మోక్షజ్ఞ ఎంట్రీకి మెగా బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
ABN, Publish Date - Nov 27 , 2026 | 08:43 PM
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తరుణం.. నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ. ఇదిగో అదిగో అనే మాటల నుంచి దర్శకుడి సెలక్షన్ వరకు వచ్చింది కానీ.. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యమవుతుందనేలా టాక్ మొదలైంది.
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తరుణం.. నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయి. మొదటి సినిమానే ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠ (Mallidi Vassishta)తో, అదీనూ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ.. ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చి నెలలు గడిచిపోతున్నా, ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.
మోక్షజ్ఞ సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమా అని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ‘బింబిసార’ తర్వాత దర్శకుడు వశిష్ఠకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. భారీ సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara)పై అనౌన్స్మెంట్ రోజు నుంచే విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. అయితే, ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో చిత్ర బృందం అప్రమత్తమైంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు.
తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే దర్శకుడు వశిష్ఠ విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తున్నాడట. ప్రస్తుతం ట్రైలర్ కట్, ఆర్టిస్టుల డబ్బింగ్ పనులతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడట. ‘విశ్వంభర’ థియేటర్లలోకి వచ్చేంత వరకు వశిష్ఠ వేరే ఏ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. మరోవైపు, సంక్రాంతికి రావడం పక్కా అని లీక్స్ వస్తున్నప్పటికీ, నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం అభిమానుల్లో అయోమయాన్ని ఇంకా పెంచుతోంది. ఇంకోవైపు, ‘కాకా’ సినిమా జనవరి 13న వచ్చేస్తుందంటూ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పదనే చర్చ కూడా నడుస్తోంది.
ఈ వ్యవహారమంతా ఒక కొలిక్కి వచ్చి, ‘విశ్వంభర’ థియేటర్లలో అడుగుపెట్టిన కొద్దిరోజుల వరకు మోక్షజ్ఞకు వెయిటింగ్ తప్పదు. అంతేకాదు, ‘విశ్వంభర’ రిలీజైన వెంటనే కూడా మోక్షజ్ఞ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదట. వశిష్ఠ ముందుగా మోక్షజ్ఞ సినిమా స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చి, పూర్తి స్థాయి నేరేషన్‌కు సిద్ధం చేయాలి. ఆ తర్వాత బాలకృష్ణకు కథ వినిపించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలి. అనంతరం మంచి ముహూర్తం చూసి సినిమాను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి ఎంతలేదన్నా మరో మూడు నాలుగు నెలల సమయం పట్టేలా ఉంది. అయితే, సినిమా ప్రారంభించడం కాస్త ఆలస్యమైనా సరే, అవుట్‌పుట్ మాత్రం నందమూరి అభిమానులకు ఒక గొప్ప కానుకలా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ‘విశ్వంభర’ టీజర్ విషయంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని, మోక్షజ్ఞ ప్రాజెక్ట్ విషయంలో వశిష్ఠ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సినీ విశ్లేషకులు, అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
‘సమ్మర్ హాలీడేస్’కు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
విరాట్ కర్ణ నెక్ట్స్ ఫిల్మ్‌కు చిరు ఫిల్మ్ టైటిల్.. గ్లింప్స్ అదిరింది
బాలయ్య - కొరటాల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?