సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అన్న కంటే భిన్నంగా.. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం

ABN, Publish Date - Oct 12 , 2026 | 03:13 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటునిగా ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మూడుపదుల సినీ ప్రయాణం ఏ తీరున సాగిందో గుర్తు చేసుకుందాం.

Power Star Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటునిగా ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ మూడు దశాబ్దాల్లోనూ పవన్ నటునిగా, దర్శకునిగా, కథకునిగా, నిర్మాతగా తనదైన బాణీ పలికించారు. పవన్ కళ్యాణ్ మూడుపదుల సినీ ప్రయాణం ఏ తీరున సాగిందో గుర్తు చేసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (AP Deputy CM)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నతమ్మునిగా చిత్రసీమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అనతికాలంలోనే సొంత బాణీ పలికించారు. కళ్యాణ్‌గా తొలిసారి ఆయన కనిపించిన ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’ సినిమా విడుదలై 30 ఏళ్ళు పూర్తయ్యాయి. తొలి సినిమా సమయంలో అన్నచాటు తమ్ముడు.. ప్రస్తుతం అన్నకు తగ్గ తమ్మునిగా పయనిస్తున్నారు పవన్. అన్న సొంత పార్టీ ‘ప్రజారాజ్యం’ పెట్టి, తరువాత కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసి కేంద్రమంత్రిగా సాగారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా సొంతగా ‘జనసేన’ పార్టీ (Janasena Party)ని నెలకొల్పి ఆరంభంలో అపజయాన్ని, తరువాత ఘనవిజయాన్ని సొంతం చేసుకొని ఏపీ డిప్యూటీ సీయమ్‌గా పయనిస్తున్నారు. అలా అన్న బాటలోనే పయనించిన పవన్ కొన్ని విషయాల్లో అన్నకంటే భిన్నంగా సాగారు.


తన కెరీర్‌లో మొదటి నుంచీ పవన్ దూకుడు ప్రదర్శించారు. కళ్యాణ్ పేరుతో అరంగేట్రం చేసిన ఆయన రెండో చిత్రం ‘గోకులంలో సీత’ నుంచి పవన్ కళ్యాణ్‌గా మారారు. వరుసగా ఏడు సినిమాలతో ఒకదానిని మించి మరోటి అన్నట్టుగా విజయాలు సాధించారు. స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కొన్ని చిత్రాల్లో తన ఫైట్స్ తానే కంపోజ్ చేసుకున్నారు పవన్. ఆ పై దర్శకునిగా, కథకునిగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, నిర్మాతగా సాగారు. ఈ విషయాలతోనే తన అన్న కంటే డిఫరెంట్ వేలో పయనించారు పవన్. ఇప్పటి వరకు చిరంజీవి నటునిగా, నిర్మాతగానే సాగారు.. కానీ, పవన్ తనకు ఇష్టమైన రచన, ఫైట్స్, డైరెక్షన్‌లోనూ సాగడం విశేషం. ఏడు వరుస విజయాల తరువాత ఎనిమిదో సినిమా ‘జానీ’తో తానే డైరెక్టర్‌0గా మారారు పవన్. ఈ చిత్రానికి ఆయన రచయితగానూ సాగారు. ‘తమ్ముడు, బద్రి, ఖుషి’ వంటి చిత్రాల్లో తన ఫైట్స్‌ను తానే కంపోజ్ చేసుకున్నారు. ఇక ‘డాడీ’ సినిమాలో తన అన్న చిరంజీవికే ఓ ఫైట్‌కు కో-ఆర్డినేటర్‌గా పనిచేయడం విశేషం. ఆ పై ‘గుడుంబా శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, హరిహర వీరమల్లు’ చిత్రాలకు కూడా పవన్ స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు తానే కథను సమకూర్చి, నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. తన అభిమాని నితిన్ హీరోగా ‘చల్ మోహన్ రంగ’ చిత్రానికీ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారాయన.. ఇలా ఏది చేసినా తనదైన ముద్ర వేస్తూ పయనించారు పవన్.


పవన్ కళ్యాణ్ నటన యువతను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ సినిమాల్లో ధరించిన కాస్ట్యూమ్ స్టైల్స్‌ను అనుకరిస్తూ ఎంతోమంది ఫ్యాన్స్ అలాంటి దుస్తులు వేసుకొని మురిసిపోయారు. అలాగే పవన్ ఆదర్శభావాలనూ ఎంతోమంది లైక్ చేశారు. కొందరు పవన్ ఆలోచనలను ‘పవనిజమ్’ అంటూ అభిమానించారు. ఆ అభిమానంతోనే ఎంతోమంది పవన్ కళ్యాణ్ వెంట కదిలారు. 2014 రాష్ట్రవిభజన సమయంలో ఆయన నుంచి ‘జనసేన’ పార్టీ వెలసింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ‘జనసేన’ సహకారం సాగింది.. ఏపీలో రెండోసారి కూటమి ప్రభుత్వంలో ‘జనసేన’ కూడా భాగస్వామిగా నిలచింది. ఓ వైపు రాజకీయాల్లో సాగుతూనే అభిమానులను అలరించేందుకు సినిమాల్లో నటిస్తున్నారు పవన్. డిప్యూటీ సీయమ్ అయ్యాక పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో ‘ఓజాస్ గంభీర’ (OG)గా పవన్ ఫ్యాన్స్‌కు పరమానందం పంచారు. రాబోయే రోజుల్లోనూ పవన్ అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ తనదైన బాణీ పలికిస్తారేమో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’ న్యూ పోస్టర్ అదిరింది.. అడ్వాన్స్ బుకింగ్స్ అప్డేట్

సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం

ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి.. అంతర్జాతీయ పురస్కారం

Updated Date - Oct 12 , 2026 | 03:13 PM