మోక్షజ్ఞ కంటే ముందే.. నందమూరి కుటుంబం నుంచి మరో సినీ ఎంట్రీ!
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:43 PM
బాలయ్య కూతురు తేజస్విని సినిమాల్లోకి నటిగా కాకుండా నిర్మాతగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారనే ప్రచారం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఆసక్తి రేపుతోంది.
నందమూరి అభిమానులకు ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. ఒకవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఇప్పుడు నందమూరి కుటుంబం నుండి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే, బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్విని (Nandamuri Tejaswini) ఇండస్ట్రీలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారట.
ఇటీవల మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన డెబ్యూ మూవీపై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 'బింబిసార' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్తోనే నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
అయితే, మోక్షజ్ఞ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే, బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్వినికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా స్టార్ హీరోల పిల్లలు హీరోలుగానో, హీరోయిన్లుగానో వెండితెరపై మెరవాలని అనుకుంటారు. కానీ తేజస్విని మాత్రం నటిగా కాకుండా, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఆమెకు తెరవెనుక వ్యవహారాలపై మంచి పట్టు ఉంది. తండ్రి బాలకృష్ణ సినిమాల వ్యవహారాలను దగ్గరుండి చూసుకోవడంతో పాటు, 'ఆహా'లో సూపర్ హిట్ అయిన 'అన్‌స్టాపబుల్' షోకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు పూర్తిస్థాయి ప్రొడ్యూసర్‌గా మారి, ఒక సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
తేజస్విని నిర్మాతగా మారుతున్నారనే వార్త బయటకు రాగానే, ఆమె నిర్మించబోయే మొదటి సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? హీరో ఎవరు? అనే చర్చ మొదలైంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభు (Swayambhu) చిత్ర నిర్మాత భువన్ (Bhuvan), ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారట. నిర్మాతగా ఉన్న భువన్, ఒక కొత్త, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో కూడిన కథను సిద్ధం చేశారట. ఆ కథ తేజస్వినికి విపరీతంగా నచ్చడంతో, వెంటనే ఈ సినిమాను నిర్మించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెలలోనే చాలా గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొన్ని కీలక సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో గతంలో హేబ్బా పటేల్‌తో కలిసి ఏంజల్ సినిమాతో ఆకట్టుకున్న అన్వేష్ (Anvesh) హీరోగా, ప్రముఖ నటుడు బాబీ సింహా (Bobby Simha) కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఇతర నటీనటుల వివరాలను సినిమా ప్రారంభోత్సవం రోజునే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త మాత్రం నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అటు మోక్షజ్ఞ హీరోగా, ఇటు తేజస్విని నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెడుతుండటంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, నిర్మాతగా తేజస్విని తన మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.