్దార్ సర్వాయి పాపన్న, రెడ్ బ్యాగ్‌, ఫైట్ మహా, పహల్గామ్‌ లవ్ స్టోరీ' చిత్రాలేవీ బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. అయితే... మాస్ మహరాజా రవితేజ 'ఇరుముడి' ఊహించని విజయాన్ని పొందింది. సినిమా మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్ రావడంతో తొలి రోజు రాత్రికే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్ల ముందు క్యూ కట్టారు. రెండో రోజుకు పలు కేంద్రాలలో షోస్ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ తరహా స్పందనను నిర్మాతలు సైతం ఊహించలేదు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ 'ఇరుముడి కట్టు' పేరుతో ఇది డబ్ అయ్యింది. అక్కడ కూడా మంచి స్పందన లభించడం విశేషం. ఈ సినిమా మొదటి ఐదారు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.


ఆగస్ట్ నాలుగోవారంలో వచ్చిన చిత్రాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యశ్‌ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్‌' గురించే. గీతూమోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాను యశ్‌, వెంకట్ కె నారాయణ నిర్మించారు. నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణీ వసంత్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా కోసం అన్ని సెంటర్స్ లోనూ బాగా ఆడుతున్న 'ఇరుముడి'ని ఎత్తేశారు. అయితే 'టాక్సిక్‌'కు నెగెటివ్‌ టాక్ రావడంతో మొదటి రోజు నుంచే తిరిగి 'ఇరుముడి' సినిమా ప్రదర్శన ప్రారంభించేశారు. ఆ రకంగా 'ఇరుముడి' సినిమాకు 'టాక్సిక్‌' చిన్న పాటి బ్రేక్ వేసినా... తిరిగి ఫస్ట్ గేర్‌లో మూవీ ఊపందుకోవడానికి ఉపయోగపడింది. 'టాక్సిక్‌' మూవీ బుధవారం జనం ముందుకు రాగా, ఈ శుక్రవారం వచ్చిన నయనతార అనువాద చిత్రం 'హాయ్‌', తెలుగు సినిమా 'కికు చిరంజీవి' కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయి. దాంతో 'ఇరుముడి'దే ఆగస్ట్ మాసం అని ట్రేడ్‌ వర్గాలు తేల్చేశాయి.

ఇవి కూడా చదవండి:

హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్‌ పాత్రలతో మెప్పిస్తున్న భామలు

Raviteja: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ స్పీడ్‌.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!

కృతి సనన్‌ రాఖీ యాడ్‌ వివాదం.. మధు చోప్రా హాట్‌ కామెంట్స్‌!

Updated Date - Aug 29 , 2026 | 09:56 AM