మొన్న ‘వారణాసి’.. ఇప్పుడు ‘NBK111’.. యాక్షన్ ఎపిసోడ్ లీక్!
ABN, Publish Date - Jun 01 , 2026 | 11:10 AM
సినిమా విడుదలైన తర్వాత పైరసీ.. విడుదలకు ముందు లీకులు.. సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నవి ఇవే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఈ లిస్ట్‌లోకి NBK111 కూడా చేరింది.
సినిమా విడుదలైన తర్వాత పైరసీ.. విడుదలకు ముందు లీకులు.. సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నవి ఇవే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఇక లీకుల విషయానికి వస్తే.. చిన్న సినిమాల విషయంలో ఇది అంతగా పని చేయడం లేదు కానీ, స్టార్ హీరోల సినిమాలకు మాత్రం పెద్ద డ్యామేజ్‌గా ఈ లీకులు మారుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమా లీకుల విషయంలో ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తుందో తెలియంది కాదు. ఇప్పుడు సెట్స్‌పై ఉన్న నటసింహం బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబో మూవీ ‘NBK111’ను కూడా ఈ లీకులు వెంటాడుతున్నాయి.
‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య, గోపీచంద్ కాంబో మరోసారి కలిసి చేస్తున్న చిత్రమిది. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను ఒక భారీ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాలని భావించినప్పటికీ, కథా చర్చల అనంతరం దీనిని ఒక సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా మార్చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ ముంబై నగరంలో శరవేగంగా జరుగుతోంది. మరి ఎవరు లీక్ చేశారో ఏమో కానీ, సినిమాలో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో చిత్రయూనిట్ షాకైనట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్.. బాలయ్య గెటప్‌కు ఫిదా అవుతున్నారు. ‘మరో బ్లాక్‌బస్టర్ వస్తోంది.. రాసిపెట్టుకోండి’ అంటూ హంగామా మొదలెట్టారు. కీలక సన్నివేశం లీకైందని బాధపడాలో.. ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నందుకు సంతోషపడాలో తెలియని కన్ఫ్యూజన్‌లో చిత్రయూనిట్ ఉంది. మరోవైపు ఈ లీక్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇలాంటి ప్రమాదం తరచూ సంభవించే అవకాశం ఉందని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు (‘పెద్ది’ నిర్మాత) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ, అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఇవి కూడా చదవండి:
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా?