యన్టీఆర్-త్రివిక్రమ్ పౌరాణిక చిత్రంపై క్రేజీ అప్డేట్
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:56 PM
పౌరాణికాలకు పెట్టింది పేరు నందమూరి నటవంశం. అందులో యంగ్ టైగర్ యన్టీఆర్ సైతం కొన్ని పౌరాణిక పాత్రలతో అలరించారు. ఇప్పుడు షణ్ముఖ పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నారు యన్టీఆర్.. ఆ ముచ్చటేంటో చూద్దాం.
పౌరాణికాలకు పెట్టింది పేరు నందమూరి నటవంశం. అందులో యంగ్ టైగర్ యన్టీఆర్ (Young Tiger NTR) సైతం కొన్ని పౌరాణిక పాత్రలతో అలరించారు. ఇప్పుడు షణ్ముఖ పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నారు యన్టీఆర్.. ఆ ముచ్చటేంటో చూద్దాం. యంగ్ టైగర్ యన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో హారికా అండ్ హాసిని బ్యానర్ పై ఓ పౌరాణిక చిత్రం రూపొందనుందని ఇదివరకే ప్రకటించారు. ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది? ఏ తీరున సాగనుంది? అన్న అంశాలపై సినీ ఫ్యాన్స్‌లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తన తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం’ ప్రమోషన్స్‌లోనే త్రివిక్రమ్ - యన్టీఆర్‌తో తన పౌరాణిక సినిమాపై ఓ క్లారిటీ ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. ఇక విషయానికి వస్తే వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘ఆదర్శకుటుంబం’ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే జగపతిబాబు నిర్వహిస్తోన్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ -2 కార్యక్రమంలో త్రివిక్రమ్, నటుడు సునీల్, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు. వారితో జగపతిబాబు సరదా సంభాషణ చేశారు. అందులోనే యన్టీఆర్‌తో త్రివిక్రమ్ రూపొందించబోయే పౌరాణిక చిత్రం ప్రస్తావన వచ్చింది. అందుకు స్పందిస్తూ త్రివిక్రమ్ ఇచ్చిన సమాధానం సినీ ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగిస్తూండగా, యన్టీఆర్ అభిమానుల్లో ఆనందం నింపింది.
యన్టీఆర్‌తో తాను తీయబోయే పౌరాణికం ‘సాక్షాత్తూ దైవసంకల్పమే’ అని త్రివిక్రమ్ చెప్పారు. తన మనసులో ఆరు ముఖాలు కలిగిన రూపం ప్రత్యక్షం కాగానే, సంభాషణలు వాటంతట అవే కవిత్వమై ప్రవహించాయని త్రివిక్రమ్ తెలిపారు. కేవలం అది తన ఆలోచన మాత్రమే కాదని, అదంతా దైవ సంకల్పమే అని త్రివిక్రమ్ అన్నారు. ఆరు ముఖాలు అంటే షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యస్వామియే అని తెలుస్తోంది. దేవసేనాని అయిన కుమారస్వామిని ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనీ పిలుస్తారు. అందువల్లే యన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరు కూడా విశేషంగా వినిపిస్తోంది. ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన సూర్యదేవర నాగవంశీ ఈ టైటిల్ అధికారమైంది కాదని తేల్చిచెప్పారు. దాంతో యన్టీఆర్ - త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ టైటిల్ ఏమయి ఉంటుందన్న చర్చ మళ్ళీ మొదలయింది.
‘ఆదర్శకుటుంబం’ (Aadarsha Kutumbam House No: 47) విషయానికి వస్తే.. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమయింది. మరి త్రివిక్రమ్ తరువాతి ప్రాజెక్ట్ యన్టీఆర్‌తో రూపొందించబోయే పౌరాణికమే అని తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ ఏమైనా, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం యన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమాలోనే యన్టీఆర్ నటిస్తారని తెలుస్తోంది. నందమూరి నటవంశంలో ఇప్పటికే నటరత్న యన్టీఆర్ అనేక పౌరాణిక పాత్రలతో విశ్వరూపం చూపించారు. ఆయన నటవారసుడు బాలకృష్ణ సైతం కొన్ని పురాణ పాత్రలతో మెప్పించారు... నందమూరి నటవంశం మూడోతరం స్టార్ హీరో అయిన యన్టీఆర్ కూడా తాత-బాబాయ్ చూపిన బాటలోనే మైథలాజికల్ మూవీస్‌లో తనదైన బాణీ పలికిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి కుమారస్వామిగా యన్టీఆర్ ఏ తీరున మురిపిస్తారో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ కోసం ‘మిరాయ్’ డైరెక్టర్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్
Prabhas: టాలీవుడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే
నిజమైన హీరోలేనా.. లేక ‘డూప్’లా? ‘జైలర్ 2’తో మొదలైన కొత్త చర్చ