హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్‌ పాత్రలతో మెప్పిస్తున్న భామలు

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:29 PM

హీరోయిన్‌ అంటే అందం, ప్రేమకథ, పాటలు అనే రోజులు క్రమంగా మారుతున్నాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉండి, నటనకు ఆస్కారం ఉంటే చాలు అది పాజిటివ్‌ అయినా, నెగెటివ్‌ అయినా నటించేందుకు కథానాయికలు సిద్ధంగా ఉన్నారు.



హీరోయిన్‌ అంటే అందం, ప్రేమకథ, పాటలు అనే రోజులు క్రమంగా మారుతున్నాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉండి, నటనకు ఆస్కారం ఉంటే చాలు అది పాజిటివ్‌ అయినా, నెగెటివ్‌ అయినా నటించేందుకు కథానాయికలు సిద్ధంగా ఉన్నారు.
అలా ఈ మధ్యకాలంలో ఫీమేల్‌ యాంటగనిస్టులు గ్రే షేడ్స్‌ ఉన్న మహిళా పాత్రలు తెరపై కనిపిస్తున్నాయి. ఒక నటికి సినిమాలో స్ర్కీన్‌ టైమ్‌ ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు.  ఆ పాత్ర జనాల్ని ఎంతగా ప్రభావితం చేసింది అన్నదే ముఖ్యం. విలన్‌ అంటే మేల్‌ ఆర్టిస్ట్‌లు మాత్రమే కాదు.. ఫీమేల్‌ ఆరిస్టులు కూడా చేయగలరని నిరూపిస్తున్నారు. హీరోని ఢీకొట్టే స్థాయి బలమైన పాత్రలు పోషిస్తూ తమలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. 2021లో వచ్చిన ‘క్రాక్‌’ నుంచి తాజాగా ‘ఇరుముడి’ సినిమా వరకు ఈ ట్రెండ్‌ గమనిేస్త.. వరలక్ష్మి శరత్‌కుమార్‌, అనసూయ భరద్వాజ్‌, స్వాశిక వంటి నటీమణులు పలు చిత్రాల్లో  తమదైన ముద్ర వేశారు.


జయమ్మగా వరలక్ష్మి ఓ ట్రెండ్‌..

2021లో రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్‌’లో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముఖ్య భూమిక పోషించారు. అందులో ఆమె జయమ్మగా కనిపించారు. అప్పటిదాకా హీరోయిన్‌గా కొనసాగిన వరు.. తెలుగులో మొదటిసారి నెగటివ్‌ క్యారెక్టర్‌ అంగీకరించి జయమ్మ పాత్రను ఓ ఆట ఆడుకుంది. చిత్రంలో కటారి కృష్ణకు అత్యంత సన్నిహితురాలిగా, ఏ విషయంలోనైనా వెనక్కి తగ్గని క్రూరమైన పాత్రలో వరలక్ష్మి కనిపించారు. ఆమె పాత్రకు చక్కని ప్రశంసలు దక్కాయి. జయమ్మ పాత్ర తన కెరీర్‌లో ఎంత ప్రత్యేకమో వరలక్ష్మి కూడా గతంలో చెప్పుకొచ్చారు. నెగెటివ్‌  పాత్రలు చేయడంలో తనకు ఎలాంటి విసుగు లేదని.. ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత ‘వీరసింహారెడ్డి’లో భానుమతిగా కూడా వరలక్ష్మి మరోసారి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో మెప్పించారు. దీంతో తెలుగు తెరపై పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ విలన్‌ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు. జయమ్మ పాత్ర తర్వాత ఆమెకు నెగటివ్‌ మాత్రమే కాదు.. సినిమాకు కీలకం అనుకునే పాత్రలు కూడా ఆమె తలుపుతట్టాయి.

దాక్షాయణిగా అనసూయ..

హాట్‌ యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందింది. అలా ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా క్షణం. ఆ తర్వాత రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో మరింత పాపులర్‌ అయింది. అయితే ఈ రెండూ పాజిటివ్‌ పాత్రలే. కానీ ‘పుష్ప’ సిరీస్‌ చిత్రాల్లో ఆమె నటించిన  దాక్షాయణి పాత్ర మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. ఆ పాత్ర కూడా ప్రేక్షకుల దృష్టిని ఎంతో ఆకర్షించింది.  సాధారణంగా కనిపించే గృహిణి పాతకు భిన్నంగా.. భర్తపై ఆధిపత్యం చలాయిస్తూ, కోపం, అసూయ, ప్రతీకారంతో కూడిన పాత్రలో ఆమె కనిపించారు.  

తాజాగా రవితేజ నటించిన ‘ఇరుముడి’లో స్వాశిక పోషించిన పాత్ర కూడా జయమ్మ పాత్ర కేటగిరీలోకే వస్తుంది. ఇందులో టీచర్‌గా నెగటివ్‌ రోల్‌లో కనిపించి మెప్పించారు. సినిమాలో ఆమె కనిపించిన తీరు, డైలాగ్‌ డెలీవరీ ఆకర్షించాయి. ముఖ్యంగా కథలో కీలకమైన సందర్భాలో ఆమె పాత్ర ఎంతో ప్రభావం చూపించింది. ఈ పాత్ర ఆమెకు మరిన్ని అవకాశాలు తీసుకొచ్చేంతగా జనాల్లోకి వెళ్లింది.      


  

Updated Date - Aug 28 , 2026 | 06:29 PM