నిజమైన హీరోలేనా.. లేక ‘డూప్’లా? ‘జైలర్ 2’తో మొదలైన కొత్త చర్చ

ABN , Publish Date - Oct 22 , 2026 | 09:09 PM

బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. థియేటర్ల దగ్గర పాలాభిషేకాలు, పూలదండలు, ఈలలు, గోలలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు స్టార్ హీరోల విషయంలో ఓ ఆసక్తికర చర్చ ప్రేక్షకులలో నడుస్తోంది.

body double debate

బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. థియేటర్ల దగ్గర పాలాభిషేకాలు, పూలదండలు, ఈలలు, గోలలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. వందల కోట్ల బడ్జెట్, హీరోలకు పదుల కోట్ల రెమ్యునరేషన్లు, కటౌట్లతో సాగే ప్రచారాలు.. ఇవన్నీ కేవలం తమ అభిమాన హీరోను వెండితెరపై చూసి కేరింతలు కొట్టడానికే. అయితే, తాజాగా ‘జైలర్ 2’ (Jailer 2) సినిమా చుట్టూ ముసురుకున్న ఓ ఆసక్తికరమైన వివాదం ఇప్పుడు యావత్ సినీ పరిశ్రమలోనే కాదు.. సాధారణ ప్రేక్షకుల్లోనూ ప్రశ్నను లేవనెత్తింది. థియేటర్లలో టికెట్ కొని మనం చూస్తోంది నిజంగా మన హీరోల నటననేనా? లేక బాడీ డూపులు, కెమెరా ట్రిక్స్, అత్యాధునిక సాంకేతికత సృష్టించిన భ్రమనా? అనే అనుమానం కలుగుతోంది.


ఇటీవల మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal)కు బాడీ డూప్‌గా వ్యవహరించిన జోబి కొడకర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. క్లైమాక్స్ డ్రైవింగ్ సన్నివేశాల్లో, చేతులు, కాళ్లు కనిపించే కొన్ని షాట్లలో తాను నటించానని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, సోషల్ మీడియాలో రజనీకాంత్ (Super Star Rajinikanth) సన్నివేశాలపై కూడా విస్తృతమైన ప్రచారం సాగుతోంది. సినిమాలో రజనీ స్వయంగా నటించింది కేవలం 20 శాతం మాత్రమేనని, మిగిలిన 80 శాతం సన్నివేశాలను బాడీ డూపులు, సాంకేతిక హంగులతోనే మేనేజ్ చేశారంటూ కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై అధికారికంగా చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పష్టత రానప్పటికీ, ఈ చర్చ మాత్రం సినీ ప్రేమికులను ఆలోచనలో పడేసింది.

సినిమా రంగంలో కష్టతరమైన, అత్యంత ప్రమాదకరమైన స్టంట్ సీక్వెన్స్‌లలో బాడీ డూప్‌లను ఉపయోగించడం ఏనాటి నుంచో ఉన్న సాధారణ ప్రక్రియే. హీరోల భద్రత దృష్ట్యా అది తప్పనిసరి కూడా. అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, సాధారణ సన్నివేశాల్లో సైతం డూప్‌ల వాడకం మితిమీరిపోతోందన్న వార్తలే ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురిచేస్తున్నాయి. పోస్టర్ల మీద హీరోల ముఖాలు చూసి, వారి స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే జనాలు తమ కష్టార్జితాన్ని వెచ్చించి థియేటర్లకు వస్తారు. అలాంటిది నటన, బాడీ లాంగ్వేజ్‌లోనూ సగానికి పైగా డూపులే కనిపించే పరిస్థితి వస్తే, అది అభిమానుల నమ్మకాన్ని దెబ్బతీసినట్లే అవుతుంది.


ప్రస్తుత డిజిటల్ యుగంలో అధునాతన వీఎఫ్‌ఎక్స్, డీ-ఏజింగ్, ఏఐ టెక్నాలజీలు ఎంత అద్భుతమైన విజువల్స్ సృష్టించగలిగినా.. ఒక సూపర్‌స్టార్‌కి, ఆడియన్స్‌కి మధ్య ఉండే సహజమైన ఎమోషనల్ కనెక్టివిటీని ఏ సాంకేతికతా భర్తీ చేయలేదు. ఆ కనెక్షన్ వల్లే టికెట్‌కి నిజమైన విలువ చేకూరుతుంది. మరి పెరుగుతున్న ఈ టెక్నాలజీ హంగుల నడుమ.. తెరపై స్టార్ల సహజమైన ఉనికి ఎంతవరకు ఉంటోందనేది ఇప్పుడు ఇండస్ట్రీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏజ్‌కు తగిన సినిమాలు చేసే వారు కూడా.. ఇప్పుడీ బాట పట్టడంతో.. కేవలం స్టార్‌డమ్‌తోనే ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారనేలా.. అన్ని సినీ ఇండస్ట్రీస్‌లోనూ చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’ టికెట్ ధరలు.. దిల్ రాజు కీలక నిర్ణయం

స్టార్ హీరోతో ప్రభుదేవా సినిమా.. దర్శకుడిగా టాలీవుడ్‌ రీఎంట్రీ

చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు.. సూపర్‌స్టార్‌కే సాధ్యం: అల్లు అర్జున్

Updated Date - Oct 22 , 2026 | 09:09 PM

Jailer 2 Trailer: ఈ కాలపు స్టైల్.. అక్కడే బాంబు పెట్టడం 

Jailer 2: జైలర్ అరాచకం వెనకాల జరిగింది ఇదే..

Jailer 2: సూరజ్, సూర్య, విద్యాబాలన్.. ఎంతమందిని దింపుతావయ్యా నెల్సన్

Jailer 2: గుండెల్నే పరిపాలించే ప్రేమికుడేలే.. అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చిపడేశాడు

Jailer 2: టైగర్.. ముత్తువేల్ పాండియన్ మళ్లీ వచ్చాడు