ఆ సెంటిమెంట్ రిపీట్! రవితేజ కంబ్యాక్ ఖాయమా?
ABN, Publish Date - Aug 04 , 2026 | 03:55 PM
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయే ఏకైక హీరో ఎవరంటే గుర్తుకు వచ్చే పేరు మాస్ మహారాజా రవితేజ. తాజాగా ఆయన హీరోగా నటిస్తోన్న ‘ఇరుముడి’ చిత్రం.. ఇప్పుడో సెంటిమెంట్ ప్రకారం హిట్టవుతుందని అంతా అనుకుంటున్నారు.
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయే ఏకైక హీరో ఎవరంటే గుర్తుకు వచ్చే పేరు మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja). సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఆయన స్పీడ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. అయితే, 2022లో వచ్చిన ‘ధమాకా’ (Dhamaka) తర్వాత రవితేజకి ఆ స్థాయి బిగ్గెస్ట్ హిట్ పడలేదనే చెప్పాలి. అందుకే ఈసారి ఎలాగైనా థియేటర్లలో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని మాస్ రాజా పక్కా ప్లాన్‌తో వస్తున్నారు.
రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘ఇరుముడి’ (Irumudi). సున్నితమైన భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఈ పవర్ ఫుల్ ఎమోషనల్ డ్రామాలో తమిళ నటి ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ అందించే సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
సాధారణంగా రవితేజ సినిమాల విషయంలో ఎలాంటి సెంటిమెంట్లను పట్టించుకోరు. ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు, కలిసిరాని హీరోయిన్లకు కూడా మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు. అలాగే తనతో హిట్స్ ఇచ్చిన ఫామ్‌లో ఉన్న డైరెక్టర్లతోనూ ప్రాజెక్టులు చేస్తూ వెళ్తుంటారు. వరుస ఫ్లాప్స్ ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, తన మాస్ మేనియాతో ముందుకు సాగడమే రవితేజ నైజం. కానీ, ఈసారి ‘ఇరుముడి’ కోసం ఒక ప్రత్యేకమైన కథను ఎంచుకున్నారు. ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన అంశం.. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్. ఇందులో రవితేజ తండ్రి పాత్రలో కనిపిస్తుండగా, చిన్నారి నక్షత్ర ఆయన కూతురిగా నటించింది.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) చిత్రంలో రవితేజ - పాప మధ్య వచ్చే సెంటిమెంట్ థియేటర్లలో ఏ స్థాయిలో వర్కవుట్ అయిందో ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత ‘ఇరుముడి’ చిత్రంతో బలమైన తండ్రీ-కూతుళ్ల భావోద్వేగాలతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భక్తి, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఈ చైల్డ్ సెంటిమెంట్ కూడా తోడవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ‘విక్రమార్కుడు’ సెంటిమెంట్ ప్రకారం.. మాస్ రాజాకు మళ్లీ ఆ స్థాయి గ్రాండ్ హిట్‌ను ‘ఇరుముడి’ తెచ్చిపెడుతుందో లేదో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
వరుస ఆఫర్లు.. మళ్లీ DSP ఫామ్‌లోకి వచ్చేసినట్టేనా?
తారక్ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందా? అసలు విషయం ఏంటంటే
NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది