RC17కు ‘దేవి శ్రీ ప్రసాద్’ ఉంటారా? క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్
ABN , Publish Date - Oct 21 , 2026 | 09:49 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC17 పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే దానిపై మైత్రీ నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో రానున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC17 పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఉంటారా లేదా అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన ‘దొంగ నా కొడుకు’ (Donga Na Koduku) టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత వై. రవిశంకర్ ఈ విషయంపై స్పందించి పూర్తి స్పష్టతనిచ్చారు.
ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘దేవి శ్రీ ప్రసాద్ ఒక స్టాల్వర్ట్ మ్యూజిక్ డైరెక్టర్. దేశాన్ని ఊపేసే సంగీతాన్ని అందించే సత్తా ఆయనలో ఎప్పుడూ ఉంది. అలాంటి వ్యక్తి గురించి ఇంత ఓపెన్ డిబేట్లు జరగడం సరికాదు. సుకుమార్ – దేవి కాంబినేషన్ ఇప్పటివరకు మిస్ అవ్వలేదు. మైత్రీ మూవీ మేకర్స్‌లో దేవి శ్రీ ప్రసాద్‌తో ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, పుష్ప-1, పుష్ప-2, ఉప్పెన’ వంటి 7 సినిమాలు చేశాం. ఏడింటికి ఏడూ ఆణిముత్యాల్లాంటి సంగీతాన్ని అందించారు. మా సంస్థకు సంబంధించి ఆయన కంటే గొప్ప సంగీత దర్శకుడు మరొకరు లేరు’’ అని కొనియాడారు.
ఇక RC17కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘సుకుమార్ గారు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఆయన ఇక్కడికి వస్తారు. ఒకవేళ ఇన్నేళ్లుగా ఒకరితోనే ట్రావెల్ అయ్యాం కదా, వేరే వాళ్లతో చేయాలని దర్శకుడు భావిస్తే అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం అవుతుంది. డీవోపీ సహా కాస్ట్ అండ్ క్రూ ఏదీ ఇంకా ఫైనల్ కాలేదు. సుకుమార్ గారు వచ్చాకే అన్నీ అధికారికంగా ఖరారవుతాయి. ఒకవేళ దర్శకుడు వేరే ఆలోచనతో ఉంటే స్వయంగా ఆయనే దేవికి చెప్తారు. దేవి శ్రీ ప్రసాద్ కూడా ‘అయ్యో ప్రాజెక్ట్ మిస్ అయిపోయింది’ అని ఫీల్ అయ్యే వ్యక్తి కాదు. ఆయన మాకు కుటుంబ సభ్యుడి లాంటివారు, సుకుమార్ గారికి సోదరుడితో సమానం. ఒక సినిమా కాకపోతే మరో సినిమా కలిసి చేస్తాం తప్ప మా మధ్య ఎలాంటి మనస్పర్థలు ఉండవు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తుది నిర్ణయం సుకుమార్ గారు లండన్ నుంచి వచ్చాకే తెలుస్తుంది’’ అని నిర్మాత రవిశంకర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
‘వృషకర్మ’ పోస్టర్‌లో డివైన్ వైబ్స్.. నాగచైతన్య ఇంటెన్స్ లుక్ అదుర్స్
రగ్గడ్ లుక్‌లో రామ్ చరణ్.. ‘RC17’ స్క్రిప్ట్ రీడింగ్‌లో.. పిక్ వైరల్
నవ్వుల రాబరీ మొదలైంది.. హిలేరియస్‌గా ‘దొంగ నా కొడుకు’ టీజర్