సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కురుక్షేత్ర యుద్ధంపై జక్కన్న గురి

ABN, Publish Date - Nov 13 , 2026 | 04:21 PM

మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలు బంపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. దాంతో పలువురు నోటెడ్ డైరెక్టర్స్ పౌరాణికాలతో పయనించాలని ఆశిస్తున్నారు. రాజమౌళి సైతం అదే రూటులో సాగుతున్నారని టాక్. ఇంతకూ రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి ?

Rajamouli

పురాణగాథలు, భక్తిభావం, ఆధ్యాత్మికత ఉట్టిపడే కథలను నవతరం ప్రేక్షకులు సైతం విశేషంగా ఆదరిస్తున్నారు. అందుకు 'రామాయణ' అందుకుంటున్న ఆదరణే నిదర్శనం. ఇక 'హనుమాన్ అంశ్', 'ఇరుముడి' వంటి చిత్రాలు సైతం భక్తిభావం నింపుకొని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. రాబోయే రాజమౌళి-మహేశ్ బాబు మూవీ 'వారణాసి'లోనూ మైథలాజికల్ టచ్ ఉందని ఆ సినిమా గ్లింప్స్ వచ్చినప్పటి నుంచీ తెలుస్తోంది. ఈ కోణంలో చూస్తే 'వారణాసి' ఏ మాత్రం సందేహం లేకుండా గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే 'వారణాసి' తరువాత రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రమేంటి అన్న అంశంపై చర్చ విశేషంగా సాగుతోంది. రాజమౌళి ఇకపై తెలుగు సినిమాలు మాత్రమే రూపొందించరని, ఆయన తెరకెక్కించబోయే ప్రతీ చిత్రం గ్లోబల్ టార్గెట్ గా ఉంటుందనీ వినిపిస్తోంది. 'రామాయణ'కు డివైడ్ టాక్ వచ్చినా, నవతరం ప్రేక్షకులు అవేవీ పట్టించుకోకుండా ఇందులోని వీఎఫ్ఎక్స్ వర్క్ కు ఫిదా అయిపోయారు. పదే పదే చూస్తున్నారు. దాంతో 'రామాయణ' అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని తెలుస్తోంది. పైగా రాజమౌళి ఎప్పటి నుంచో 'మహాభారతం' మొత్తాన్ని తెరకెక్కించాలని ఉందని చెబుతూనే ఉన్నారు. కాబట్టి జక్కన్న తరువాతి ప్రాజెక్ట్ 'మహాభారతం' అని గట్టిగా వినిపిస్తోంది.


పౌరాణికాలు తెరకెక్కించాలంటే తెలుగువారికి సాటి మరెవ్వరూ లేరన్నది నిర్వివాదాంశం. రామాయణ, భారతగాథలను తెలుగువారు భలేగా రక్తి కట్టించారు. అందునా నటరత్న యన్టీఆర్ తన అభినయంతోనూ, దర్శకత్వంలోనూ భారతీయ పురాణగాథలకు ప్రాణం పోశారు. ఒకప్పుడు రామానంద సాగర్ తన 'రామాయణం' సీరియల్ తీసే సమయంలోనూ, 'మహాభారతం' ధారావాహిక రూపొందించేటప్పుడు బి.ఆర్.చోప్రా కూడా యన్టీఆర్ ను సంప్రదించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'రామాయణ' గాథను నితేశ్ తివారీ తెరకెక్కించేశారు. అందులో మొదటిభాగం ఘనవిజయం సాధించింది. రెండో భాగం వచ్చే సంవత్సరం దీపావళి కానుకగా రానుంది. ఈ నేపథ్యంలో 'మహాభారతం' కూడా తెరకెక్కితే చూసేందుకు నవతరం ప్రేక్షకులు సైతం సిద్ధంగా ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ గా 'మహాభారతం'ను రూపొందించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. రామాయణంలో కంటే భారతంలో పలు సంఘటలనకు వీఎఫ్ఎక్స్ వర్క్ ను విశేషంగా వినియోగించుకోవచ్చు. ఇప్పటికే తన చిత్రాల్లో గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసిన రాజమౌళి 'మహాభారతం'ను కూడా అదే తీరున రక్తి కట్టిస్తారని పలువురు విశ్వసిస్తున్నారు. స్టార్స్ తో తాను 'మహాభారతం' తీయనని రాజమౌళి గతంలో పేర్కొన్నారు. అలాంటప్పుడు ప్రధాన పాత్రల కోసం ఎంపిక చేస్తారా లేక ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి కొన్ని కేరెక్టర్స్ కోసం దివంగత మహానటుల ఇమేజెస్ ను రీక్రియేట్ చేస్తారా అనీ చర్చలు సాగుతున్నాయి.


'రామాయణ' సినిమా విడుదలైన తరువాత వాల్మీకి రామాయాణాన్ని పూర్తిగా మార్చేసి 'రావణాయణం'గా తెరకెక్కించారని పలువురు విమర్శించారు. యశ్ మినహాయిస్తే మిగిలిన ప్రధానపాత్రధారులు అంతగా నప్పలేదనీ అన్నారు. రాజమౌళి మాత్రం 'రామాయణ' విడుదలయ్యాక రణబీర్, సాయిపల్లవిని కూడా ప్రశంసించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాను సైతం అభినందించారు. హాలీవుడ్ సినిమాలకు సైతం వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా రూపొందించే టెక్ కంపెనీకి నమిత్ మల్హోత్రా అధినేత. అందువల్లే నమిత్ తీసిన 'రామాయణ'ను రాజమౌళి ప్రశంసించారనీ కొందరు అంటున్నారు. అంతేకాదు రాజమౌళి 'మహాభారతం'ను కూడా నమిత్ మల్హోత్రా నిర్మించనున్నారని వినిపిస్తోంది. ఇవన్నీ నిజమే అయితే రాజమౌళి 'మహాభారతం' సెట్స్ కు వెళ్ళక ముందే రికార్డ్ బిజినెస్ చేస్తుందనీ ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. ఇంతకూ 'వారణాసి' తరువాత రాజమౌళి ప్రాజెక్ట్ ఏదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మోక్షజ్ఞ కంటే ముందే.. నందమూరి కుటుంబం నుంచి మరో సినీ ఎంట్రీ!

పుకార్లకు ఫుల్ స్టాప్.. గాడ్ ఆఫ్ వార్ ఆగలేదు

‘SI యుగంధర్’ దర్శకుడితో.. సుధాకర్ కోమాకుల కొత్త ప్రయోగం

Updated Date - Nov 13 , 2026 | 04:43 PM