కృతి సనన్‌ రాఖీ యాడ్‌ వివాదం.. మధు చోప్రా హాట్‌ కామెంట్స్‌!

ABN , Publish Date - Aug 28 , 2026 | 07:23 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్ నటించిన రక్షాబంధన్‌ యాడ్‌ చుట్టూ మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.


బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్(kriti sanon) నటించిన రక్షాబంధన్‌ యాడ్‌ చుట్టూ మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సంప్రదాయ పండుగను కించపరిచేలా యాడ్‌ ఉందంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా (Madhu chopra) స్పందించారు. ముంబైలో జరిగిన ‘వుమెన్‌ బిల్డింగ్‌ సినిమా టుగెదర్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మీడియాతో మాట్లాడుతూ కృతి సనన్‌ యాడ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

'మహిళలకు ‘నా శరీరం.. నా ఇష్టం’ అనే హక్కు ఉండటం సరైనదే. అయితే ఆ స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉండాలి. సమాజంలో మన గౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు, ఇతరుల విలువలు, భావాలను కూడా గౌరవించడం ముఖ్యం. వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా ఎలాంటి దుస్తులు ధరించాలనేది ప్రతి ఒక్కరి నిర్ణయమే. కానీ ఈ ప్రత్యేకమైన ప్రకటనలో కృతి సనన్‌ కనిపించిన లుక్‌ మాత్రం సౌందర్యపరంగా నాకు ఆమోదయోగ్యంగా అనిపించలేదు” అని ఆమె వ్యాఖ్యానించారు.

రక్షాబంధన్‌ సందర్భంగా రూపొందించిన ఈ కమర్షియల్‌ యాడ్‌లో కృతి సనన్‌ గ్లామరస్‌ దుస్తుల్లో కనిపించారు. అంతేకాకుండా ఓ కుక్కకు రాఖీ కడుతున్నట్లు చూపించడంతో వివాదం మొదలైంది. సంప్రదాయమైన రాఖీ పండుగను ఇలా చూపించడం సరికాదంటూ పలువురు సోషల్‌ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కృతి సనన్‌ కూడా ఈ విమర్శలకు స్పందించారు. ఒక మహిళ వేసుకునే దుస్తుల నెక్‌లైన్‌ను బట్టి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నిర్ణయించలేమని ఆమె పేర్కొన్నారు. తన దుస్తులపై వస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. కృతి సనన్‌ నటించిన ఈ ప్రకటనపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో చివరకు సదరు యాడ్‌ను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

 

Updated Date - Aug 28 , 2026 | 07:23 PM