నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. పర్సనాలిటీ రైట్స్‌పై సంచలన ఆదేశాలు
ABN, Publish Date - May 29 , 2026 | 01:09 PM
అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అనుమతి లేకుండా పేరు, ఫోటో, కంఠస్వరం వాడటంపై కోర్టు నిషేధం విధించింది.
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)కు ఢిల్లీ హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) కాపాడుతూ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వీడియోలు, ముఖం, వాయిస్ వాణిజ్యపరంగా ఉపయోగించడాన్ని కోర్టు తాత్కాలికంగా నిషేధించింది.
ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్‌సైట్లలో సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు ఉపయోగించి నకిలీ ప్రకటనలు, ఫేక్ ప్రమోషన్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో నాగచైతన్య ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు, వ్యక్తిగత గౌరవం, సెలబ్రిటీ హక్కులు చట్టపరంగా రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున పేరును అశ్లీల కంటెంట్‌తో ముడిపెట్టిన కొన్ని వెబ్‌సైట్లపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వెబ్‌సైట్లను తక్షణమే బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సెలబ్రిటీల ఇమేజ్‌ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.
డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ పెరుగుతున్న ఈ సమయంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై ఈ తీర్పు కీలక మైలురాయిగా మారనుంది. భవిష్యత్తులో ఇతర సినీ ప్రముఖులు కూడా తమ హక్కుల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?
‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!