NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది
ABN , Publish Date - Aug 03 , 2026 | 04:23 PM
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ.. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. తాజాగా కొరటాల శివతో ఆయన చేయనున్న సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ అనే సినిమాలో నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ భారీ మూవీ చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటం ఇదే మొదటిసారి. గతంలో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ ‘సింహా’ సినిమాకు కొరటాల శివ రచయితగా పనిచేశారు. కానీ దర్శకుడిగా నటసింహాన్ని డైరెక్ట్ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. దాంతో బాలయ్యను కొరటాల శివ స్క్రీన్ మీద ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ నెలకొంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అంతేనా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల మూడో వారం నుంచే ప్రారంభించాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఇటీవల బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆయన సంపూర్ణంగా కోలుకున్న తర్వాతే షూట్ ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు. సినీ వర్గాల నుంచి అందుతోన్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. మొదట బాలయ్య లేని సన్నివేశాలను చిత్రీకరించాలని కొరటాల అనుకున్నప్పటికీ, కొరటాల తన ప్లాన్ మార్చుకున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారట కొరటాల శివ. అందుకే ఆయనతోనే మొదటి షెడ్యూల్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. కథ విషయానికి వస్తే, ఇందులో మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో కథ, కథనాలపై బాగా కసరత్తు చేశారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ను ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఇందులో కథానాయికగా కాకుండా, నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే బాలయ్య-ఐశ్వర్య రాజేష్ ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని చెప్పవచ్చు. సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ రానున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
‘సంత’ చిత్రకళా పోటీకి ట్రెమండస్ రెస్పాన్స్.. దర్శకుడు హ్యాపీ!
MS Raju: ‘ఒక్కడు’కు మహేష్, ‘వర్షం’కు ప్రభాస్.. మరి ‘అగధ’కు?
‘వారణాసి’.. జక్కన్న ఇచ్చిన మాస్ అప్‌డేట్ ఇదే!